విజయనగరం ఎంపీ అభ్యర్థి ఎవరు? అధికార, విపక్షాలకు సవాల్

మూడు నాలుగు నెలలుగా రకరకాల పేర్లు ప్రచారం జరిగినా, ఇంతవరకు ఎవరికీ గ్రీన్‌సిగ్నల్‌ లభించలేదు. కొద్దిరోజుల్లో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నందున..

విజయనగరం ఎంపీ అభ్యర్థి ఎవరు? అధికార, విపక్షాలకు సవాల్

Vizianagaram MP Candidate

Vizianagaram MP Candidate : కౌన్‌ బనేగా విజయనగరం ఎంపీ..? ఏ ఒక్క పార్టీకో కాదు.. అధికార, విపక్షాలకు పెద్ద చిక్కుముడిగా మారింది విజయనగరం ఎంపీ అభ్యర్థి ఎంపిక. సిట్టింగ్‌ ఎంపీని కొనసాగించాలా? కొత్త వారికి చాన్స్‌ ఇవ్వాలా? అన్న తర్జనభర్జనలో అధికార పార్టీ ఉండగా, సీనియర్లు సీన్‌ నుంచి తప్పుకోవడంతో కొత్తముఖాల కోసం జల్లెడ పట్టి వెదుకుతోంది టీడీపీ. మరో పది పదిహేను రోజుల్లో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నా, రెండు పార్టీల్లోనూ స్పష్టత లేకపోవడమే చర్చకు తావిస్తోంది.

ఎంపీ బెల్లానకు మరోచాన్స్‌ వస్తుందా?
విజయనగరం ఎంపీ అభ్యర్థి ఎంపిక అధికార, విపక్షాలకు తలనొప్పిగా మారింది. ఉత్తరాంధ్రలోని కీలక నియోజకవర్గమైన విజయనగరం పార్లమెంట్‌ స్థానంలో మంత్రి బొత్సకు గట్టి పట్టుంది. గతంలో బొత్స సతీమణి ఝాన్సీలక్ష్మి విజయనగరం ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ తరఫున సీనియర్‌ నేత అశోక్‌గజపతిరాజు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్‌ వ్యవహరిస్తున్నారు. ఐతే ఎంపీ బెల్లానకు మరోచాన్స్‌ వస్తుందా? రాదా? అన్న చర్చ జరుగుతోంది.

రెండోసారి పోటీ చేసి ఓటమి చవిచూడటం ఆనవాయితీ..
2009లో ఏర్పాటైన విజయనగరం లోక్‌సభ స్థానంలో ఒకసారి కాంగ్రెస్‌, మరోసారి టీడీపీ, గత ఎన్నికల్లో వైసీపీ గెలిచాయి. ఇప్పటివరకు జరిగిన మూడు ఎన్నికల్లో ఒకసారి గెలిచిన పార్టీ మళ్లీ గెలవలేదు. అదే విధంగా ఒకసారి పోటీ చేసిన వారు.. రెండోసారి పోటీ చేసి ఓటమి చవిచూడటం ఇక్కడి ఆనవాయితీగా కనిపిస్తోంది. 2009లో ఎంపీగా గెలిచిన బొత్స ఝాన్సీలక్ష్మి ఆ తర్వాత జరిగిన 2014లో ఓటమి చవిచూశారు. 2014లో ఎంపీగా గెలిచిన కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు గత ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి మూటగట్టుకున్నారు. ఇక ప్రస్తుత ఎంపీ బెల్లానకు టికెట్‌ వస్తుందా? రాదా? అన్న క్లారిటీ లేదు. ఆయన పనితీరుపై పెద్దగా వ్యతిరేకతగాని, అలా అని అంత సానుకూలత కాని కనిపించడం లేదు. దీంతో బెల్లానను కొనసాగించడంపై వైసీపీ అధిష్టానం తర్జనభర్జన పడుతోంది.

ఆ కారణంతో మజ్జి శ్రీనివాసరావుకు నో ఛాన్స్..
వాస్తవానికి విజయనగరం ఎంపీగా జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు పేరును చాలా సీరియస్‌గా పరిశీలించింది అధిష్టానం. వైసీపీలో మార్పుల ప్రక్రియ చేపట్టిన తొలినాళ్లలోనే మజ్జి శ్రీనివాసరావును విజయనగరం పార్లమెంట్‌ సమన్వయకర్తగా నియమిస్తారని ప్రచారం జరిగింది. ఐతే అనూహ్యంగా విశాఖ పార్లమెంట్‌ ఇన్‌చార్జిగా మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి నియామకంతో విజయనగరంలో మజ్జి శ్రీనివాసరావుకు అవకాశాలు తగ్గిపోయాయి. మంత్రి బొత్సకు స్వయాన మేనల్లుడు అయిన మజ్జి శ్రీనివాసరావుకు ఎంపీగా అవకాశం ఇస్తే బొత్స కుటుంబంలో ఐదు టికెట్లు కేటాయించినట్లు అవుతోంది. ఇది విమర్శలకు కారణమయ్యే అవకాశం ఉండటంతో జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు పేరు దాదాపు తెరమరగైందంటున్నారు.

ఇక ప్రస్తుత ఎంపీ బెల్లానకు ప్రత్యామ్నాయంగా ఒక్క మజ్జి శ్రీనివాసరావు మాత్రమే కనిపించేవారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ బెల్లానకు అవకాశాలు మెరుగయ్యాయంటున్నారు. మంత్రి బొత్సకు శిష్యుడిగా గుర్తింపు పొందిన బెల్లానకు జడ్పీ చైర్మన్‌తో కొంత గ్యాప్‌ ఉందనే ప్రచారం ఉంది. కానీ, బొత్స అండదండలతో బెల్లానే ఎంపీగా బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.

టీడీపీకి సవాల్‌గా మారిన అభ్యర్థి ఎంపిక..
ఇక టీడీపీలో ఎంపీ అభ్యర్థి ఎవరన్నది మిలయన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ పోటీ చేస్తానంటే.. ఆయనే అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. కానీ, అశోక్‌ కొంతకాలంగా తన బంగ్లా దాటి రావడం లేదు. అశోక్‌ కుమార్తె అదితి విజయలక్ష్మి గజపతిరాజుకి విజయనగరం అసెంబ్లీ టికెట్‌ ఇచ్చింది టీడీపీ. ఆమె ప్రచారం ప్రారంభించినా, అశోక్‌ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. అడపాదడపా మాత్రమే వచ్చి వెంటనే వెళ్లిపోతున్నారు. అశోక్‌ శైలిని పరిశీలిస్తున్న వారు ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. దీంతో విజయనగరం ఎంపీ అభ్యర్థి ఎంపిక టీడీపీకి సవాల్‌గా మారింది.

కాస్తోకూస్తో పేరున్న నేతలు అంతా ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఎంపీ అభ్యర్థిగా చాలా మంది పేర్లు పరిశీలిస్తోంది టీడీపీ. అశోక్‌ పోటీ చేయనంటే, జిల్లా పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునకు ఎంపీగా అవకాశం ఇవ్వాలని భావించింది పార్టీ. నాగార్జున ఇన్‌చార్జిగా ఉన్న చీపురుపల్లిలో మాజీ మంత్రి గంటా లేదంటే మాజీ ఎమ్మెల్యే మీసాల గీతను పోటీకి పెట్టాలని భావిస్తోంది టీడీపీ. ఐతే గంటా పేరు తెరపైకి వచ్చిన నుంచి అలక వహించిన నాగార్జున పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. కీలకమైన ఎన్నికల సమయంలో ఇటు పార్టీ అగ్రనేతలకు.. అటు కేడర్‌కు దూరంగా ఉండటం… పైగా ఇతర ప్రైవేటు వివాదాల వల్ల ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ పక్కన పెట్టిందంటున్నారు.

బంగార్రాజుకు మెరుగైన అవకాశాలు..
ఇక విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, నెల్లిమర్ల టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజుతోపాటు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ యజమాని పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే గీతకు విజయనగరంలో చాన్స్‌ దక్కనందున, చీపురుపల్లిలో పోటీకి పెట్టాలని ముందుగా భావించింది. ఐతే మాజీ మంత్రి గంటాయే అక్కడ బలమైన అభ్యర్థని సర్వేల్లో తేలిందని అంటున్నారు. దీంతో గీతను ఎంపీ అభ్యర్థిగా పరిశీలిస్తున్నారు. ఐతే ఆమె అభ్యర్థిత్వాన్ని మాజీ మంత్రి అశోక్‌ వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా నెల్లిమర్ల టికెట్‌ దక్కని బంగార్రాజు పేరు తెరపైకి వచ్చింది. నెల్లిమర్ల సీటును జనసేనకు కేటాయించడంతో బంగార్రాజు ఎమ్మెల్యే కలలు ఫలించలేదు. దీంతో ఎంపీ అభ్యర్థిగా బంగార్రాజుకు అవకాశాలు మెరుగయ్యాయంటున్నారు. ఏదైనా సరే నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన వారినే ఎంపీగా పోటీకి పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

ఇలా రెండు ప్రధాన పార్టీలకు ఎంపీ అభ్యర్థి ఎంపిక సవాల్‌గా మారిందంటున్నారు పరిశీలకులు. మూడు నాలుగు నెలలుగా రకరకాల పేర్లు ప్రచారం జరిగినా, ఇంతవరకు ఎవరికీ గ్రీన్‌సిగ్నల్‌ లభించలేదు. కొద్దిరోజుల్లో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నందున త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు.

Also Read : వైసీపీలోకి ముద్రగడ..? పిఠాపురంలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు