Kishan Reddy : ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కోర్టుల చుట్టూ కొన్ని రోజులు తిరిగారు. నేను మహిళను అని చెప్పి మరికొన్ని రోజులు తప్పించుకుని తిరిగారు.

Kishan Reddy : ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. నేరం చేయనప్పుడు కవితకు భయమెందుకు? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈడీ విచారణకు కవిత సహకరించాలని ఆయన సూచించారు. ఇన్నాళ్ళు విచారణకు సహకరించకుండా కవిత తప్పించుకుని తిరిగారని అన్నారు. విచారణకు సహకరించ లేదు కాబట్టే.. ఈడీనే ఆమె ఇంటికి వెళ్ళిందన్నారు. బీఆర్ఎస్ పై కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం బీజేపీకి లేదని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. విచారణ సంస్థలు తమ పని తాము చేసుకుని పోతాయని వ్యాఖ్యానించారు.

”కవిత ఇంట్లో ఈడీ సోదాలపై బీజేపీకి సంబంధం లేదు. నేను కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. కవితపైన కక్ష సాధింపు చేయాల్సిన అవసరం మాకు లేదు. ఆమె మీద అనేక రకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈడీ రైడ్స్.. విచారణలో భాగమే. ఈడీ విచారణకు రాకుండా చాలా రోజులుగా అనేక కారణాలు చూపిస్తూ కవిత తప్పించుకుంటున్నారు. వాస్తవంగా లిక్కర్ స్కామ్ లో కవిత నిర్దోషి అయితే, ఆమె ప్రమేయం లేకపోతే ఈడీ, సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ కోర్టుల చుట్టూ కొన్ని రోజులు, నేను మహిళను అని చెప్పి మరికొన్ని రోజులు తిరిగారు. నేరం చేసిన వ్యక్తులు ఎవరైనా ఒక్కటే. ఎలాంటి వివక్ష ఉండదు. ఆమె నేరం చేయకపోతే విచారణ సంస్థల ముందుకు రావాలి. తన నిర్దోషిత్వాన్ని ప్రకటించుకోవాలి” అని కిషన్ రెడ్డి అన్నారు.

అటు.. బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడంపైనా కిషన్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ లో టికెట్లు రాని నాయకుల ఇంటికి వెళ్లకుండా బీజేపీ నాయకుల ఇంటికి వెళ్లటం దేశంలో మొదటిసారి చూస్తున్నాం అని కిషన్ రెడ్డి అన్నారు. ”కాంగ్రెస్ నాయకులు అనేక మందికి టికెట్లు రాలేదు. జితేందర్ ఇంటికి కాదు ముందు మీ నాయకుల ఇళ్లకి వెళ్లండి. ఒక సీఎం ఇలా వెళ్లటం దేశంలోనే ఇదే మొదటిసారి” అని కిషన్ రెడ్డి అన్నారు.

Also Read : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. ఆమె ఇంటి వద్ద హైటెన్షన్