బీజేపీలోకి వైసీపీ ముఖ్య నేత బుగ్గన? ఆ భయంతోనే పార్టీ మారనున్నారా?

బుగ్గన ఎపిసోడ్‌ వైసీపీలో కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతానికి జగన్‌కు దూరంగా ఉంటున్న బుగ్గన... అధినేతను కలిసి ఈ ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సి వుంటుంది. లేదంటే మౌనం అర్థాంగికారమని భావించాల్సి వుంటుందని అంటున్నారు పరిశీలకులు.

బీజేపీలోకి వైసీపీ ముఖ్య నేత బుగ్గన? ఆ భయంతోనే పార్టీ మారనున్నారా?

Gossip Garage : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి వైసీపీని మరింత కష్టాల్లోకి నెడుతోందా? పార్టీలో ప్రధాన నేతలుగా చలామణి అయిన నేతలు ఒక్కొక్కరుగా తప్పుకునే ప్లాన్‌ చేస్తున్నారా? మొన్న పెద్దిరెడ్డి… ఇప్పుడు బుగ్గన బీజేపీలో చేరతారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? వైసీపీ శ్రేణులను మానసికంగా కుంగదీయడానికి ప్రత్యర్థులు ఈ ప్రచారం చేస్తున్నారా? లేక పరిస్థితులు బాగాలేవని నేతలే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా? వైసీపీలో ఏం జరుగుతోంది?

వైసీపీ కీలక నేతలు పార్టీ మారనున్నారనే ప్రచారం..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో పరిస్థితులు గందరగోళంగా మారుతున్నాయి. ఎన్నికలకు ముందు మార్పు, చేర్పుల్లో భాగంగా పలువురు నేతలు పార్టీలు మారగా, ప్రస్తుతం ఓటమితో పార్టీ బలహీనపడిపోయిందని మరికొందరు తట్టాబుట్టా సర్దేయాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో సీనియర్‌ నేతలు, మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులు పేర్లు ఉండటం పొలిటికల్‌ సర్కిల్స్‌లో విస్తృత చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా వైసీపీలో కీలక నేతలుగా…. గత ప్రభుత్వంలో ముఖ్యమైన శాఖలకు మంత్రులుగా పనిచేసిన నేతలు పార్టీ మారనున్నారనే ప్రచారం హీట్‌ పుట్టిస్తోంది.

అప్పుడు పెద్దిరెడ్డి, ఇప్పుడు బుగ్గన..?
ఫలితాలు వెల్లడైన వెంటనే పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వైసీపీని వీడనున్నారని, ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. ఐతే రాజంపేట ఎంపీ, పెద్దిరెడ్డి తనయుడు మిథున్‌రెడ్డి ఈ ప్రచారాన్ని ఖండించి ఊహాగానాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ఐతే ఇప్పుడు ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బీజేపీలో చేరతారని కొత్తగా ప్రచారం జరుగుతోంది. దీంతో రాయలసీమ వైసీపీ శ్రేణుల్లో కలకలం చెలరేగుతోంది.

రాష్ట్రానికి నిధులు సమీకరించడంలో బుగ్గన కీలక పాత్ర..
ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్‌ మాజీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి… వైసీపీలో కీలక నేత. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజేంద్రనాథ్‌రెడ్డి మూడో ప్రయత్నంలో ఓడిపోయారు. బుగ్గనపై కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాశ్‌రెడ్డి విజయం సాధించారు. 2014లో పీఏసీ చైర్మన్‌గా, 2019 నుంచి ఆర్థికశాఖ మంత్రిగా ఐదేళ్లు కొనసాగిన బుగ్గన… మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు. గత ప్రభుత్వంలో తరచూ ఢిల్లీ పర్యటనకు వెళ్లి అప్పులు, ఇతర మార్గాల ద్వారా రాష్ట్రానికి నిధులు సమీకరించడంలో బుగ్గన కీలకంగా వ్యవహరించారు. ఐతే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… అప్పులు రూపంలో నిబంధనలకు విరుద్ధంగా నిధుల సమీకరణ జరిగిందని… ఆర్థికశాఖలో చాలా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది.

కేసుల నుంచి రక్షణ కోసం బీజేపీలోకి?
ఆర్థిక శాఖపై ప్రత్యేకంగా శ్వేతపత్రం ప్రచురిస్తామని ప్రకటించింది. దీంతో బుగ్గనపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కేసుల నుంచి రక్షణకు బుగ్గన బీజేపీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఓటమి తర్వాత బుగ్గన… వైసీపీ అధినేత జగన్‌కు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులతో జగన్‌ నిర్వహించిన సమీక్ష సమావేశానికి బుగ్గన హాజరుకాలేదని చెబుతున్నారు. దీంతో ఆయన పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోందని అంటున్నారు.

బుగ్గనపై ప్రత్యర్థుల దుష్ట పన్నాగం..
విద్యాధికుడైన బుగ్గన… జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఓటమితో మానసికంగా కుంగిపోవడంతోనే ఆయన బయటకు రావడం లేదని… బుగ్గన మద్దతుదారులు చెబుతున్నారు. ఒక్క ఓటమితో వైసీపీని వీడాల్సిన పరిస్థితి లేదని… బీజేపీలో చేరతారనే ప్రచారం అంతా కల్పితమని… ప్రత్యర్థుల దుష్ట పన్నాగమని బుగ్గన మద్దతుదారులు చెబుతున్నారు. ఐతే, వైనాట్‌ 175 అంటూ పోటీ చేసిన వైసీపీ 11 సీట్లకే పరిమితమవడం, ఇప్పట్లో పార్టీ కోలుకుంటుందనే నమ్మకం లేకపోవడంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారని మరికొందరు చెబుతున్నారు.

పలు రాష్ట్రాల్లో మైనింగ్ వ్యాపారాలు..
ఇక రాజేంద్రనాథ్‌రెడ్డికి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, తమిళనాడు, కర్ణాటకల్లో మైనింగ్, సిమెంట్‌ వ్యాపారాలు ఉన్నాయని తెలుస్తోంది. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం తనను ఇబ్బందిపెట్టకుండా ఉండాలంటే బీజేపీలో చేరడమే ఉత్తమమని బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి భావిస్తున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బుగ్గన బీజేపీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు మరికొందరు చెబుతున్నారు. అయితే తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న ప్రచారాన్ని బుగ్గన ఖండిస్తున్నారు. తనపై ఫేక్‌ ప్రచారం చేస్తున్నారని.. తాను పార్టీ మారడం లేదని చెబుతున్నారు. తాను వైసీపీలోనే ఉంటానని బుగ్గన ఎంతలా నెత్తినోరు బాదుకుని చెబుతున్నా… ఆయన బీజేపీలోకి వెళతారనే ప్రచారం మాత్రం ఆగడం లేదు.

మొత్తానికి బుగ్గన ఎపిసోడ్‌ వైసీపీలో కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతానికి జగన్‌కు దూరంగా ఉంటున్న బుగ్గన… అధినేతను కలిసి ఈ ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సి వుంటుంది. లేదంటే మౌనం అర్థాంగికారమని భావించాల్సి వుంటుందని అంటున్నారు పరిశీలకులు.

Also Read : అటు ప్రభుత్వ చర్యలు, ఇటు ప్రజల తిరుగుబాటు.. ప్రమాదంలో వైసీపీ నేత 30ఏళ్ల వ్యాపార సామ్రాజ్యం..!