ఆ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పూర్వ వైభవానికి కవిత మళ్లీ రావాల్సిందేనా?

ఇక ఎన్నికల్లో ఆమె ఫొటో కూడా వేసేందుకు బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ సాహసించకపోవడంతో ఇందూరులో కవిత పట్టుకోల్పోయినట్లేనా? అన్న చర్చ మొదలైంది.

ఆ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పూర్వ వైభవానికి కవిత మళ్లీ రావాల్సిందేనా?

Gossip Garage : ఇందూరు రాజకీయాల్లో కవిత లేని లోటు స్పష్టంగా కన్పిస్తోందా..? ఒకప్పుడు అన్నీతానై చక్రం తిప్పిన కవిత… జైలులో ఉండటమే గులాబీ దళాన్ని చుక్కాని లేని నావలా చేసిందా? ఉత్తర తెలంగాణలో ఓ వెలుగు వెలిగిన బీఆర్‌ఎస్‌… ఆ ప్రాంతానికి ఆయువు పట్టులాంటి నిజామాబాద్‌లో పార్టీ పూర్వ వైభవానికి కవిత మళ్లీ రావాల్సిందేనా? కవితే సర్వస్వంగా చేసిన రాజకీయమే కారు పార్టీ మనుగడను దెబ్బతీస్తోందా? ఇందూరు పాలిటిక్స్‌లో ఏం జరుగుతోంది? కవిత లేనిదే ఏమీ లేదన్నట్లు బీఆర్‌ఎస్‌ శ్రేణులు నిస్తేజంలో మునిగిపోవడానికి కారణమేంటి?

కవిత లేని లోటు కారు పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది..
బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తనయ, ఎమ్మెల్సీ కవిత లేని లోటు కారు పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి నిజామబాద్‌ జిల్లా రాజకీయాలను శాసించిన కవిత అరెస్టుతో ఈ ప్రాంతంలో గులాబీ పార్టీ ఘోరంగా దెబ్బతింటుందనే టాక్‌ నడుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో జాగృతి ద్వారా ఉత్తర తెలంగాణలో తన ప్రభావాన్ని పెంచుకున్న కవిత.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నిజామాబాద్‌ ఎంపీగా గెలిచారు. ఇక అప్పటి నుంచి నిజామాబాద్‌ లోక్ సభ పరిధిలోనే కాదు.. నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో తన ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నా, కవిత హవా ముందు అంతా తేలిపోయే వారు. పార్టీ కార్యకర్తలు కూడా కవిత నాయకత్వానికే జై కొట్టడంతో ఇక ఆమెకు తిరుగే లేకుండా పోయింది. ఐతే 2019లో కవిత ఓటమి తర్వాత ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చినా, ఎమ్మెల్సీగా మళ్లీ అవకాశం దక్కడంతో మరోసారి తిరుగులేని నేతగా సాగుతూ వచ్చింది.

పార్టీని వీడిన కవిత ముఖ్య అనుచరులు..
గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కవిత ప్రభావం కొంతవరకు పనిచేసింది. ఐతే పార్లమెంట్‌ ఎన్నికల ముందు ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఆమె అరెస్టు కావడం… పార్టీని తీవ్రంగా దెబ్బతీసింది. అప్పటివరకు అన్నీ తానై వ్యవహరించిన కవిత ఒక్కసారిగా జైలుకే పరిమితమవడం.. ఆ స్థాయిలో నియోజకవర్గ రాజకీయాలను ప్రభావితం చేసే నాయకులు లేకపోవడంతో నిజామాబాద్‌లో పోటీ ఇవ్వలేకపోయింది బీఆర్‌ఎస్‌. ఇక ఆ తర్వాత కవిత ముఖ్య అనుచరులుగా ఉన్న వారు సైతం పార్టీని వీడటం గులాబీ పార్టీకి మరింత సమస్యగా మారింది.

కారు దిగి ఇతర పార్టీల్లో చేరిపోతున్న ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు..
నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో కవితతో సన్నిహితంగా మెలిగే బాల్కొండ నేత సునీల్‌రెడ్డి అటూ ఇటూ పార్టీలు మారుతూ వచ్చి కాంగ్రెస్‌ లో సెటిల్‌ అయిపోయారు… ఇక మరో ప్రధాన అనుచరుడిగా ఉన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కూడా కారు పార్టీని వదిలేశారు. అప్పటికే సంజయ్‌ ను ఇబ్బంది పెట్టేలా కవిత ద్వితీయ శ్రేణి నాయకులను ఉసి కొల్పారనే విమర్శలు ఉన్నప్పటికీ… కవితకు నమ్మినబంటుగానే కొనసాగారు డాక్టర్‌ సాబ్‌. ఇలా ముఖ్యనేతలే కాకుండా కవిత ప్రోత్సహించిన ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు కూడా కారు దిగేసి ఇతర పార్టీల్లో చేరిపోతుండటం బీఆర్‌ఎస్‌ను దెబ్బ తీస్తోందంటున్నారు.

2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ చేతిలో ఓటమి ఎదుర్కొన్న కవిత… 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి పట్టుబిగించారు. తనను ఓడించిన ఎంపీ అర్వింద్‌ ఎక్కడ పోటీ చేసినా … ఆయనను ఓడిస్తానంటూ సవాల్‌ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించగలిగారు. ఇక జగిత్యాలలో తొలిసారి కవిత సపోర్టుతోనే గెలిచినా… రెండోసారి ఆమె అవసరం లేకుండానే ఘన విజయం సాధించారు డాక్టర్‌ సంజయ్‌. ఐతే లోక్‌సభ ఎన్నికల నాటికి సీన్‌ రివర్స్‌ అయింది. కోరుట్లలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిన అర్వింద్‌…. నిజామాబాద్‌ ఎంపీగా ఘన విజయం సాధించారు. ఈసారి అర్వింద్‌ను ఓడిస్తానని కంకణం కట్టుకున్న కవిత జైలు పాలవడంతో ఆమె శపథం నెరవేరని పరిస్థితి నెలకొంది.

ఎన్నికల్లో కవిత ఫొటో కూడా వేసేందుకు సాహసించని కేడర్..
ఇక ఎన్నికల్లో ఆమె ఫొటో కూడా వేసేందుకు బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ సాహసించకపోవడంతో ఇందూరులో కవిత పట్టుకోల్పోయినట్లేనా? అన్న చర్చ మొదలైంది. కవిత జైలుకు వెళ్లి దాదాపు నాలుగు నెలలు కావస్తోంది. ఈడీ కేసులో అరెస్టు అయిన కవితపై సీబీఐ కూడా ఎఫ్ఐఆర్‌ నమోదు చేయడంతో ఆమె విడుదల ఇప్పట్లో సాధ్యమా? అన్న చర్చ మొదలైంది. ఇక మరికొద్ది నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు ప్రభుత్వం పూనుకోవడంతో చాలామంది బీఆర్‌ఎస్‌ నేతలు పక్కచూపులు చూస్తున్నారంటున్నారు.

జైలుకెళ్లడంతో మసకబారిన కవిత ఇమేజ్..!
లిక్కర్‌ స్కాంలో కవిత జైలుకెళ్లడంతో ఆమె ఇమేజీ మసకబారిందని… ఆమె వచ్చినా ఒరిగేదేమీ ఉండదని భావిస్తూ కవితతో సన్నిహితంగా ఉన్న నేతలు సైతం ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఐతే జైలుకు వెళ్లిన కవిత తిరిగి వస్తారని…. పార్టీని బలోపేతం చేస్తారని ఇప్పటికీ కొంత మంది బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నమ్ముతున్నారు. వారి నమ్మకం వమ్ము అవుతుందా, నిజమవుతుందా?

Also Read : బీఆర్ఎస్ నేతలపై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఆగ్రహం