ఏలూరులో వైసీపీ క్లోజ్..! పార్టీని నడిపే నాయకుడు కరువు..

ఇప్పటికే కీలక నేతలు అంతా పార్టీకి దూరమవడంతో ఇప్పుడు ఏలూరులో వైసీపీని నడిపే లీడరే కనిపించడం లేదు.

ఏలూరులో వైసీపీ క్లోజ్..! పార్టీని నడిపే నాయకుడు కరువు..

Gossip Garage : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఫ్యాన్‌ పార్టీకి ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లు పదవులు అనుభవించిన వారు ప్రతిపక్షంలో ఉండలేమంటూ సైడైపోతుండగా, పార్టీ అండతో పదవులు అనుభవిస్తున్న వారు సైతం అధికార పార్టీ ఆశీస్సుల కోసం పార్టీ ఫిరాయింపులకు రెడీ అవుతున్నారు. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ దుకాణం బంద్‌ అవుతోంది. రాష్ట్రంలో కీలక నియోజకవర్గమైన ఏలూరులో ఫ్యాన్‌ పార్టీకి గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. మేయర్‌ నూర్జహాన్‌ టీడీపీలో చేరనున్నారని జరుగుతున్న ప్రచారం హీట్‌ పుట్టిస్తోంది.

గోదావరి జిల్లాలో ప్రమాదంలో వైసీపీ ఉనికి?
గోదావరి జిల్లాలో వైసీపీ ఉనికి ప్రమాదంలో పడుతోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలను కూటమి క్లీన్‌ స్వీప్‌ చేయగా, ఇప్పుడు స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం హీట్‌ పుట్టిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఇప్పటికే పార్టీకి రాజీనామా చేయగా, ఇప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహించిన ఏలూరు నియోజకవర్గంలో అత్యంత కీలకమైన మేయర్‌ నూర్జహాన్‌ సుమారు 30 మంది కార్పొరేటర్లతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని చెబుతున్నారు.

కాడిని వదిలేసిన పార్టీ పెద్ద దిక్కు..
మేయర్‌ పార్టీ మారితే ఏలూరులో వైసీపీ కథ కంచికి చేరినట్లేనని అంటున్నారు. ఇప్పటికే పార్టీ పెద్ద దిక్కు ఆళ్ల నాని కాడి వదిలేయగా, ఆయన అనుచరుడు నగర పార్టీ అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్‌… రెండు నెలల క్రితమే రాజీనామా చేసేశారు. ఇక ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ మాజీ చైర్మన్‌ ఈశ్వరి సైతం ఎన్నికల ముందు టీడీపీ గూటికి చేరారు. నాని, శ్రీనివాస్‌ ప్రస్తుతం ఏ పార్టీలో చేరనప్పటికీ వైసీపీతో మాత్రం తెగతెంపులు చేసుకున్నారు. ఇప్పుడు మేయర్‌ నూర్జహాన్‌ దంపతులు, 30 మంది కార్పొరేటర్లు పార్టీకి రాం.. రాం.. చెప్పేస్తారన్న ప్రచారంతో ఏలూరులో వైసీపీ ఖాళీ అయినట్లేనంటున్నారు.

మళ్లీ సొంత గూటికి మేయర్ దంపతులు..!
మేయర్‌ నూర్జహన్‌ గతంలో టీడీపీ నుంచి గెలిచారు. 2014 మున్సిపల్‌ ఎన్నికల్లో అప్పటి ఎమ్మెల్యే బడేటి బుజ్జి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన మేయర్‌ దంపతులు… ఐదేళ్లు టీడీపీలో కొనసాగారు. ఐతే మాజీ ఎమ్మెల్యే బుజ్జితో విభేదాల కారణంగా 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. ఈ కారణంతోనే గత ఎన్నికల్లో బుజ్జి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారని చెబుతుంటారు. ఇక వైసీపీలో చేరిన తర్వాత కూడా నూర్జహన్‌కు మేయర్‌ పదవి ఇచ్చింది పార్టీ.

ఐతే గత ఎన్నికల ముందు తెరచాటుగా టీడీపీకి సహకరించారని నూర్జహన్‌ దంపతులపై ఆరోపణలు ఉన్నాయి. దీనికి బలం చేకూరుస్తూ ఇటీవల కాలంలో మేయర్‌ దంపతులు ఎమ్మెల్యే బడేటి చంటితో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో మేయర్‌ మళ్లీ సొంత గూటికి వచ్చేస్తారని గత రెండు నెలలుగా ప్రచారం జరుగుతోంది. మేయర్‌, కార్పొరేటర్ల చేరికకు టీడీపీ హైకమాండ్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు చెబుతున్నారు. యువనేత లోకేశ్‌ సమక్షంలో ఏ క్షణంలో అయినా పసుపు కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది.

Also Read : వైసీపీని వెంటాడుతున్న డర్టీ పిక్చర్ ఎపిసోడ్‌.. నేతల తీరుతో తలపట్టుకుంటున్న హైకమాండ్..!

ఏలూరులో ఆళ్ల నానిపై ఎమ్మెల్యే చంటి సుమారు 65 వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ ఓటమిని తట్టుకోలేని నాని ఫలితాలు వచ్చిన తర్వాత బయటకు రావడమే మానేశారు. దీంతో సరైన నాయకత్వం లేక వైసీపీ కార్యకర్తలు చెల్లా చెదురవుతున్నారంటున్నారు. ఇప్పటికే కీలక నేతలు అంతా పార్టీకి దూరమవడంతో ఇప్పుడు ఏలూరులో వైసీపీని నడిపే లీడరే కనిపించడం లేదు. వాస్తవానికి కార్పొరేషన్ లో 50 డివిజన్‌లు ఉంటే, 47 చోట్ల వైసీపీ కార్పొరేటర్లు గెలిచారు. ఇందులో ఇద్దరు ఇప్పటికే టీడీపీలో చేరారు. ఇప్పుడు 30 మంది చేరితే కార్పొరేషన్‌ టీడీపీ పరమైనట్లేనని భావించాల్సి వుంటుంది.