తుంగభద్ర ప్రాజెక్ట్‌ ప్రమాదకర పరిస్థితిలో ఉందా.. నిపుణుల కమిటీ ఏం చెప్పింది?

తుంగభద్ర డ్యాం భద్రతపై నిపుణుల కమిటీ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

తుంగభద్ర ప్రాజెక్ట్‌ ప్రమాదకర పరిస్థితిలో ఉందా.. నిపుణుల కమిటీ ఏం చెప్పింది?

tungabhadra dam: తుంగభద్ర ప్రాజెక్ట్‌ ప్రమాదకర పరిస్థితిలో ఉందా? అంటే ఔనంటున్నారు నిపుణులు. 70 ఏళ్ల కింద అమర్చిన డ్యామ్‌ గేట్లు ఇపుడు డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాయి. మొత్తం డ్యాం గేట్లు మార్చకుంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు. డ్యాం గేట్లకు కాల పరిమితి ఉంటుందా? మిగతా డ్యాంల గేట్ల పరిస్థితి ఏంటి?

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న తుంగభద్ర డ్యామ్‌ ప్రమాదకర పరిస్థితిలో పడిపోయింది. ఆగస్టు 10న భారీ వరదలకు తుంగభద్ర క్రస్ట్‌గేటు కొట్టుకుపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

వెంటనే అప్రమత్తమైన ఏపీ-కర్ణాటక ప్రభుత్వాలు హుటాహుటిన చర్యలు చేపట్టాయి. ఇంజినీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడు మార్గదర్శకత్వంలో తాత్కాలిక సాఫ్ట్‌లాక్ గేట్‌ను అమర్చారు. వరదనీరు వృథాగా పోకుండా అడ్డుకోగలిగారు.

అయితే తుంగభద్ర గేటు ఎలా కొట్టుకుపోయింది..? మిగిలిన గేట్లు ఎంతవరకు భద్రం..? అన్న సందేహాలు తెరపైకి వచ్చాయి. దీంతో తుంగభద్ర ప్రాజెక్ట్‌ పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది. ఏకే బజాజ్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ తుంగభద్ర డ్యామ్‌ను ఇటీవల సందర్శించింది. మిగతా 32 గేట్ల పరిస్థితిపై అధ్యయనం చేసింది. ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల బృందం-తుంగభద్ర డ్యామ్ భద్రతకు సంబంధించిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.

నిపుణుల కమిటీ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తుంగభద్ర డ్యాం గేట్లను మొత్తం మార్చాల్సిందేనని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. సాగునీటి ప్రాజెక్టుల గేట్ల జీవితకాలం కేవలం 45 ఏళ్లు మాత్రమేనని.. ఇప్పటికే తుంగభద్ర డ్యామ్ గేట్లను అదనంగా మరో 25 ఏళ్లు వినియోగించారని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేపడితే ప్రమాదాన్ని కోరి కొనితెచ్చుకున్నట్లేనని సేఫ్టీ కమటీ హెచ్చరించింది. 70 ఏళ్ల కిందట అమర్చిన 33 గేట్లను కచ్చితంగా మార్చాలని నివేదికలో స్పష్టం చేసింది.

కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో హోస్పేట్ సమీపంలో తుంగభద్ర నదిపై డ్యామ్‌ కట్టారు. 1953లో డ్యామ్‌ పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. ఈ డ్యామ్ నీటిలో కర్ణాటకకు 138.99 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 73.01 టీఎంసీల చొప్పున వాటా ఉంది. కానీ, ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో పూడిక పేరుకుపోవడంతో 100 టీఎంసీలకు పడిపోయింది. డ్యామ్‌ గేట్లను మార్చడంతో పాటు పూడిక తీస్తే ప్రాజెక్టు మనుగడకు ఢోకా ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.