Sabari River : శబరి నది ఉగ్రరూపం.. వరద ముంపులో చింతూరు, కూనవరం మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు

చింతూరు వద్ద శ‌బ‌రి న‌ది 45 అడుగుల వద్ద ప్ర‌వ‌హిస్తుంది. కూనవరంలోని శబరి, గోదావరి సంగమం వద్ద 50 అడుగుల వద్ద ప్రమాదకర స్థాయి దాటి వరద నీరు ప్ర‌వ‌హిస్తుంది.

Sabari River : శబరి నది ఉగ్రరూపం.. వరద ముంపులో చింతూరు, కూనవరం మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు

Sabari River Flood

Updated On : September 11, 2024 / 8:02 AM IST

Sabari River Flood : అల్లూరి సీతారామ‌రాజు జిల్లా ప‌రిధిలోని చింతూరు ఏజన్సీ వాసుల‌ను వరదలు బ‌య‌పెడుతున్నాయి. ముచ్చటగా మూడవసారి ఊర్లను వరద ముంచెత్తింది. చింతూరు వద్ద శ‌బ‌రి న‌ది 45 అడుగుల వద్ద ప్ర‌వ‌హిస్తుంది. కూనవరంలోని శబరి, గోదావరి సంగమం వద్ద 50 అడుగుల వద్ద ప్రమాదకర స్థాయి దాటి వరద నీరు ప్ర‌వ‌హిస్తుంది. దీంతో జాతీయ రహదారులు 30, 326 పైకి వరద నీరు చేరింది. ఆంధ్ర నుండి తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్ గ‌ఢ్ రాష్ట్రాలకు రాక‌పోక‌లు పూర్తిగా నిలిచిపోయాయి. కూనవరం శబరి బ్రిడ్జిపై నుండి వ‌ర‌ద నీరు ప్ర‌వ‌హిస్తుంది. చింతూరు మండలం ఒడ్డు కాలనీ వరదనీరు ముంచెత్తింది. కూనవరంలో ఉదయాబాష్కర్ కాలనీ, చేపల బజారు, గిన్నెల బజారు నీట మునిగాయి.

Also Read : CM Chandrababu Naidu : ఉత్తరాంధ్రలోని వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.. కొల్లేరులో ఏరియల్ వ్యూ

వి.ఆర్.పురం మండలం వడ్డీ గూడెం, శ్రీరామాగిరి, చింతరేవుపల్లి గ్రామాలను వ‌ర‌ద ముంచెత్తింది. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలతో అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లిస్తున్నారు. ఇప్పటికే 149 పునరావాస కేంద్రాల‌కు 3,851 కుటుంబాలకు అధికారులు త‌ర‌లించారు. ముందస్తు చర్యల్లో భాగంగా 131 మంది గర్భిణీ స్త్రీలను స్థానిక ఆసుపత్రుల‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. వ‌ర‌ద ముంపు నుంచి స్థానికుల‌ను సురక్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించేందుకు సుమారుగా 64 బోట్స్ ను అధికారులు ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి అధికారులను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతిఒక్కరికీ నిత్యావసర సరుకులు అందించాలని ఆదేశాలు ఇచ్చారు.