Anitha Vangalapudi : అధికారంలోకి రాగానే ఒక్కొక్కడికి తీర్చేస్తాం- వంగలపూడి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
Anitha Vangalapudi : వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు సంతోషంగా ఉంటే ప్రజలంతా సంతోషంగా ఉన్నట్టా..?

Anitha Vangalapudi (Photo : Google)
Anitha Vangalapudi – YS Jagan Mohan Reddy : తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై ఎన్నో దురాగతాలు జరుగుతున్నా సీఎం జగన్ ఎందుకు మాట్లాడ్డం లేదని అనిత ప్రశ్నించారు. సీఎం జగన్ ఏ మాత్రం స్పందించని బండరాయిగా మారారని విమర్శించారు.
తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని బటన్ నొక్కుతున్న బండరాయిగా జగన్ మారారు అని అనిత ధ్వజమెత్తారు. మహిళలను ఆడపడుచులుగా గౌరవించడం టీడీపీ సంప్రదాయం అన్నారామె. మహాశక్తి పథకం ద్వారా మహిళలకు టీడీపీ ఎలాంటి గౌరవం ఇస్తుందో అర్థమవుతోందన్నారు. జగన్ సైకో పాలనలో అతి ఎక్కువగా ఇబ్బంది పడుతోంది మహిళలే అని అనిత వాపోయారు.
‘భవిష్యత్తు గ్యారెంటీ కింద మహిళలకు ప్రతి నెల రూ. 1500 ఇస్తామని హామీ ఇచ్చారు. సంపద సృష్టించే శక్తి చంద్రబాబుకు ఉంది. అందుకే సంక్షేమ పథకాలు అందివ్వగలరు. చంద్రబాబు హయాంలో వందలాది సంక్షేమ పథకాలు అందిస్తూనే ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. అమ్మఒడిని ఒక పిల్లవాడికే పరిమితం చేశారు. చంద్రబాబు ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తామన్నారు.
ఎగువ మధ్య తరగతి మహిళల్లో ధరల పెరుగుదలపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రతి అంశం మీద పన్నులేస్తున్నారు. గ్యాస్ ధరలు పెరగడం వల్ల పొయ్యిలు, పొగ గొట్టాలు బయటకు వచ్చాయి. మహిళ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడితే జగనన్న.. జగనన్న అంటూ భజన చేస్తున్నారు. ఎవరీ జగనన్న..? పరదాల మాటున పర్యటనలు చేసే వ్యక్తి జగన్. సీఎం సభలకు డైపర్లు పెట్టుకుని రావాలంటూ ఆడవాళ్లపై ఒత్తిడి చేస్తుంటే మహిళా కమిషన్ ఏం చేస్తోంది? టీడీపీ వాళ్లు ఏదో చేశారంటూ క్యాండిళ్లతో రోడ్లక్కే వైసీపీ మహిళలు.. హనుమాయమ్మ మరణం విషయంలో ఏమయ్యారు..?
Also Read..Perni Nani: టీడీపీ నేత నారా లోకేశ్‌ను కోడిగుడ్లతో కొట్టింది వీరే.. : పేర్ని నాని
మేం ఎన్నికలకు సిద్దంగా ఉండడం కాదు. ప్రజలు సిద్దంగా ఉన్నారు. వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు సంతోషంగా ఉంటే ప్రజలంతా సంతోషంగా ఉన్నట్టా..? సోషల్ మీడియాలో మమ్మల్ని, తెలుగు మహిళలపై ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తున్నారు. మేం మరో 8-9 నెలల పాటు ఓపిగ్గా ఉంటాం. మేం అధికారంలోకి రాగానే ఒక్కొక్కడికి తీర్చేస్తాం” అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వంగలపూడి అనిత.