Chirala: ఆమంచి, కరణం గ్రూప్‌వార్‌.. వైసీపీ ట్రబుల్ షూటర్‌ ఎంట్రీతో పరిస్థితులు చక్కబడతాయా?

మూడేళ్లుగా రచ్చరచ్చగా మారిన చీరాల రాజకీయాన్ని చక్కదిద్దేలా విజయసాయిరెడ్డి ఎలాంటి వ్యూహం అనుసరిస్తున్నారనేది అందరిని అటెన్షన్‌లో పెట్టింది.

Chirala: ఆమంచి, కరణం గ్రూప్‌వార్‌.. వైసీపీ ట్రబుల్ షూటర్‌ ఎంట్రీతో పరిస్థితులు చక్కబడతాయా?

amanchi krishna mohan karanam balaram group war

Chirala Politics: అధికార వైసీపీలో చీరాల రచ్చ ఇప్పట్లో చల్లారే మార్గం కనిపించడం లేదు. ఎమ్మెల్యే కరణం బలరాం (Karanam Balaram), మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ (Amanchi Krishna Mohan) మధ్య గ్రూప్‌వార్‌కు చెక్ పెట్టేలా అధిష్టానం ఎన్ని చర్యలు తీసుకున్నా.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు సరికదా రానురాను మరింత ముదురుతుండటం హీట్‌పుట్టిస్తోంది. ఫైనల్‌గా ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యత కొత్త సమన్వయకర్త, ఎంపీ విజయసాయిరెడ్డిపై పడింది. వైసీపీ ట్రబుల్ షూటర్‌గా (trouble shooter) పేరు తెచ్చుకున్న విజయసాయిరెడ్డి (Vijaysai Reddy) జోక్యంతోనైనా చీరాలలో పరిస్థితులు చక్కబడతాయా? తెరవెనుక రాజకీయంలో విజయసాయిరెడ్డి ఎలా చక్రం తిప్పుతున్నారు? ఆమంచి ఏమంటున్నారు?

చీరాల రాజకీయం ఎప్పుడూ కాకమీదే ఉంటుంది. మరీ ముఖ్యంగా అధికార వైసీపీలో ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గాల మధ్య పరిస్థితి ఉప్పు-నిప్పులా మారింది. రెండు వర్గాల వారు ఎదురెదురుగా వస్తే తిట్టుకోవడం, తన్నుకోవడం షరామామూలైంది. టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే కరణం బలరాంను తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు ఆమంచి కృష్ణమోహన్. గత ఎన్నికల్లో చీరాలలో ఈ ఇద్దరి మధ్యే పోటీ జరిగింది. ఆమంచి ఓడిపోగా, కరణం గెలిచారు. ఎన్నికలు అయిన కొన్నాళ్లకే బలరాం వైసీపీ గూటికి చేరారు. బలరాం రాకను ఆమంచి జీర్ణించుకోలేకపోయారు. పార్టీలో తన పట్టు జారకుండా.. తన వర్గాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా బలరాంతో సై అంటే సై.. ఢీ అంటే ఢీ అన్న స్థాయిలో తలపడుతున్నారు. స్థానిక ఎన్నికల నుంచి నిన్నమొన్నటి జరిగిన పంచాయతీ ఉప ఎన్నికల వరకు ఎక్కడా రాజీ పడలేదు ఈ రెండు వర్గాలు. ఈ ఇద్దరి మధ్య ఓ మినీ యుద్ధమే జరుగుతోంది. ఇదంతా గమనిస్తున్న వైసీపీ అధిష్టానం ఎప్పటికప్పుడు మధ్య రాజీకి ప్రయత్నిస్తున్నా.. తాడేపల్లిలో తల ఊపుతున్న నేతలు.. బయటకు రాగానే బాహాబాహీకి రెడీ అయిపోతున్నారు.

ఈ పరిస్థితుల్లో ఇద్దరికి రెండు నియోజకవర్గాల బాధ్యత అప్పగించింది వైసీపీ.. సిట్టింగ్ ఎమ్మెల్యే బలరామ్‌కు చీరాల బాధ్యతలు, మాజీ ఎమ్మెల్యే ఆమంచికి పక్కనే ఉన్న పర్చూరు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం.. ఐతే తన బలమంతా చీరాలలో ఉందని భావిస్తున్న ఆమంచి.. పర్చూరు బాధ్యతలను ఆన్యమనస్కంగానే స్వీకరించారు. చీరాలలో స్వతంత్రంగానైనా గెలవగలిగే సత్తా ఉన్న తనకు పర్చూరు పంపడాన్ని ఆయన ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైనా చీరాలలోనే పోటీ చేయాలని ఆ నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమంలోనూ జోక్యం చేసుకుంటున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యే బలరాం వర్గం ఎప్పటికప్పుడు ఆమంచిపై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తోంది.

Also Read: మంగళగిరిలో లోకేశ్ జోరుకు బ్రేక్‌లు వేసేదెవరు.. ఆర్కేను బాపట్లకు మారుస్తారా?

చీరాలను తన అడ్డాగా మార్చుకుని రాజకీయం చేసిన ఆమంచికి పర్చూరులో కూడా పరిస్థితులు ఏ మాత్రం కలిసిరావడం లేదని చెబుతున్నారు. ఆమంచి వైఖరి వల్ల పర్చూరు నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గంతోపాటు బీసీలు, దళితులు పార్టీకి దూరమవుతున్నారని ఎంపీ నందిగాం సురేశ్‌, మాజీ మంత్రి బాలినేని అధిష్టానానికి ఫిర్యాదులు పంపినట్లు సమాచారం. ఇదేసమయంలో తనకు ఇష్టంలేని నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడమే కాకుండా.. తనకు వ్యతిరేకంగా రిపోర్టులు చేయడంపై ఆమంచి మరింత రగిలిపోతున్నారు. బాలినేని, ఆమంచి మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. ఆమంచిని పర్చూరు ఇన్‌చార్జిగా నియమించడం బాలినేనికి ఇష్టం లేదని చెబుతున్నారు. ఇదే సమయంలో కరణం చేరికకు బాలినేని కారణమని ఆమంచి అనుమానం. ఇలా ఈ ఇద్దరు నేతల మధ్య కూడా సరైన సంబంధాలు లేకపోవడంతో చీరాల గొడవకు ఇన్నాళ్లు ఫుల్‌స్టాప్ పడలేదు. బాలినేని స్థానంలో వైవీ సుబ్బారెడ్డి వచ్చినా పరిస్థితిలో మార్పులేదు. ఇప్పుడు వైవీ కూడా తప్పుకుని ఆ బాధ్యతలు విజయసాయిరెడ్డికి అప్పగించడంతో ఆమంచి రాజకీయంపై మళ్లీ విస్తృత చర్చ జరుగుతోంది.

Also Read: చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో కొడాలి నాని.. నేను సంస్కారహీనుడిని కాదంటూ ‘పకోడీగాళ్లు’ కామెంట్‌పై క్లారిటీ

ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే విజయసాయిరెడ్డి.. చీరాల, పర్చూరు నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు చెరో నియోజకవర్గం ఇచ్చినా ఎప్పటికప్పుడు రచ్చ జరగడానికి కారణాలేంటనేది ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌లో ఒకసారి, బాపట్లలో మరోసారి ఈ వివాదంపై ప్రధానంగా చర్చించిన విజయసాయిరెడ్డి.. పరిష్కారంపై ఓ ఫార్ములా రూపొందించి హైకమాండ్‌కు నివేదించినట్లు చెబుతున్నారు.

Also Read: భక్తులు తిరుమలకు రాకుండా చేస్తున్నారు, వేంకటేశ్వర స్వామిని అవమానిస్తే పుట్టగతులుండవు – బండి సంజయ్

ఆమంచి సోదరుడు స్వాములు పార్టీ మారడం.. పర్చూరులో ప్రధాన సామాజిక వర్గాలతో ఆమంచి కృష్ణమోహన్‌కు సంబంధాలు సరిగా లేవనే ఫిర్యాదుల నేపథ్యంలో వైసీపీ హైకమాండ్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. సుమారు మూడేళ్లుగా రచ్చరచ్చగా మారిన చీరాల రాజకీయాన్ని చక్కదిద్దేలా విజయసాయిరెడ్డి ఎలాంటి వ్యూహం అనుసరిస్తున్నారనేది అందరిని అటెన్షన్‌లో పెట్టింది. ఇటు కరణం వర్గం.. అటు ఆమంచి వర్గం కూడా హైకమాండ్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయి.