ఏపీలో రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లిపాయలు

  • Published By: madhu ,Published On : October 22, 2020 / 08:31 AM IST
ఏపీలో రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లిపాయలు

Updated On : October 22, 2020 / 10:35 AM IST

andhra pradesh subsidized onion rythu bazaars : ఉల్లిపాయలను కోయకుండానే..కన్నీళ్లు తెప్పిస్తోంది. మార్కెట్లో రేట్లు చూసి సామాన్యుడు, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కిలో ఉల్లిగడ్డ రూ. 80 నుంచి 110 పలుకుతోంది. దీంతో ఉల్లిని కొనకుండానే..కూరలు వండేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొంది. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లోని రైతుబజార్లలో 2020, 23వ తేదీ శుక్రవారం నుంచి సబ్సిడీ ధరపై ఉల్లిపాయలు విక్రయించనున్నారు.



అధిక వర్షాలు పడడంతో ఉల్లి పంటలు నీట మునిగిపోయాయి. దీంతో ధరలకు రెక్కలెచ్చాయి. బుధవారం అనేక పట్టణాల్లోని రిటైల్‌ మార్కెట్లలో కిలో రూ.90 నుంచి రూ.100 వరకు అమ్మకాలు జరిగాయి. ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలుండటంతో రాష్ట్ర ప్రభుత్వం హోల్‌సేల్‌ మార్కెట్‌లో ఉల్లిపాయలు కొనుగోలు చేసి రైతుబజార్లలో సబ్సిడీ ధరకు విక్రయించాలని నిర్ణయించింది.
https://10tv.in/andhra-pradesh-ys-jagan-announced-ysr-bheema/
కర్నూలు, తాడేపల్లిగూడెం హోల్‌సేల్‌ మార్కెట్లలో ఉల్లిపాయలు కొనుగోలు చేయనుంది. ఆ మార్కెట్‌లలో ఎంతకు కొనుగోలు చేసినా రైతుబజార్లలో కిలో రూ.40కి అమ్మాలని నిర్ణయించింది. రెండోదశలో రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో ఉల్లిపాయలు అమ్మడానికి చర్యలు తీసుకుంటున్నామని మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కమిషనర్‌ ఎస్‌.ప్రద్యుమ్న చెప్పారు.



ప్రతికూల పరిస్థితుల కారణంగా ఉల్లి పంట ఆశించిన స్థాయిలో దిగుబడులు చేతి కందకపోవడంతోనే ధరలు భగ్గుమటున్నాయని వ్యాపార వర్గాలు అంటున్నాయి. దీనికి తోడు ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లి దిగుమతులు కూడా పూర్తిగా తగ్గిపోవడంతో ఆశించిన స్థాయిలో మార్కెటుకు రవాణా కావడం లేదని అంటున్నారు ఉల్లి వ్యాపారులు.

అలాగే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న ఉల్లి దిగుబడులు అంతగా నాణ్యతమైనవిగా ఉండటం లేదంటున్నారు వ్యాపారులు. కారణమేదైనా ఉల్లి ధరలు చుక్కలనంటుతుండడంతో సామాన్యుడు సతమతమవుతున్నాడు.