విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ బంద్.. బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ బంద్.. బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు

AP state bandh : విశాఖ ఉక్కు ఉద్యమం సెగలు ఢిల్లీకి తాకుతున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన ఏపీ బంద్ కు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఏపీ బంద్‌లో బీజేపీ పాల్గొనలేదు. వామపక్షాలు, ప్రతిపక్ష టీడీపీ సహా అధికార వైసీపీ పాల్గొంది. ఆయా పార్టీల నేతలు కదం తొక్కారు. స్టీల్ సిటీ విశాఖలోనే కాదు..శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు మొత్తం 13 జిల్లాల్లోని నగరాలు, పట్టణాల్లో బంద్‌ కొనసాగుతోంది.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికసంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఇచ్చిన పిలుపుతో ఆంధ్రాలో వ్యాపార, వర్తక, వాణిజ్య సముదాయాలు తెరుచుకోలేదు. విద్యా సంస్థలు మూతబడ్డాయి. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలిపారు. లారీ యాజమానుల సంఘాలు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు బంద్‌కు సహకరించాయి.

స్టీల్ ప్లాంట్‌కు ప్రైవేటీకరణకు కేంద్రం అడుగులు వేస్తుండడంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి అధికార, విపక్షాలు. కార్మికసంఘాల నేతలతో జతకలిసిన రాజకీయ నేతలు…విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. స్టీల్‌ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉంచాలని డిమాండ్‌ చేశారు కార్మికసంఘాల నేతలు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. బంద్‌ సందర్భంగా ఆయా నగరాలు, పట్టణాల్లోని బస్టాండ్లు, కూడళ్లలో భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బంద్‌ ఉదయం నుంచి ప్రశాంతంగా కొనసాగుతోంది.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఆర్చ్‌ వద్ద 22 వ రోజు కార్మికసంఘాలు, నిర్వాసితుల రిలే దీక్షలు 22 వ రోజు కొనసాగుతున్నాయి. బంద్‌లో భాగంగా కార్మికులు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింపోయింది. బంద్‌లో వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, సత్యనారాయణ, మంత్రి అవంతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్‌నాథ్‌ పాల్గొన్నారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఏజెన్సీప్రాంతాల్లోనూ బంద్‌ ప్రభావం కనిపించింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ఉభయగోదావరి జిల్లాల్లోనూ సంపూర్ణ బంద్‌కు మద్దతు లభించింది. కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, తాడేపల్లిగూడెంలో బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. కమ్యునిస్ట్‌ పార్టీల నేతలు, టీడీపీ, వైసీపీ నేతలు బంద్‌లో పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడ, మచిలీపట్నంలో షాపులు తెరుచుకోలేదు.

బెజవాడ ఆటోనగర్‌, బీసెంట్‌ రోడ్డు, బందర్‌ రోడ్డు నిర్మానుష్యంగా మారాయి. గుంటూరు, ఒంగోలు, నెల్లూరు నగరాల్లోనూ బంద్‌ కొనసాగుతోంది. సీఎం జగన్‌ సొంత జిల్లా కడపతో పాటు కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో బంద్‌కు వ్యాపారులు, వర్తకులు స్వచ్ఛందంగా సహకరించారు. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌ పరం చేయవద్దని నేతలు, కార్మికులు డిమాండ్‌ చేశారు.