బీజేపీ సోమువీర్రాజుపై రగిలిపోతున్న చంద్రబాబు టీమ్, కారణం ఏంటి

  • Published By: naveen ,Published On : November 23, 2020 / 11:05 AM IST
బీజేపీ సోమువీర్రాజుపై రగిలిపోతున్న చంద్రబాబు టీమ్, కారణం ఏంటి

ap bjp targets tdp: బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు తీసుకొన్నప్పటి నుంచి ప్రతిపక్ష టీడీపీకి చుక్కలు చూపిస్తున్నారు. దొరికిన ప్రతి అవకాశాన్ని వాడుకొంటూ టీడీపీని, అధినేత చంద్రబాబును తూర్పారబడుతున్నారు. గతంలో జరిగినవి మర్చిపోయి మళ్లీ బీజేపీ హైకమాండ్‌ని సెట్ చేసుకోవాలని టీడీపీ అష్టకష్టాలు పడుతోంది. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ పెద్దలను తెగ పొగిడేస్తున్నారు చంద్రబాబు. అనారోగ్యంతో ఉన్న నేతలను ఫోన్‌లో పరామర్శించటం, జన్మదిన శుభాకాంక్షలు తెలపటం, ఇంకా ఏదైనా చాన్స్ దొరికితే పొగడ్తలకు వెనుకాడడం లేదంటున్నారు. కానీ సోము వీర్రాజు మాత్రం అవకాశం చిక్కితే టీడీపీని ఉతికి ఆరేస్తున్నారు. దీంతో బీజేపీ స్పీడ్‌కు కళ్లెం వేయడం ఎలా అని టీడీపీ నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు.

దిక్కుతోచని స్థితిలో టీడీపీ:
గతంలో కన్నా లక్ష్మీ నారాయణ బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తొలుత అధికార వైసీపీని టార్గెట్ చేసేవారు. ఆ తర్వాత ప్రతిపక్ష టీడీపీకి చురకలేసేవారు. కానీ ఇప్పుడు సోము వీర్రాజు మాత్రం ఇందుకు భిన్నంగా ఉందంటున్నారు. ఆయన వైఖరితో టీడీపీకి ఏం చేయాలో అర్థం కావడం లేదట. బీజేపీ పట్ల టీడీపీ వీక్‌నెస్‌ను అడ్డుపెట్టుకుని అయిన దానికి కాని దానికి దుమ్మెత్తి పోస్తున్నారని వాపోతున్నారు టీడీపీ నేతలు. పోలవరం ప్రాజెక్టు విషయంలో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కనిపిస్తున్నా వీర్రాజు మాత్రం టీడీపీనే తప్పుపట్టడం ఎంత వరకూ కరెక్ట్‌ అని ప్రశ్నిస్తున్నారు.

కౌన్సిలర్ కూడా కాలేని వ్యక్తిని ఎమ్మెల్సీ చేశాం, ఆ విశ్వాసం కూడా లేదా:
పార్లమెంట్ సాక్షిగా పోలవరంలో అవినీతి జరగలేదని కేంద్ర మంత్రి ప్రకటించటం సోముకి వినిపించలేదా అంటున్నారు టీడీపీ నేతలు. సోము వీర్రాజు ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నారో తెలియడం లేదని, కౌన్సిలర్ కూడా కాలేని వ్యక్తిని తాము శాసనమండలి సభ్యున్ని చేశామని, ఆ విశ్వాసం లేకుండా వైసీపీ నేతల కంటే దారుణంగా విమర్శలు చేస్తున్నారని లోలోన మదనపడిపోతున్నారు టీడీపీ నేతలు. పార్టీపై సోము ఎండ్ టీమ్ ఇంత ఘాటుగా విమర్శలు చేస్తున్నా ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారని నేతలను తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారని అంటున్నారు. దీంతో సోము వీర్రాజుకి గట్టి కౌంటర్ ఇవ్వాలని టీడీపీ పెద్దలు నిర్ణయించారని చెబుతున్నారు.
https://10tv.in/tirupati-parliamentary-by-poll-then-the-election-rush/
వైసీపీ చేతిలో కీలుబొమ్మలుగా మారి టీడీపీ విమర్శలు:
ఇప్పటికే రాష్ట్రంలో అధికార వైసీపీతో వేగలేతుంటే.. ఇక బీజేపీతో తగవెందుకులే అని సంయమనం పాటిస్తున్నారట టీడీపీ నేతలు. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహారావు, ఇంకా ఒకరిద్దరు బీజేపీ నేతలు అధికారపక్షం చేతిలో కీలుబొమ్మలుగా మారి చంద్రబాబుని, తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారని కొందరు టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అసలు వైసీపీ నేతల కంటే వీరే రెండాకులు ఎక్కువ చదివినట్లు టీడీపీపై ఒంటికాలి మీద లేస్తున్నారని, అధికార పార్టీకి అజెండా కూడా వీళ్లే ఇస్తున్నారని గుర్రుమంటున్నారు.

ఇప్పుడిప్పుడే బీజేపీ తిరుగుబాటు:
పోలవరం ప్రాజెక్ట్‌, అంగన్‌వాడీల్లో కోడిగుడ్ల పంపిణీ, అమరావతి, వైజాగ్ ల్యాండ్, టిడ్‌కో గృహ నిర్మాణాలు, దేవాలయాలపై దాడులు తదితర అంశాలపై టీడీపీని బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఇన్ని రోజులూ సంయమనం పాటించిన టీడీపీ నేతలు ఇప్పుడిప్పుడే స్వరం మార్చుతున్నారు. మాజీ మంత్రి జవహర్ మొన్ననే సోము వీర్రాజుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వీర్రాజును వైసీపీ ఏజెంట్‌గా అభివర్ణించారు. ఒక పక్క పార్టీలో మెల్లమెల్లగా బీజేపీపై తన స్వరం పెంచుతూనే. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు

వైసీపీ అజెండాలో భాగంగా పని చేసే బీజేపీ నేతలను వదిలేది లేదు:
సోషల్ మీడియాలో న్యూట్రల్‌గా ఉండే వ్యక్తులతో బీజేపీ నేతలను టార్గెట్ చేస్తోంది టీడీపీ. సోషల్ మీడియాలో వీరిని టార్గెట్ చేయడంతో కొంత ప్రయోజనం కనిపిస్తోందని, జీవీఎల్ లాంటి నేతలు కొంత స్లో అయ్యారని టీడీపీలో అనుకుంటున్నారు. ప్రతి మంగళవారం టీడీపీ అధినేత నిర్వహించే ఆన్‌లైన్‌ సమావేశంలో కూడా బీజేపీపై దూకుడుగా వెళ్లవద్దని నాయకులకు సూచిస్తున్నారు. అయినా వైసీపీ అజెండాలో భాగంగా పని చేసే బీజేపీ నేతలను వదిలిపెట్టబోమని తమ చర్యల ద్వారా తెలియపరుస్తున్నారు టీడీపీ నేతలు.

బీజేపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్:
తాము కావాలని బీజేపీ నేతల జోలికి వెళ్లబోమని, ఆ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకోబోమని టీడీపీ నేతలు అంటున్నారు. అదే సమయంలో తమ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని వైసీపీ నేతలతో కలిసి కొందరు బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారని, వారిని వదిలే సమస్యే లేదని చాలెంజ్ చేస్తున్నారు. రాజకీయంగా తమ పార్టీకి ఇంతకన్నా జరిగే నష్టం ఏమీ లేదని, వైసీపీతో అంటకాగుతూ టీడీపీపై అవాకులు చవాకులు పేలితే ఇక సహించబోమని వార్నింగ్‌లు ఇస్తున్నారట. మరి హెచ్చరికలకు బీజేపీ నేతలు ఎంత వరకు తగ్గుతారో చూడాలి.

https://www.youtube.com/watch?v=hLWgRNmOPIY