అమరావతి భూముల కేసులో సీఐడీ ముందుకు ఎమ్మెల్యే ఆర్కే

అమరావతి భూముల కేసులో సీఐడీ ముందుకు ఎమ్మెల్యే ఆర్కే

Alla Ramakrishna Reddy Mla

Alla Ramakrishna Reddy: రాజధాని అమరావతిలో అసైన్డ్‌ భూముల కొనుగోలు, అమ్మకాలపై ఫిర్యాదుచేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ కార్యాలయంలో విచారణకు నేడు(18 మార్చి 2021) హాజరుకానున్నారు. ఆళ్ల ఫిర్యాదుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు నోటీసులు జారీచేసిన సీఐడీ.. ఆళ్ల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీచేసింది. ఎస్సీ, ఎస్టీ భూములను టీడీపీ నేతలు బలవంతంగా తక్కువ ధరకు లాక్కుని, దళితులకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపిస్తూ విచారణ కోరింది ఆళ్ల రామకృష్ణారెడ్డి కాగా.. ముందుగా ఆయనను విచారణకు పిలిచారు.

ఈ కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న చంద్రబాబును మార్చి 23వ తేదీన, ఏ2 నిందితుడుగా ఉన్న నారాయణను ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. ఫిర్యాదుదారుడైన ఆళ్ల వాంగ్మూలం నమోదు చేసేందుకు హాజరుకావాలని విచారణాధికారి సీఐడీ డీఎస్పీ లక్ష్మీనారాయణరావు నోటీసులు జారీచేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ రీజనల్ కార్యాలయానికి వచ్చి వివరాలు చెప్పాలంటూ నోటీసుల్లో ప్రస్తావించారు.

ఈ కేసుకు సంబంధించి ఆధారాల కోసం మాజీ మంత్రి నారాయణ నివాసాలు, నారాయణ విద్యాసంస్థల కార్యాలయాల్లో విస్తృత సోదాలు నిర్వహించారు సీఐడీ అధికారులు. విజయవాడ, హైదరాబాద్, నెల్లూరులో ఏకకాలంలో పది ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అమరావతి అసైన్డ్‌ భూముల కొనుగోళ్లు, అమ్మకాల్లో టీడీపీ నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తుండడంతో.. ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించనుంది. ఇవాళ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయనుంది.

చంద్రబాబుతో పాటు నారాయణపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో ప్రస్తావించనుంది. న్యాయనిపుణులతో చర్చించిన తర్వాత హైకోర్టులో పిటిషన్‌ వేయాలని నిర్ణయించారు చంద్రబాబు. టీడీపీ హయాంలో రాజధాని అమరావతి నిర్మాణానికి 33వేల ఎకరాల మేర భూముల సమీకరణ చేయగా.., రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి ఏర్పాటు వంటి అంశాలన్నింటినీ స్వయంగా నారాయణ పర్యవేక్షించారు.

రాజధాని భూ సమీకరణకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ నాటి మున్సిపల్ మంత్రి నారాయణ ప్రమేయం ఉందని భావించిన సీఐడీ అధికారులు.. కేసు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. కూకట్‌పల్లిలోని నారాయణ నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చిన సమయంలో ఆయన ఇంట్లో ఎవరూ లేరు. దీంతో నారాయణ ఎక్కడున్నారనేదానిపై ఆరా తీస్తున్నారు దర్యాప్తు బృందం అధికారులు.