ఒకేసారి రైతుల ఖాతాల్లోకి రూ.1766 కోట్లు..ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల చేసిన సీఎం జగన్

ఒకేసారి రైతుల ఖాతాల్లోకి రూ.1766 కోట్లు..ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల చేసిన సీఎం జగన్

AP CM Jagan releases input subsidy to farmers : రైతుల ఖాతాల్లోకి ఒకేసారి మరో రూ.1766 కోట్లు జమ చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇందులో మూడో విడత రైతు భరోసా రూ.1120 కోట్లు అరకోటిపైగా రైతులకు ఇస్తున్నామని చెప్పారు. అలాగే నివర్‌ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు రూ.646 కోట్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. కేవలం నెలరోజుల్లోపే పరిహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. రైతు భరోసా మూడో విడత, నివర్‌ తుపాను బాధిత రైతులకు మంగళవారం (డిసెంబర్ 29, 2020) సీఎం జగన్ ఇన్‌పుట్‌ సబ్సిడీని విడుదల చేశారు. రైతులకు ఈరోజు మరో శుభదినం అన్నారు.

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం జగన్ అన్నారు. రైతు పక్షపాత ప్రభుత్వం మనదని తెలిపారు. రూ. 87,612 కోట్లు రైతుల రుణాల మాఫీ చేస్తానని గత టీడీపీ ప్రభుత్వం చెప్పిందని కేవలం రూ.12 కోట్లు కూడా ఇవ్వలేదని స్వయంగా ఆర్బీఐ చెప్పిందని గుర్తు చేశారు. ధాన్యం, విత్తనం, ఇన్సూరెన్స్, కరెంటు బకాయిలు, చివరకు ఇన్‌పుట్‌సబ్సిడీ, సున్నావడ్డీ డబ్బులు కూడా ఎగ్గొట్టారని విమర్శించారు. రైతుకు చేసిన మోసం అంతా ఇంతాకాదన్నారు. ఈ బాధలు భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకున్న 434 కుటుంబాలకు మన ప్రభుత్వమే పరిహారం ఇవ్వటం జరిగిందన్నారు. రైతుల పట్ల గత ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరించిందో మనం చూశామని పేర్కొన్నారు.

వైయస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ కింద అక్షరాల రూ.13,101 కోట్లు అందించామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నలకు రూ.13,500 లు చొప్పున ఇస్తున్నామని చెప్పారు. కౌలు రైతులకు, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు రైతు భరోసా సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం సున్నా వడ్డీ బకాయిలు రూ.904 కోట్లు పెడితే వాటిని తీర్చామని గుర్తు చేశారు. వైయస్సార్‌ సున్నా వడ్డీ కింద ఈ ఖరీఫ్‌ కు రూ. 510 కోట్లు ఇచ్చామని వెల్లడించారు. వైయస్సార్‌ ఉచిత పంటల బీమా కోసం రైతుల నుంచి కేవలం రూ.1 తీసుకుని రూ.1968 కోట్లు చెల్లించామని తెలిపారు.

భారీ వర్షాలు, తుపాన్ల వల్ల నష్టపోయిన సుమారు రూ.1038 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పెట్టిన ధాన్యం సేకరణ బకాయిలు కూడా రూ.960 కోట్లు కూడా చెల్లించామని చెప్పారు. ఉచిత విద్యుత్‌ కోసం, ఆర్వా రైతుల బాగు కోసం రూ.17,430 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. ఉచిత విద్యుత్‌ పగటి పూట ఇవ్వడం కోసం రూ.1700 కోట్లు వెచ్చించామని తెలిపారు. విత్తనాల సబ్సిడీ కింద రూ.383 కోట్ల బకాయిలను కూడా మన ప్రభుత్వమే చెల్లించిందన్నారు.

శెనగ రైతులకు బోనస్‌గా రూ.300 కోట్ల రూపాయలు అధికారంలోకి రాగానే చెల్లించామని తెలిపారు. మొత్తంగా రైతుల కోసం ఈ 18 నెలల కాలంలో రూ. 61,400 కోట్ల చిరునవ్వుతోనే వెచ్చించామని చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడుతున్నానని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ శాశ్వత ప్రాతిపదికన ఇవ్వడానికి 10వేల మెగావాట్ల సోలార్‌ప్రాజెక్టుకు టెండర్లను పిలిచినట్లు తెలిపారు. మన గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విత్తనం నుంచి అమ్మకం వరకూ రైతుకు తోడుగా ఉంటున్నామని తెలిపారు.

గ్రామాల్లోనూ గోడౌన్లు, ప్రైమరీ ప్రాససింగ్‌ సెంటర్లు, నియోజకవర్గాల స్థాయిలో సెకండరీ ప్రాససింగ్‌ యూనిట్లు, గ్రామాల్లో జనతా బజార్లుకూడా ఈ సంవత్సర కాలంలో చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధరంగాలకు అండదండలు అందించడానికి వేల కోట్లు ఖర్చు చేయడానికి వెనకాడ్డం లేదని స్పష్టం చేశారు. పైన చెప్పబడ్డ వాటి కోసం దాదాపు రూ.10వేల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రణాళికా బద్ధంగా దీనికోసం అడుగులు ముందుకేస్తున్నామని పేర్కొన్నారు.

రైతుల మీద మమకారంతో, ప్రేమతో, బాధ్యతతో చేస్తున్నామని తెలిపారు. ఇంతగా రైతన్నకోసం మేం చాలా నిజాయితీ, చిత్తశుద్ధితో ఏ ఒక్క పొరపాటుకు ఆస్కారం లేకుండా పనిచేస్తున్నామని తెలిపారు. పండ్లు ఇచ్చే చెట్టుమీద రాళ్లు వేస్తున్నారని వాపోయారు. బాధ్యత లేని ప్రతిపక్ష నాయకుడు డ్రామాలు ఆడిస్తున్నాడని మండిపడ్డారు. రైతు భరోసా, నివర్‌ తుపాను బాధిత రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీని ఇవాళ ఇస్తామని గతంలోనే చెప్పామని తెలిపారు.

ఆరు సందర్భాల్లో చెప్పామని…నవంబర్‌ 24న వీడియో కాన్ఫరెన్స్‌లో, నవంబర్‌ 25న సీఎంఓ మీటింగులో, నవంబర్‌ 27న కేబినెట్‌ మీటింగులో, నవంబర్‌ 28న తిరుపతి రివ్యూ మీటింగులో, నవంబర్‌ 30న అసెంబ్లీలో, డిసెంబర్‌ 18న కేబినెట్లో చెప్పామని..ఇవాళ ఇస్తామని కొత్తగా చెప్పింది కాదు, గతంలోనే ఇన్నిసార్లు చెప్పామని అన్నారు. జగన్‌ ఒక తేదీ చెప్తే.. ఆ రోజు చేస్తాడని మీకు తెలుసన్నారు. ఇవాళ ఇస్తామని తెలుసు కాబట్టి, ఎలాగూ జరుగుతుంది కాబట్టి… వెంటనే చంద్రబాబుగారు… వక్ర కార్యక్రమాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.