Ap Covid 19 Cases : ఏపీలో డేంజర్ బెల్స్.. ఒక్కరోజే 500కి చేరువలో కరోనా కొత్త కేసులు, ఆ ఒక్క జిల్లాల్లోనే 100కుపైగా బాధితులు

ఏపీలో కరోనా పంజా విసురుతోంది. వైరస్ ప్రభావం మరింత అధికమవుతోంది. కొన్ని రోజులుగా కరోనా కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా ఆ సంఖ్య భారీగా పెరిగింది.

Ap Covid 19 Cases : ఏపీలో డేంజర్ బెల్స్.. ఒక్కరోజే 500కి చేరువలో కరోనా కొత్త కేసులు, ఆ ఒక్క జిల్లాల్లోనే 100కుపైగా బాధితులు

Andhra Pradesh Corona

Ap Covid 19 Cases : ఏపీలో కరోనా పంజా విసురుతోంది. వైరస్ ప్రభావం మరింత అధికమవుతోంది. కొన్ని రోజులుగా కరోనా కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా ఆ సంఖ్య భారీగా పెరిగింది. 500కి చేరువలో కొత్త కేసులు వెలుగుచూడటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 33వేల 634 కరోనా పరీక్షలు నిర్వహించగా… 492 మందికి పాజిటివ్ గా నిర్ధరణ అయింది.

ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 168 కోవిడ్ కేసులు గుర్తించారు. జిల్లాలోని రాజమండ్రిలో ఓ కాలేజీలో 163 మంది కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మరో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. అదే సమయంలో 256 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 2వేల 616 మంది చికిత్స పొందుతున్నారు.

ఒకే కాలేజీలో 140మందికి కోవిడ్:
ఏపీలోని విద్యా సంస్థల్లోనూ కరోనా కలవరానికి గురి చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిధిలోని ఓ కాలేజీలో ఇప్పటివరకు 163మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. ఆ కాలేజీలో గత రెండు రోజులుగా వరుసగా 13, 10 కేసులు రాగా, సోమవారం(మార్చి 22,2021) ఒక్కరోజే 140మందికి కరోనా సోకింది. పాజిటివ్ వచ్చిన వారిని ఒక ప్రాంతంలో ఉంచి, ఆ ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ గా చేశారు.

తెలంగాణలోనూ డేంజర్ బెల్స్..
ఏపీలోనే కాదు తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కొత్త కేసులు 400 దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,03,867కి పెరిగింది. నిన్న కొవిడ్‌తో ముగ్గురు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 1,674కి చేరింది.

తెలంగాణ రాష్ట్రంలో నిన్న(మార్చి 22,2021) రాత్రి 8 గంటల వరకు 68,171 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. కరోనా బారి నుంచి నిన్న 216 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,151 ఉండగా.. వీరిలో 1,285 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 103 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం(మార్చి 23,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి(మార్చి 24,2021) నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌ తరగతులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో ఆమె ప్రకటన చేశారు.

‘‘దేశంలో మరోమారు కరోనా వ్యాప్తి చెందుతోంది. మన పొరుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లోనూ అక్కడక్కడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర కార్యక్రమాలు సామూహికంగా జరుగుతున్నందున కరోనా తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలను మూసివేశాయి. మన రాష్ట్రంలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి.

ఈ పరిస్థితులను సంపూర్ణంగా సమీక్షించిన తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నింటినీ రేపటి నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ మూసివేత ఆదేశాలు మెడికల్ కాలేజీలు మినహాయించి రాష్ట్రంలోని హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటికీ వర్తిస్తాయి. విద్యార్థులకు గతంలో నిర్వహించిన మాదిరిగానే ఆన్‌లైన్‌ శిక్షణా తరగతులు యథావిధిగా కొనసాగుతాయి. ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలి. విధిగా మాస్కులు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. శానిటైజేషన్ తదితర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి” అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.