రామతీర్థంలో టెన్షన్ : కొండపైకి చంద్రబాబు.. ఆలయానికి తాళాలు

రామతీర్థంలో టెన్షన్ : కొండపైకి చంద్రబాబు.. ఆలయానికి తాళాలు

Chandrababu Ramateertham Tour : విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయి కారును టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. విజయసాయిరెడ్డి కారు అద్దం పగులగొట్టారు. రామతీర్థం ఆలయాన్ని పరిశీలించి కొండ దిగుతుండగా ఘటన జరిగింది. వైసీపీ, టీడీపీ నాయకుల పోటాపోటీ నినాదాలతో రామతీర్థంలో టెన్షన్ నెలకొంది. ఇరు పార్టీల నాయకులను పోలీసులు చెదరగొట్టారు.

మరోవైపు… టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రామతీర్థం చేరుకున్నారు. మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్లారు. అక్కడి పరిస్థితిని ఆయన స్వయంగా పరిశీలించారు. కానీ…బాబు వస్తున్న సందర్భంలో ఆలయానికి తాళాలు వేశారు. తాళం వేసి ఉండడం తమకు తెలియదని పూజారులు వెల్లడించారు. స్థానిక అధికారులను ప్రశ్నించగా..పొంతలేని సమాధానాలు చెప్పిన్నట్లు సమాచారం.

చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్‌ అయ్యారు. ఆలయ వ్యవస్థను నిర్వీర్యం చేసింది చంద్రబాబేనని విమర్శలు చేశారు. తిరుమలలో వెయ్యి కాళ్ల మండపాన్ని తొలగించిన ఘనుడు బాబు అంటూ మండిపడ్డారు విజయసాయి రెడ్డి.

ఉత్తరాంధ్ర భద్రాద్రి…ప్రముఖ పుణ్యక్షేత్రం…రామతీర్థం…రాజకీయ రగడతో వేడెక్కింది. బోడికొండపై కొలువైన శ్రీరామచంద్రుని విగ్రహ ధ్వంసం…రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసింది. ఘటన జరిగిన ఐదురోజుల తర్వాత అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ నేతలు పోటాపోటీగా పర్యటనలు చేపట్టడంతో రామతీర్థంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మూడు పార్టీలు స్థానికంగా శిబిరాలు ఏర్పాటు చేసుకుని బైఠాయించడంతో…రామతీర్థం కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది.

ముందుగా బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ రామతీర్థం చేరుకున్నారు. అయితే ఆయన్ను ఆలయం దగ్గరకు వెళ్లనీకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మాధవ్‌తో పాటు బీజేపీ కార్యకర్తలు మెట్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. మాధవ్ రామతీర్థం చేరుకున్న కాసేపటికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అక్కడకు వచ్చారు. విజయసాయి వెంట భారీగా వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. భారీ బందోబస్తు మధ్య విజయసాయి రెడ్డి రామతీర్థం ఆలయంలోపలికి వెళ్లి విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం రామతీర్థం నుంచి తిరిగి వస్తుండగా విజయసాయిరెడ్డిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. విజయసాయిరెడ్డి కారు అద్దాలు పగలగొట్టారు.

రామతీర్థం పర్యటనకోసం అంతకుముందు చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకన్నారు. అక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు విశాఖ నుంచి రోడ్డుమార్గంలో విజయనగరం బయలుదేరారు. అయితే విజయనగరం చేరుకోగానే చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. చివరకు నాటకీయ పరిణామాల మధ్య చంద్రబాబు రామతీర్థం చేరుకున్నారు. టీడీపీ, వైసీపీ, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ నినాదాలు, తోపులాటలతో విజయనగరం, రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీగా పోలీసులను మోహరించినప్పటికీ కార్యకర్తలను అదుపుచేయడం కష్టసాధ్యంగా మారింది.

ఐదు రోజుల క్రితం రాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసంచేయడంతో వివాదం మొదలయింది. శ్రీరామచంద్రుని విగ్రహం తల భాగాన్ని పూర్తిగా తొలగించివేసి కోనేరులో పడేశారు దుండగులు. ఈ నెల 29న ఈ ఘటన వెలుగులోకొచ్చింది. ఉదయంపూట ఎప్పటిలానే కొండపైకి వెళ్లి ఆలయం తలుపులు తీసిన పూజారి…శిరస్సులేని రాముడి విగ్రహం చూసి హతాశుడయ్యారు. వెంటనే విషయాన్ని దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అందరూ కలిసి విస్తృతంగా గాలించగా…కోనేరులో విగ్రహం తల లభించింది.

స్థానిక పోలీసులతో పాటు ఎస్పీ..గర్భాలయంలోకి వెళ్లి విగ్రహాన్ని పరిశీలించారు. ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపి దర్యాప్తు జరిపారు. ఇటీవల కాలంలో కొండపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. అయితే సీసీటీవీ లేకపోవడంతో…ఈ దారుణానికి పాల్పడింది ఎవరన్నదానిపై ఆధారాలు సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. విగ్రహం ధ్వంసం గురించి తెలుసుకున్న స్థానిక భక్తులు..కొండపైకి భారీగా చేరుకుని ఆందోళన జరిపారు.

విగ్రహ ధ్వంసంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఐదురోజులుగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీసీ ఎంపీ విజయసాయిరెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఒకేసారి రామతీర్థంకు రావడంతో రాజకీయ రగడ ముదిరింది.