Gudivada Amarnath : చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్.. అన్ స్కిల్డ్ పొలిటీషియన్ : మంత్రి గుడివాడ
చంద్రబాబు బ్యాక్ డోర్ పొలిటిషన్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుది అవినీతి సామ్రాజ్యమని ఆరోపించారు. ఐటీ అభియోగాలకు చంద్రబాబు సమాధానం చెప్పకుండా తేలు కుట్టిన దొంగలా ఉన్నాడని పేర్కొన్నారు.

Minister Gudivada Amarnath
Gudivada Amarnath – Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకి ఇచ్చిన ఐటీ నోటీసులపై నేషనల్ మీడియా కూడా కథనాలు రాస్తున్నప్పుడు ఆయన ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు స్పందన కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు చరిత్ర రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ఈ మేరకు సోమవారం మంత్రి గుడివాడ విశాఖలో మీడియాతో మాట్లాడారు. దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడి మీద లేని ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయని పేర్కొన్నారు.
చంద్రబాబు నేరుగా వచ్చి రాజకీయాల్లో రాణించలేదని వెన్నుపోటు నాయకుడని విమర్శించారు. చంద్రబాబు బ్యాక్ డోర్ పొలిటిషన్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుది అవినీతి సామ్రాజ్యమని ఆరోపించారు. ఐటీ అభియోగాలకు చంద్రబాబు సమాధానం చెప్పకుండా తేలు కుట్టిన దొంగలా ఉన్నాడని పేర్కొన్నారు. వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో చంద్రబాబు నైపుణ్యం మరెవ్వరికీ రాదన్నారు. ఐటీ అభియోగాలకు, ఆయనకు సంబంధం లేదని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు.
తీగ లాగితే చంద్రబాబు డొంక కదులుతుందన్నారు. చంద్రబాబు దోచిన సొమ్ములో రూ.118 కోట్లు చాలా తక్కువన్నారు. చంద్రబాబుకి 46 పేజీల నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఐటీ నోటీసులకు చంద్రబాబు పొంతన లేని సమాధానాలు చెప్తున్నారని వెల్లడించారు. ఎంవీపీ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా చంద్రబాబుకి నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఈ లావాదేవిలో చంద్రబాబు కోడ్ లాంగ్వేజీ వాడారని ఐటీ ఆ నోటీసుల్లో పేర్కొన్నట్లు చెప్పారు.
వివిధ కంపెనీల ద్వారా చంద్రబాబు లంచం తీసుకున్నారని.. దుబాయ్ నుంచి కూడా లంచాల రూపంలో మొత్తంగా రూ.118 కోట్లు అందాయని సమాచారం ఉందన్నారు. ఐటీ ఇచ్చిన నోటీసుల్లో లోకేష్ పేరు కూడా ఉందని చెప్పారు. చంద్రబాబు అనే వ్యక్తి స్కిల్డ్ క్రిమినల్.. అన్ స్కిల్డ్ పొలిటీషియన్ అని విమర్శించారు. స్కిల్ డెవలప్మెంట్ లో కూడా చంద్రబాబు డబ్బులు కాజేశాడని ఆరోపించారు.
చంద్రబాబు సీమన్స్ పేరు చెప్పి రూ. 350 కోట్లు కొట్టేశాడని విమర్శించారు. చంద్రబాబు చేసిన అవినీతిని ప్రజల ముందు పెడతామని చెప్పారు. ఇంకా చాలా అంశాలు బయటకు వస్తాయని తెలిపారు. చంద్రబాబుని ప్రజా కోర్టులో పెడతామని పేర్కొన్నారు. ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు.. చంద్రబాబు అవినీతిపై దృష్టి సారించాలన్నారు.