హ్యాట్సాఫ్ సీఎం.. కాన్వాయ్‌ను ఆపి అంబులెన్స్‌కు దారి ఇచ్చిన జగన్

  • Published By: naveen ,Published On : September 2, 2020 / 12:39 PM IST
హ్యాట్సాఫ్ సీఎం.. కాన్వాయ్‌ను ఆపి అంబులెన్స్‌కు దారి ఇచ్చిన జగన్

ఏపీ సీఎం జగన్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. పేషెంట్ ను తీసుకెళ్తున్న అంబులెన్స్‌కు దారి ఇవ్వడం కోసం ఆయన తన క్వానాయ్ ని ఆపించారు. కడప జిల్లా పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం జగన్.. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తాడేపల్లిలోని నివాసానికి కారులో బయల్దేరారు. అదే సమయంలో గూడవల్లి నిడమానూరు మధ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని అంబులెన్స్ లో తరలిస్తున్నారు. ఇది గమనించిన సీఎం జగన్, అంబులెన్స్‌కు దారి ఇవ్వాలని సిబ్బందితో చెప్పారు. వెంటనే వారు దారి ఇచ్చారు. ఎలాంటి ఆటంకం లేకుండా అంబులెన్స్ ముందుకు కదిలింది.

ఉయ్యూరు నుంచి గన్నవరానికి బైక్‌ పై వెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌ కాలేజీ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, సీఎం కాన్వాయ్‌ పక్కకు జరిగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.



అంబులెన్స్‌కు దారి ఇవ్వడం కోసం జగన్ తన కాన్వాయ్‌ను నిలిపేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో గవర్నర్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొనడం కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన.. రాజ్‌భవన్ నుంచి బయటకు వెళ్తుండగా.. అంబులెన్స్ శబ్దం వినిపించింది. దీంతో అంబులెన్స్ వెళ్లిన తర్వాతే కాన్వాయ్‌లో బయల్దేరి వెళ్లారు.



ఆ తర్వాత రాష్ట్రపతి కోవింద్‌కు స్వాగతం పలకడం కోసం గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు బయల్దేరిన జగన్.. విజయవాడ బెంజ్ సర్కిల్‌ చేరుకోగానే అంబులెన్స్ సైరన్ వినిపించింది. దీంతో అంబులెన్స్‌కు దారి ఇవ్వడం కోసం జగన్ తన కాన్వాయ్‌ను ఆపించారు. అంబులెన్స్ వెళ్లిన తర్వాత తన కాన్వాయ్‌ను కదలనిచ్చారు.





జగన్ తండ్రి దివంగత రాజశేఖర రెడ్డి హయాంలోనే 108 అంబులెన్సు సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ అంబులెన్సులు కుయ్ కుయ్ మంటూ.. ప్రమాదస్థలికి చేరుకుని క్షతగాత్రులను, అనారోగ్యం బారిన పడ్డ వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించేవి. అంబులెన్సుల విషయంలో తండ్రి కంటే ఓ అడుగు ముందుకేసిన జగన్.. ప్రతి మండలానికి ఒకటి చొప్పున అంబులెన్సులను కేటాయించారు.





ప్రజలకు, ముఖ్యంగా అంబులెన్స్‌ కు ఏమాత్రం అసౌకర్యం కలుగకుండా సీఎం కాన్వాయ్‌ వ్యవహరించడం, అంబులెన్స్‌ కు దారి ఇచ్చిన తర్వాతే సీఎం వైఎస్‌ జగన్‌ ముందుకుసాగడం గొప్ప విషయం అంటున్నారు నెటిజన్లు. ప్రజలకు, అంబులెన్స్ లోని పేషెంట్లకు ఇబ్బంది కలగకూడదన్న జగన్ మానవీయ హృదయాన్ని, ప్రజానిబద్ధతను ప్రశంసించారు. హ్యాట్సాఫ్ సీఎం, శభాష్ సీఎం అంటూ కితాబిచ్చారు. మాటలు చెప్పడం కాదు ఆచరణలో చూపడం కొంతమందికే సాధ్యం అంటున్నారు. తన ప్రవర్తనతో సీఎం జగన్ అందరికి ఆదర్శంగా నిలిచారని చెబుతున్నారు.