ఫిషింగ్ హార్బర్లకు సీఎం జగన్ శంకుస్థాపన

  • Published By: madhu ,Published On : November 21, 2020 / 05:16 AM IST
ఫిషింగ్ హార్బర్లకు సీఎం జగన్ శంకుస్థాపన

CM to lay stone for Ameenabad fishing harbour : ప్రపంచ మత్స్యకార దినోత్సవం. ఈ సందర్భంగా మత్స్యకారులకు అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో రూపొందించే మహత్తర ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుప్థాపన చేయనున్నారు. 2020, నవంబర్ 21వ తేదీ శనివారం వర్చువల్ విధానం ద్వారా..ఫిషింగ్ హార్బర్లకు శంకుస్థాపన చేస్తారు. తొలి దశలో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేయనున్నారు. మరో నాలుగు చోట్ల హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది.



అధికారంలోకి రాకముందు జగన్ పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను ఆయన గ్రహించారు. వారి సమస్యలను తొలగించేందుకు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతామని హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత..ఆ హామీ అమలు చేయనున్నారు. తొలి దశలో రూ. 1,510 కోట్లతో నాలుగు ఫిషింగ్ హార్బర్లను రెండు సంవత్సరాల్లో అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.



ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు. డిసెంబర్ నెలలో టెండర్లు ఖరారు కానున్నాయి. రెండో దశలో ప్రారంభమయ్యే మరో నాలుగు ఫిషింగ్ హార్బర్లు శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్ల పాలెం, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి రూ. 3 వేల కోట్లు వెచ్చిస్తోంది.