కరోనాను జయించి…. జీవనయానంలో ఓడిన దంపతులు

  • Published By: murthy ,Published On : August 3, 2020 / 10:04 AM IST
కరోనాను జయించి…. జీవనయానంలో ఓడిన దంపతులు

కరోనా మహమ్మారి ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసేస్తోంది. వ్యాధి సోకి కొందరు… వ్యాధి సోకుతుందనే భయంతో మరి కొందరు…. వ్యాధి కారణంగా తలెత్తిన ఆర్ధిక సంక్షోభంలో కొందరు బలైపోతున్నారు. అనంతపురం జిల్లాలో ఇదే జరిగింది. కరోనా జయించి ఇంటికి తిరిగి వచ్చినా వ్యాపారంలో నష్టాలు రావటంతో ఆ దంపతులు ఆత్మహత్య చేసుకుని తమ చిన్నారిని ఒంటరి వాడిని చేశారు.



అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో తేరు బజారులో ఉండే ఫణిరాజ్(39) మూగవాడు. అతనికి భార్య శిరీష(36) కుమారడు బాలాజీ (12) , తల్లి వరలక్ష్మి ఉన్నారు. మూగవాడైనప్పటికీ తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన బెల్లం వ్యాపారాన్ని ఆత్మస్ధైర్యంతో ముందుకు తీసుకు వెళ్లాడు. గత కొద్ది నెలలుగా ఏర్పడిన కరోనా లాక్ డౌన్ తో వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీంతో ఇంటి వద్దే కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకుని వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

ఈ క్రమంలో 10 రోజుల కిందట ఫణిరాజ్ తల్లి వరలక్ష్మి కరోనా బారిన పడి మరణించింది. దీంతో ఫణిరాజ్, శిరీష కూడా పరీక్షలు చేయించుకోగా వీరికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కోవిడ్ కేర్ సెంటర్ లో చికిత్స పొంది రెండు రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చారు. ఒక వైపు కరోనా కష్టాలతో ఉన్నా వ్యాపారంలో తాను బాకీపడిన వారికి ఉన్న ఇల్లు అమ్మి అప్పులు తీర్చినా ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి.



అప్పులు తీర్చే మార్దం కనిపించకపోవటం, కరోనా వచ్చిందని బంధువులు దూరం పెట్టటంతో భరించలేక పోయారు. శనివారం కొడుకును తాతగారింటికి పంపించేసారు. ఆదివారం తెల్లవారుఝామున తాము ఉంటున్న మూడంతస్తుల డాబా పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఫణిరాజ్ అక్కడి కక్కడే మృతి చెందగా, శిరీష ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందింది.