Cyclone Yaas : మరో తుపాన్ గండం, తెలుగు స్టేట్స్ కు వర్ష సూచన

తౌటే విధ్వంసం నుంచి కోలుకోకముందే..బంగాళాఖాతంలో మరో అతి తీవ్ర తుపాన్ ఏర్పడింది. ఈ మేరకు భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని తెలిపింది.

Cyclone Yaas : మరో తుపాన్ గండం, తెలుగు స్టేట్స్ కు వర్ష సూచన

Cyclone Yaas

Forecast For Telugu States : తౌటే విధ్వంసం నుంచి కోలుకోకముందే..బంగాళాఖాతంలో మరో అతి తీవ్ర తుపాన్ ఏర్పడింది. ఈ మేరకు భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని తెలిపింది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో 2021, మే 22వ తేదీ శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారనుందని, సోమవారం తుపాన్ గా మారనుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

మే 25వ తేదీ నాటికి అతి తీవ్ర తుపాన్ గా మారవచ్చని ఐఎండీ సూచించింది. 26వ తేదీన ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. యాస్ తుపాన్ ప్రభావం ఏపీతో సహా తీర ప్రాంతాల్లోని ఐదు రాష్ట్రాలపై ప్రభావం ఉంటుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందుగానే అప్రమత్తమైన కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

ఒడిశా, ఏపీ, పశ్చిమబెంగాల్, అండమాన్, తమిళనాడు రాష్టాల సీఎస్ లకు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖలు రాశారు. తూర్పు కోస్తా తీర ప్రాంతాల్లో…భారీ వర్షాలు, వరదలు తలెత్తే ప్రమాదం ఉందని కేంద్రం తెలిపింది. ఇప్పటికే కోవిడ్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజారోగ్యంపై నీళ్లు, దోమలు, గాలి ద్వారా సంక్రమించే వ్యాధులు మరిన్ని సవాల్ విసిరే అవకాశాలున్నాయని కేంద్రం హెచ్చరించింది. అత్యవసర సేవలకు అంతరాయం కలుగకుండా చూసుకోవాలని, మందులను నిల్వ చేసుకోవాలని సూచించింది.

మరోవైపు యాస్ తుపాన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి సాధారణ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉండనుందని, ఈ కారణంగా..26వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ అధికారులు హెచ్చరించారు.

యాస్ రూపంలో వస్తున్న తుపాన్ ను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. వేటకు వెళ్లిన వారిని రప్పిస్తోంది. బోట్లను తీరాలకు చేరుస్తున్నారు. తుపాన్ ప్రయాణించే దారిని బట్టి నేవీ, ఫైర్, విద్యుత్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ వెళుతున్నారు అధికారులు. ఇక తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రుతుపవానలు ప్రవేశించముందే పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.