తీరాన్ని తాకిన వాయుగుండం, పొంచి ఉన్న మరో ముప్పు, ఏపీలో ఆరు జిల్లాల్లో హైఅలర్ట్

10TV Telugu News

deep depression : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కాకినాడకు అత్యంత సమీపంలో తీరాన్ని తాకింది. ప్రస్తుతం 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ-ఉప్పాడ దగ్గర అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో బీచ్‌రోడ్‌ను మూసివేశారు.

మంగళవారం(అక్టోబర్ 13,2020) ఉదయం 8 గంటల ప్రాంతంలో విశాఖపట్నం, నర్సాపూర్‌ల మధ్య కాకినాడకు ఎగువున.. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొచ్చింది. కాకినాడ సమీపంలో భూభాగాన్ని తాకినట్టు వాతావరణశాఖ తెలిపింది. తీరం దాటిన తర్వాత తీవ్ర వాయుగుండం నుంచి వాయుగుండంగా మారి.. అప్పుడు అల్పపీడనంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 15న మరో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఏపీలోని ఆరు జిల్లాల్లో హై అలర్ట్:
రాగల నాలుగైదు గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏపీలోని ఆరు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. విశాఖ, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో.. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తీవ్ర వాయుగుండం ప్రభావం తెలంగాణపైనా ఉంది. రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో.. ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే అత్యధిక వర్షపాతం:
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీ మీటర్ల కంటే అత్యధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం:
వాయుగుండం తీరం దాటిన తర్వాత ఏపీలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతానికి వాయుగుండం తీరం దాటినా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుంది. ఇవాళ్టి(అక్టోబర్ 13,2020) నుంచి తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు కాకినాడ తీర ప్రాంతంలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. తీరంలో 50నుంచి 70కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వచ్చే నాలుగైదు గంటల్లో ఉభయగోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

10TV Telugu News