ఏలూరులో నిఫా వైరస్ లక్షణాలు.. డాక్టర్ సమరం

  • Published By: bheemraj ,Published On : December 8, 2020 / 04:10 PM IST
ఏలూరులో నిఫా వైరస్ లక్షణాలు.. డాక్టర్ సమరం

Different arguments unhealthy conditions Eluru : ఏలూరులో అనారోగ్య పరిస్థితులపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. వాటర్ పొల్యూషన్ కారణమని కొందరు వైద్యులు చెబుతుంటే… నిఫా వైరస్ కూడా కావచ్చని డాక్టర్ సమరం అంటున్నారు. ఏలూరులో నిఫా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టర్ సమరం అంటున్నారు. గతంలో కేరళలో నిఫా వైరస్ విజృంభించిందన్న ఆయన.. పరిశోధనలు జరిపి నిర్థారణ చేయాలని చెప్పారు. ఒకవేళ నిఫా వైరస్ అయినా భయపడనవరసం లేదని డాక్టర్ సమరం పేర్కొన్నారు.



ఏలూరులో ప్రజల అనారోగ్యానికి నీటి కాలుష్యమే కారణమని ఎయిమ్స్ వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. భార లోహాలైన సీసం, ఆర్గాన్ క్లోరిన్ కలిసిన నీటిని తాగినందుకే ప్రజలు అనారోగ్యానికి గురై ఉంటారని ఎయిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్.. డాక్టర్ రాకేశ్ కక్కర్‌ అభిప్రాయపడ్డారు. నీరు, పాలు కలుషితం కావడంతోనే అనారోగ్య సమస్యలు వచ్చి ఉంటాయన్నారు. పరిశ్రమల నుంచి వెలువడిన వ్యర్థాలు, బ్యాటరీల వల్ల నీటి కాలుష్యం జరిగి ఉండొచ్చన్న ఆయన.. బాధితుల్లో ఎక్కువ మంది న్యూరోలాజికల్ సమస్యలకు గురయ్యారని చెప్పారు.



ఎక్కువ మందికి మూర్చ రావడం, స్పృహ కోల్పోవడం జరిగిందన్నారు. ఈ కాలుష్యం గర్భిణీ స్త్రీలపై తప్పకుండా ఎఫెక్ట్ చూపుతుందన్నారు. తాము బాధితులతో మాట్లాడినప్పు చాలా మంది నీళ్లు బ్లీచింగ్ వాసన, రుచి లేవని చెప్పారని, కొందరు మాత్రం నీటి రంగు మారినట్లు తెలిపారని అన్నారు. బ్లీచింగ్ వల్ల సమస్యలు వచ్చాయా లేదా అన్నది సెంట్రల్ టీమ్ పరిశోధనలో తెలుస్తుందన్నారు డాక్టర్ రాకేశ్‌ కక్కర్.



మున్సిపల్ ట్యాంక్ నీళ్లే ఏలూరు కొంపముంచాయా? అందులో ప్రమాదకర పదార్ధాలు కలిశాయా? అంటే అవుననే అంటున్నాయి పలు కెమికల్ అనాలసిస్ సంస్థలు. తమ నివేదికల్లో ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెల్లడించాయి. ఏలూరులో నీటి శాంపిల్స్‌ను IICT, CSIR-NGRI పరీక్షించాయి. నీళ్లలో అధిక మోతాదులో క్లోరైన్, పాస్పైట్ పెస్టిసైడ్స్ ఉన్నట్లు గుర్తించాయి.



వాటర్ ట్యాంక్ సమీపంలోని పొలాల్లో ఎక్కువగా పాస్పైట్ పెస్టిసైడ్స్ వాడి ఉంటారని అది నీటిలో కలిసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాయి. ప్రజలు ఉన్నట్టుండి పడిపోవడంపై ఢిల్లీ ఎయిమ్స్, ఐఐసీటీ నివేదికలు ఇచ్చాయి. ఏలూరులో పరిస్థితికి లెడ్‌, నికెల్ కారణమని తేల్చాయి. బాధితుల రక్తంలో అధిక మోతాదులో లెడ్ హెవీమెటల్, నికెల్ ఉన్నట్లు స్పష్టం చేశాయి.



పని చేస్తున్న వారు, గుడికి వెళ్లినవారు, ఇంట్లోవారితో మాట్లాడుతున్నవారు సడన్‌గా ఉన్నట్లుండి స్పృహతప్పి పడిపోతున్నారు. నాలుగు రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో ఇదే జరుగుతోంది. ప్రతీ ఒక్కరు చూస్తుండగానే కళ్లముందే ఫిట్స్ వచ్చినట్లు పడిపోతున్నారు. ఇలా ఇప్పటి వరకు 502 మంది ఆస్పత్రుల్లో చేరారు.



గంటగంటకూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. వీరిలో 332మందిని డిశ్చార్జ్‌ చేయగా…. 153మంది చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారిని గుంటూరు, విజయవాడ ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటిదాకా ఏలూరును వణికించిన ఈ అంతుచిక్కని మహమ్మారి… చుట్టు పక్కల ప్రాంతాలకూ విస్తరిస్తోంది.