గురుప్రతాప్‌రెడ్డిని ఎందుకు చంపారో తెలుసా

10TV Telugu News

Guru Pratap Reddy was killed : కడప జిల్లాలో సంచలనం సృష్టించిన ఆర్మీ మాజీ ఉద్యోగి గురుప్రతాప్‌రెడ్డి హత్య కేసు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. 13మందిని కొండాపురం సర్కిల్‌లో రహస్యంగా విచారించారు. గురుప్రతాప్‌రెడ్డిని పక్కా ప్లాన్ ప్రకారమే ప్రత్యర్థులు హత్య చేసినట్లు తెలుస్తోంది. స్టాలిన్ సినిమాను తలపించేలా అవినీతిపై గురుప్రతాప్‌రెడ్డి పోరాటం చేశాడు. అనర్హులకు ముంపు పరిహారం ఇస్తున్నారని పోరాటం కొనసాగించాడు. బి.అనంతపురం పరిహారం జాబితాలో బయట వ్యక్తులున్నట్లు గుర్తించిన గురుప్రతాప్‌రెడ్డి… విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.బి.అనంతపురం గ్రామంలో మొత్తం 250 కుటుంబాలు ఉంటే.. అధికారులు 500 కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు నివేదిక సిద్ధం చేశారని తెలిపాడు. 25కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. మొత్తం వ్యవహారంపై అధికారులు విచారణ జరుపుతుండగానే.. ప్రత్యర్థులు దాడి చేసి గురుప్రతాప్‌రెడ్డిని హత్య చేశారు.గండికోట ప్రాజెక్టు నిర్మిస్తున్న క్రమంలో కొండాపురం మండలంలో 21 గ్రామాలు, ముద్దనూరు మండలంలో మరో రెండు గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఇటీవల భారీగా వర్షాలు కురిసాయి. గండికోట ప్రాజెక్టులో 16 టీఎంసీల నీటని నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 12 టీఎంసీలు నిల్వ చేయగా… పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దీంతో… ముంపు ప్రాంతాల వారికి వెంటనే పరిహారం ఇచ్చి గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.గత ప్రభుత్వం కంటే 10 లక్షలు ఎక్కువ ఇచ్చేందుకుగాను నిధులు కూడా విడుల చేసింది. కొండాపుం మండలం పి. అనంతపురంలో 677 నిర్వాసిత కుటుంబాలుండగా… 67.7 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 265మంది అనర్హులున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో.. అధికారులు సర్వే చేస్తున్న సమయంలో… ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటనలో గురుప్రతాప్‌రెడ్డిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు.పక్కా ప్లాన్ ప్రకారమే గురు ప్రతాప్‌రెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గురుప్రతాప్ రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. శరీరంపై 9 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. గతంలో ఇసుక అక్రమాలపై కూడా గురుప్రతాప్ అధికారులకు ఫిర్యాదులు చేసారు. ఈ పరిస్థితుల్లో… ఇసుక అక్రమార్కులు దాడి చేశారా లేక… ముంపు సొమ్ము స్వాహా చేసేందుకు ప్రయత్నించిన వారేమైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు… అనుచరుడు గురుప్రతాప్ పార్థీవదేహానికి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి నివాళులర్పించారు.

10TV Telugu News