Andra Pradesh : ఏపీలో మొదలైన ఎన్నికల వేడి .. పర్యటనలతో పార్టీ అధినేతల కసరత్తులు

చంద్రబాబు ఢిల్లీ పర్యటన, జనసేన పవన్ కల్యాన్ ‘వారాహి’యాత్ర, సభల్లో పాల్గొనేందుకు ఏపీకి ఢీల్లీ అగ్రనేతలు రాక, ప్రభుత్వ కార్యక్రమాలతో వైసీపీ, ఇలా ఏపీలో వాతావరణ ముందస్తు ఎన్నికలకు సంకేతమా?

Andra Pradesh : ఏపీలో మొదలైన ఎన్నికల వేడి .. పర్యటనలతో పార్టీ అధినేతల కసరత్తులు

Election Heat in Andra Pradesh

Andra Pradesh Elections heat : ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వస్తాయా? పార్టీ అధినేతలు పర్యటనతోను,పొత్తుల ఎత్తుల కోసం కసరత్తులు చేస్తున్నారా? క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీల అధినేతల బిజీ చూస్తుంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయా అనిపిస్తోంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘వారాహి’యాత్ర, సభల్లో పాల్గొనేందుకు ఏపీకి ఢీల్లీ అగ్రనేతలు రాక, గడప గడపకు అంటూ వైసీపీ కార్యక్రమాలు..ఇలా ఏపీలో వాతావరణం ముందస్తు ఎన్నికలకు సంకేతంగా కనిపిస్తోంది.

 

చంద్రబాబు పర్యటనలు..ఢిల్లీ టూర్ పై ఉత్కంఠ..
ఇప్పటికే చంద్రబాబు పలు పర్యటనలతో బిజీ బిజీగా ఉన్నారు. ఓపక్క బాబు పర్యటనలు..మరోపక్క లోకేశ్ యువగళం పేరుతో కొనసాగుతున్న పాదయాత్ర. ఇలా ప్రజలకు చేరువ కోసం టీడీపీ యత్నాలు చేస్తోంది.‘ఇదేం ఖర్మరా బాబూ’అనే పేరుతో  కొంతకాలంలో చంద్రబాబు ప్రజల్లోనే ఉంటున్నారు. సభలు, సమావేశాలు, నేతలతో చర్చలు, బాధితుల పరామర్శలు వంటి కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో మహానాడులో మినీ మ్యానిఫెస్టో ప్రకటించటంతో ఎన్నికల వేడి మరింతగా పెరిగిందనే చెప్పాలి. భవిష్యత్తు గ్యారంటీ పేరుతో చంద్రబాబు పర్యటలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన..అమిత్ షాతో భేటీ కోసం ఢిల్లీ వెళ్లారు. ఈ భేటీ వెనుక పొత్తు చర్చ ఉందనే సమాచారం.

 

జనసేనానా ‘వారాహి’ యాత్ర అన్నవరం టూ భీమవరం…
మరోపక్క జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సిద్ధమవుతున్నారు జూన్ 14 నుంచి అన్నవరం టూ భీమవరం యాత్రకు రూట్ మ్యాప్ తో శ్రీకారం చుట్టారు. ఇటీవల కాలంలో సినిమా షూటింగులతో బిజీ బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ మరోసారి ప్రజల్లోకి రాబోతున్నారు. తాను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న వారాహి వాహనంపై యాత్రకు బయలుదేరనున్నారు. అన్నవరం (Annavaram)లో రత్నగిరిపై కొలువైన సత్యనారాయణ స్వామి సన్నిధిలో వారాహికి పూజలు చేయించి స్వామివారిని పవన్ కల్యాణ్ దర్శించుకుని యాత్రను ప్రారంభించనున్నారని జనసేన పార్టీ (Janasena Party) పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తెలిపారు.

 

ఏపీకి ఢిల్లీ బీజేపీ అగ్రనేతలు..
ఇంకోపక్క బీజేపీ కూడా ఏపీలో సభలను షురూ చేసింది. ఢిల్లీ నుంచి బీజేపీ అగ్రనేతలు ఏపీకి తరలి వస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీకి వస్తున్నారు. జూన్ 8న అమిత్ షా విశాఖకు వస్తుండగా, 10న తిరుపతికి జేపీ నడ్డా రానున్నారు. మోదీ 9ఏళ్ల పాలనపై ఏపీలో రెండు భారీ బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేసింది. 8న విశాఖలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. 10న తిరుపతిలో జరిగే బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారు.

 

గడప గడపకు మన ప్రభుత్వం..జగన్ స్టిక్కర్లతో వైసీపీ దూకుడు..
ఇకపోతే అధికార పార్టీ ప్రతిపక్షాలకు ధీటుగా పార్టీ కార్యక్రమాలు చేస్తోంది.గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు, మంత్రులు తిరుగుతున్నారు. ఇంటింటికీ జగన్ స్టిక్కర్లు అంటిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గడప గడపకు తిరుగుతున్నారు. అలాగే సీఎం జగన్ బటన్ నొక్కుతు కార్యక్రమాలతో ప్రజలకు నిధులు డైరెక్టుగా అందేలా చేస్తున్నారు. సభల్లో ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. అలా వైసీపీ ప్రభుత్వ కార్యక్రమాల డోస్ పెంచింది.

 

జగన్ క్యాబినెట్ సమావేశంపై ఆసక్తి..
ఏపీలో ముందస్తు ఎన్నికల సందడి కనిపిస్తోంది. జూన్ 7న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. ఇందులో ముందస్తు ఎన్నికలకు సంబంధించి కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. అందుకే ఈ కేబినెట్ భేటీని ఏర్పాటు చేసి ఉంటారేమోనని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగనున్నాయని వాతావరణం కనిపిస్తోంది.