Sabbam Hari : కరోనాతో మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి కన్నుమూత

కరోనావైరస్ మహమ్మారి కారణంగా మరో రాజకీయ ప్రముఖుడు కన్నుమూశారు. మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి (69) కరోనాతో చనిపోయారు. విశాఖలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన కొవిడ్‌ బారిన పడిన

Sabbam Hari : కరోనాతో మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి కన్నుమూత

Sabbam Hari Passes Away

Sabbam Hari Passes Away : కరోనావైరస్ మహమ్మారి కారణంగా మరో రాజకీయ ప్రముఖుడు కన్నుమూశారు. మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి (69) కరోనాతో చనిపోయారు. విశాఖలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన కొవిడ్‌ బారిన పడిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా విశాఖలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సబ్బం హరికి కొవిడ్‌తో పాటు ఇతర ఇన్‌ఫెక్షన్లు కూడా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. ఆరోగ్యం విషమించడంతో సోమవారం(మే 3,2021) మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

సబ్బం హరి స్వస్థలం తగరపువలస సమీపంలోని చిట్టివలస. 1952 జూన్‌ 1న జన్మించారు. విశాఖ మేయర్‌గా పనిచేసిన ఆయన 2009లో అనకాపల్లి నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సబ్బం హరి మరణం పట్ల చంద్రబాబు సంతాపం తెలిపారు.

”సబ్బం హరి నిస్వార్థ రాజకీయాలకు ప్రతీక. తన భావాలను వ్యక్తపరచడంలో ఎవరికీ భయపడని తత్వం ఆయన సొంతం. నగర మేయర్ గా విశాఖపట్నం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వారి మృతి తెలుగుదేశానికి తీరని లోటు. సబ్బం హరి మృతి వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా. విశాఖ మేయర్ గా, ఎంపీగా సబ్బంహరి ప్రజలకు ఎనలేని సేవ చేశారు. సబ్బం హరి మంచి వక్త. సబ్బం హరి కుటుంబసభ్యులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది” అని చంద్రబాబు సంతాపం తెలిపారు.

సబ్బం హరి మృతి పట్ల ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంతాపం తెలిపారు. కరోనా బారిన పడి ఆయన మృతిచెందడం బాధాకరం అన్నారు. సబ్బం హరి త్వరగా కోలుకోవాలని అంతా ప్రార్థించామని, ఇంతలోనే మరణవార్త వినాల్సి రావడం దురదృష్టకరం అన్నారు. విశాఖ మేయర్, ఎంపీగా ఆయన ప్రజలకు విశేషమైన సేవలు అందించారని అచ్చెన్నా అన్నారు. సమస్యలపై పోరాడి ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారని చెప్పారు. సబ్బం హరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
తెలిపారు అచ్చెన్న.

కొద్ది రోజుల కిందట సబ్బం హరి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందులో పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. వైద్యుల సూచన మేరకు తొలుత ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయినా ఆరోగ్యం మెరుగు కాకపోవడంతో ఆస్పత్రిలో చేరారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న సబ్బం హరి ఆరోగ్యం నేడు(మే 3,2021) విషమించినట్టు డాక్టర్లు తెలిపారు. కరోనాతో పాటు ఇతర ఇన్‌ఫెక్షన్లు కూడా ఉన్నాయన్నారు.

సబ్బం హరి విశాఖపట్నం మేయర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్‌తో వైఎస్ జగన్ విభేదించిన సమయంలో ఆయనతో కలిసి రాజకీయ ప్రయాణం సాగించిన వ్యక్తిగా సబ్బం హరి నిలిచారు. వైసీపీకి అండగా ఉంటూ కాంగ్రెస్ అధిష్టానంతో విభేదించారు. జగన్‌కు పూర్తి అండగా నిలిచారు. ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్ వెంట నిలిచారు. ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి. వైఎస్ జగన్‌తో విభేదాలు రావడంతో సబ్బం హరి ఆయనకు దూరమయ్యారు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరమయ్యారు. అనంతరం టీడీపీలో చేరిన సబ్బం హరి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.