Heavy Rains : కడప జిల్లాలో వర్ష బీభత్సం..జలదిగ్బంధంలో గ్రామాలు..నీట మునిగిన పంటలు

కడప జిల్లా ప్రజలకు వాయుగుండం గండంగా మారింది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడప జిల్లా అతాలకుతలం అవుతోంది. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తోంది.

10TV Telugu News

Heavy Rains in Kadapa district : కడప జిల్లా ప్రజలకు వాయుగుండం గండంగా మారింది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడప జిల్లా అతాలకుతలం అవుతోంది. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో నదులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గ్రామాల్లోకి వరద నీరు వచ్చింది. పలు గ్రామాలు జలదిగ్బందంలో ఉన్నాయి. రైల్వేకోడూరులోని గుంజనేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గుంజనేరు వరద ధాటికి 20 ఇళ్లు కొట్టుకుపోయాయి. మరోవైపు రాజంపేటలో వరదలో 3 ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. బస్సు ప్రమాదంలో 12 మంది ప్రయాణీకులను రెస్క్యూ టీమ్ రక్షించింది. ఇప్పటివరకు 5 మృతదేహాలు లభ్యమయ్యాయి.

కడప జిల్లాలో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ప్రవాహంలో మునిగి మందపల్లి, పులపుత్తూరులో 50 మంది మృతి చెందినట్లు ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి తెలిపారు. 11 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. హెలికాప్టర్ సాయంతో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. వరద కష్టాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డి అన్నారు.

RTC Buses : వాగులో చిక్కుకున్న మూడు ఆర్టీసీ బస్సులు.. ముగ్గురు ప్రయాణికులు మృతి

వరద బీభత్సంతో కడప జిల్లాలో వందల ఎకరాలు నీట మునిగాయి. జమ్మలమడుగు మండంలోని చాలా గ్రామాల్లో పంటలు నీటిపాలయ్యాయి. వరి, పసుపు, శనగ, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. మండలంలోని ఉప్పలపాడు వాగు పొంగిపొర్లడంతో కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, కర్నూల్ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గండికోట జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు 11గేట్ల ద్వారా పెన్నా నదికి నీటిని విడుదల చేశారు. వరద ఉధృతి పెరుగుతుండటంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమంత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

భారీ వర్షాలతో కర్నూలు జిల్లా అవుకు రిజర్వాయర్ కు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. మొత్తం 1200 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతోంది. గరిష్ట నీటిమట్టం 4.148 టీఎంసీలకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిఎన్‌యస్‌యస్ కాలువ ద్వారా కడప జిల్లా గండికోట రిజర్వాయర్ కు 250 క్యూసెక్కుల నీటిని, పంట సాగుకు యస్‌ఆర్‌బీసీ కాలువ ద్వారా 350 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.

AP Cabinet : ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. పలు బిల్లులకు ఆమోదం

కడప జిల్లా వరదలు బీభత్సం సృష్టించాయి. ఓ వ్యక్తి గల్లంతవగా…మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. పాములూరు సమీపంలోని వాగులో ఆటో కొట్టుకుపోయింది. ఆటోలో ఉన్న డ్రైవర్ వరద ఉధృతికి గల్లంతయ్యాడు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. గల్లంతైన ఆటోడ్రైవర్ పాములూరుకు చెందిన భాషాగా గుర్తించారు. అలాగే వేంపల్లెలోని పాపాగ్ని నదిలో మరో వ్యక్తి చిక్కుకున్నాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు అధికారులు. తాళ్ల సాయంతో అతన్ని ఒడ్డుకు చేర్చారు. బెంగాల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

×