కరోనా నెగెటివ్ రిపోర్టు చూపించినా…ఇంట్లోకి రానివ్వని ఇంటి యజమాని

  • Published By: bheemraj ,Published On : July 22, 2020 / 09:27 PM IST
కరోనా నెగెటివ్ రిపోర్టు చూపించినా…ఇంట్లోకి రానివ్వని ఇంటి యజమాని

కరోనా సోకిన వారిపై వివక్ష చూపకూడదని ఎన్నిసార్లు ప్రభుత్వాలు చెబుతున్నా..చాలా మందిలో మార్పు రావడం లేదు. బాధితులను వేరుగా చూస్తూ వారిని మరింత కుంగదీస్తున్నారు. తిరుపతిలోనూ ఇలాంటి అమానవీయ ఘటనే జరిగింది.

కరోనాతో పోరాడి కోలుకుని ఇంటికి చేరిన బాధితురాలి పట్ల ఇంటి యజమాని అమానుషంగా ప్రవర్తించాడు. ఇంట్లోకి రానిచ్చేది లేదంటూ తేల్చి చెప్పారు. దీంతో తిక్కుతోచని స్థితిలో గంటల పాటు ఆ కుటుంబం రోడ్డుపైనే నిరీక్షించాల్సివచ్చింది.

సుందరయ్యనగర్ లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న చంద్రకళ అనే మహిళకు ఇటీవల కరోనా సోకింది. ఆమెను కోవిడ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కుటుంబ సభ్యులు కూడా 14 రోజులపాటు క్వారంటైన్ కు వెళ్లారు. ఆ తర్వాత అందరికీ నెగెటివ్ రావడంతో తిరిగి తమ అద్దె ఇంటికి వచ్చారు. కానీ వారిని ఇంట్లోకి అనుమతించకుండా యజమాని అడ్డుకున్నారు.

దీంతో చంద్రకళ ఇద్దరు కూతుళ్లతో కలిసి నడి రోడ్డుపైనే పడిగాపులు కాసింది. యజమాని వ్యవహరించిన తీరుతో బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు కలుగజేసుకోవడంతో కథ సుఖాంతమైంది. యజమాని తీరు తెలిసిన వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.