TDP: తెలుగుదేశానికి జీవన్మరణ సమస్య.. క్లిష్ట పరిస్థితులను టీడీపీ ఎలా ఎదుర్కొబోతోంది.. బాలకృష్ణ వల్ల అవుతుందా?

ప్రభుత్వం చెప్పినట్లు లోకేశ్‌ను అరెస్టు చేస్తే.. ముఖ్యనేతలు ఇద్దరూ అందుబాటులో లేకుండాపోతే అప్పుడు పరిస్థితి ఏంటనే ప్రశ్న కార్యకర్తలను వేధిస్తోంది. బాలకృష్ణ, అచ్చెన్నాయుడు వంటివారు పార్టీ పగ్గాలు చేపడతారా?

TDP: తెలుగుదేశానికి జీవన్మరణ సమస్య.. క్లిష్ట పరిస్థితులను టీడీపీ ఎలా ఎదుర్కొబోతోంది.. బాలకృష్ణ వల్ల అవుతుందా?

how telugu desam party overcome difficulties while chandrababu in jail

Telugu Desam Party: 40 ఏళ్ల చరిత్ర.. పాతికేళ్ల అధికారం చలాయించిన అనుభవం.. వందల మంది నాయకులు.. లక్షల మంది కార్యకర్తలు.. ఏ ప్రాంతీయ పార్టీకైనా ఇంతకుమించిన బలం.. బలగం ఇంకేముంటాయి..? ఇవన్నీ ఉన్న పార్టీ కష్టాలను ఎదుర్కోవాల్సివస్తే ఏం చేస్తుంది..? సీనియర్ లీడర్లు ఎలా రియాక్ట్ అవుతారు? కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుంది? పోరాటాలతో తమ పంతం నెగ్గించుకుంటారా? ప్రభుత్వ నిర్బంధమని తప్పించుకుంటారా? పోరాడిన వారిని ప్రోత్సహిస్తారా? కేసుల్లో చిక్కుకుంటామని వెన్నుచూపుతారా? తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు ఇంచుమించు ఇలానే ఉంది.. ఓ వైపు కార్యకర్తలు అధినేత అరెస్టుపై ఉద్యమిస్తుంటే.. ముందు వరసలో నిల్చొని పోరాటానికి నాయకత్వం వహించాల్సిన టీడీపీ సీనియర్లు ఎక్కడా కనిపించడం లేదు. నలభైయేళ్ల టీడీపీకి నాయకత్వమే సమస్యా? లక్షలాది కార్యకర్తల బలం ఉన్నా.. సంక్షోభాన్ని అధిగమించడంలో తడబాటు ఏంటి? సీనియర్లలో నైరాశ్యమా? నిస్తేజమా? ఎందుకీ పరిస్థితి?

అధినేత చంద్రబాబు అరెస్టుతో టీడీపీ ఎప్పుడూ లేనంత అనిశ్చితిని.. గతంలో ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. 40 ఏళ్ల టీడీపీ చరిత్రలో సంక్షోభాలు.. గడ్డు పరిస్థితులు ఎన్నో వచ్చినా.. గతంలో ఇలాంటి పరిస్థితిని మాత్రం తెలుగుదేశం చూడలేదు. గత సంక్షోభాల్లో క్యాడర్ కకావికలమైనా.. అధినేత అండగా నిల్చొని అడ్డు చక్రం వేసి పార్టీని కాపాడుకున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ హయాంలోనూ.. ఆ తర్వాత చంద్రబాబు నాయకత్వంలోనూ టీడీపీ సంక్షోభాలను చవిచూసింది. అందులో మొదటిది 1984లో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల ఎపిసోడ్.. రెండోది 1991లో పార్లమెంటరీ పార్టీ చీలిక.. ఇక 95లో చంద్రబాబు నాయకత్వంలోనే తిరుగుబాబు.. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్‌పై ఎన్నో సందేహాలు.. మరెన్నో అనుమానాలు వ్యక్తమయ్యేవి. కానీ.. అవేవీ టీడీపీ పునాదులను కదిలించలేకపోయాయి. ఐతే ఇప్పుడు ఆ పునాదులు షేకయ్యేలా అధినేత అరెస్టు అన్న సంక్షోభం టీడీపీని కమ్మేసింది.

చంద్రబాబు అలవోకగా హ్యాండిల్ చేసేవారు..
గత సంక్షోభాలకు.. ప్రస్తుత పరిస్థితులు స్పష్టమైన తేడా చెబుతున్నారు పరిశీలకులు. అప్పట్లో ఏ సంక్షోభం వచ్చినా.. చంద్రబాబు అడ్డుకునేవారు.. ఇంకా చెప్పాలంటే ఆయనొక్కరే ఏ పరిస్థితిని అయినా దీటుగా ఎదుర్కొని పార్టీని కాపాడుకునేవారు. 1985-94 మధ్య కాంగ్రెస్ విధానాలపై ఆగ్రహం చెందిన టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అసెంబ్లీకి వెళ్లకపోతే.. సభలో టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబే దిశానిర్దేశం చేశారు. అయితే ఇప్పటి సంక్షోభానికి చంద్రబాబే మూలకారణంగా మారిపోయారు. గతంలో ఏ పరిస్థితిని అయినా చంద్రబాబు అలవోకగా హ్యాండిల్ చేసేవారు. టీడీపీలో చంద్రబాబు సహకాలీన నాయకులు ఎందరో ఉన్నా.. వారు కూడా బాబు చూసుకుంటారులే అనే ధీమాతో పార్టీలో మరో ట్రబుల్ షూటర్‌ను తయారు చేయకుండా వదిలేశారు.

చంద్రబాబు అరెస్టుతో ఇప్పుడు ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. సాక్ష్యాత్తూ అధినేత జైలులో ఉండిపోవడం.. ఆయన తర్వాత పార్టీలో నెంబర్ 2గా ఎదురుతున్న లోకేశ్.. ఢిల్లీలో న్యాయవాదులతో చర్చలు.. కోర్టు పనులపై బయట ఉండిపోవడంతో రాష్ట్రంలో టీడీపీని నడిపే నాయకుడు కనిపించకుండాపోయారు. పార్టీ పిలుపు మేరకు ధర్నాలు, రిలే నిరాహారదీక్షలు చేస్తున్నా.. అవన్నీ నియోజకవర్గాలకే పరిమితమయ్యాయి. రాష్ట్రస్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ఏ ఒక్క కార్యక్రమాన్ని టీడీపీ ఇంతవరకు చేయలేకపోయిందంటే ఆ పార్టీలో నాయకత్వ సంక్షోభం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సుదీర్ఘ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుతో సమానంగా రాజకీయాల్లో ప్రవేశించిన వారు ఎందరో ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న పాతికేళ్లు మంత్రి పదవులు.. ఇతర హోదాలు అనుభవించిన వారు ఉన్నారు. కానీ, ఏ ఒక్కరూ కార్యకర్తలకు సరైనస్థాయిలో దిశానిర్దేశం చేసే పనిచేయడం లేదు. సుదీర్ఘ కాలం మంత్రి పదవులు అనుభవించిన వారు.. రాష్ట్రస్థాయి లీడర్లుగా చెప్పుకునేవారు కూడా తమ నియోజకవర్గానికే పరిమితమవడంతో కార్యకర్తలు కోరుకున్న స్థాయిలో రాష్ట్రస్థాయి పోరాటాలు జరగడం లేదంటున్నారు.

క్యాడర్‌ను భయపెడుతున్న ప్రభుత్వ హెచ్చరికలు
ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో కోర్టు పనులు ముగించుకుని రాష్ట్రానికి వచ్చే లోకేశ్ పార్టీని చక్కదిద్దే బాధ్యతలు తీసుకుంటారని ఆశిస్తే.. ప్రభుత్వ హెచ్చరికలు క్యాడర్‌ను మరింత భయపెడుతున్నాయి. లోకేశ్ రాష్ట్రంలోకి అడుగుపెట్టిన వెంటనే అరెస్టు చేస్తామంటూ ప్రభుత్వం తరఫున వస్తున్న హెచ్చరికలు అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. లోకేశ్ కూడా అరెస్టు అయితే కార్యకర్తలు మరింత డీలా పడిపోతారని ప్రత్యర్థులు బహిరంగంగానే చెబుతున్నారు. దీనికి కారణం తెలుగుదేశం నాయకత్వమే.. చంద్రబాబు, లోకేశ్ తప్పిస్తే గుంటూరులోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పనులను సమర్థంగా చక్కబెట్టే నేత గాని.. పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేసే యంత్రాంగంగాని లేదని చెబుతున్నారు. అందుకే చంద్రబాబు అరెస్టు తర్వాత లోకేశ్ రాష్ట్రంలో ఉన్ననాళ్లు ఏ కార్యక్రమాలు చేపట్టారో.. అవే ఇప్పటికీ కొనసాగిస్తున్నారని అంటున్నారు.

Also Read: చంద్రబాబు నాయుడి అరెస్ట్ పై సీనియర్ నటుడు సుమన్ కామెంట్స్.. ఇదొక గుణపాఠం..

బాలకృష్ణ వల్ల వీలువుతుందా?
ప్రభుత్వం చెప్పినట్లు లోకేశ్‌ను అరెస్టు చేస్తే.. ముఖ్యనేతలు ఇద్దరూ అందుబాటులో లేకుండాపోతే అప్పుడు పరిస్థితి ఏంటనే ప్రశ్న కార్యకర్తలను వేధిస్తోంది. బాలకృష్ణ, అచ్చెన్నాయుడు వంటివారు పార్టీ పగ్గాలు చేపడతారా? లేక భువనేశ్వరి, బ్రాహ్మణి ప్రజల ముందుకు వస్తారా? వస్తే వారు ఏ స్థాయిలో నిలబడతారు, పార్టీలో ఉత్సాహాన్ని మనోబలాన్ని ఎంతవరకు నింపుతారు అన్నది చూడాల్సివుంది. ఈ నలుగురిలో బాలకృష్ణ శాసనసభ్యుడిగా ఉన్నా ఆయన పార్టీని ఎంతవరకు చక్కదిద్దగలరు. సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకులు చేయలేనిది, బాలకృష్ణ వల్ల వీలువుతుందా? ఆయనలో అంత ఓపిక ఉన్నదా? అనేది పార్టీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక అచ్చెన్నాయుడు కూడా సీనియర్ నేతే.. కానీ ఆయన రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపగలరా? అన్నదీ డౌటే.. మరోవైపు ఆయనపైనా కేసుల కత్తివేలాడుతున్నందున ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోననే మరో అనుమానం పీడిస్తోంది.

Also Read: జైల్లో చంద్రబాబు.. ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ఇదే సరైన సమయమా? సీఎం జగన్ నిర్ణయం ఏంటి?

హౌస్ అరెస్టు నేతలుగానే ముద్ర
ఇవన్నీ ఒక ఏత్తైతే.. భువనేశ్వరి, బ్రాహ్మణి జనం ముందుకు వస్తే.. పార్టీ కార్యక్రమాలు చేయగలరు కాని.. పార్టీపై పట్టు సాధించడం అంతతేలికైన పనేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ నేతల నుంచి భువనేశ్వరి.. బ్రాహ్మణికి తగిన సహకారం అందుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే టీడీపీలో ఉన్న లీడర్లలో ఎక్కువ మంది హౌస్ అరెస్టు నేతలుగానే ముద్రపడ్డారు. చంద్రబాబు బయట ఉన్నప్పుడే ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే.. ముందుగా గృహ నిర్బంధాన్ని ఎంచుకునేందుకే పలువురు నాయకులు ప్రాధ్యాన్యం ఇస్తున్నారనే టాక్ ఉంది. చంద్రబాబే సాక్ష్యాత్తూ బయటకువచ్చి రోడ్లపై తిష్టవేసి ఆందోళన చేసిన సమయంలోనూ చాలా మంది నాయకులు.. మీడియా మీట్లకే పరిమితమయ్యే పరిస్థితి ఉంది. దీన్ని చంద్రబాబు ఏ దశలోనూ చక్కదిద్దకపోవడంతో ఇప్పుడు ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సివస్తోంది.

Also Read: చంద్రబాబు ధైర్యవంతుడు, మీ కుట్రలు ఫలించవు, భోంచేయడానికి టేబుల్ కూడా ఇవ్వలేదు- నారా భువనేశ్వరి

మళ్లీ పాదయాత్రకు రెడీ అవుతున్న లోకేశ్
అధినేత నిర్బంధం మరికొన్నాళ్లు కొనసాగితే ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాల కొనసాగింపుపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు హెచ్చరికల మధ్య ఆందోళనలు చేస్తే అనవసర కేసుల్లో ఇరుక్కోవాల్సివస్తుందని కొందరు సీనియర్ నేతలే కార్యకర్తలను హెచ్చరిస్తున్నారే ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో భువనేశ్వరి, బ్రాహ్మణికి సీనియర్ల పూర్తిస్థాయి సహకారం సందేహస్పదమే.. మరి ఈ క్లిష్ట పరిస్థితులను టీడీపీ ఎలా ఎదుర్కోగలదు? ఒకటి రెండు రోజుల్లో లోకేశ్ ఢిల్లీ నుంచి వస్తారని అంటున్నారు. ఆయన రాగానే అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది.. ఏదైనా మళ్లీ పాదయాత్ర చేస్తానంటూ రెడీ అవుతున్నారు లోకేశ్.. అంటే వచ్చేవారం పదిరోజులు టీడీపీకి పరీక్షాకాలమే.. ఈ పరీక్షలో లోకేశ్ ఎలా ముందుకెళతారు? సీనియర్లల్లో కదలిక వస్తుందా? కార్యకర్తలు పార్టీని ఎలా కాపాడుకుంటారన్నది చూడాల్సిందే.

ఇక బాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీకి సానుభూతి ఏ మేరకు వస్తుందనేది పక్కనపెడితే.. జనంలో ఉంటూ ఎన్నికలకు సన్నద్ధమవ్వాల్సిన సమయంలో చంద్రబాబు జైలులో ఉండాల్సిరావడం ఇటు వ్యక్తిగతంగా చంద్రబాబుకు.. పార్టీపరంగా తెలుగుదేశానికి జీవన్మరణ సమస్యే.