కోటి ఇస్తేనే కాపురం, లేదంటే విడాకులే……భర్త ఇంటి ముందు భార్య ధర్నా

  • Published By: murthy ,Published On : October 15, 2020 / 02:00 PM IST
కోటి ఇస్తేనే కాపురం, లేదంటే విడాకులే……భర్త ఇంటి ముందు భార్య ధర్నా

husband harassment on wife for extra dowry : అదనపు కట్నం కోసం భార్యను కాపురానికి తీసుకెళ్ళకుండా…. విడాకులిచ్చి వదిలించుకోవాలని చూస్తున్న ప్రబుధ్దుడి వ్యవహారం అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. పెళ్ళికి ఇచ్చిన కట్నం కాక, అదనంగా మరో కోటి రూపాయలు కట్నం ఇస్తేనే కాపురం చేస్తానని…. లేదంటే విడాకుల కాగితాల మీద సంతకం పెట్టాలని బెదిరిస్తున్నాడీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. భర్త బెదిరింపులతో అత్తవారింటి ఎదుట బాధిత ఇల్లాలు ధర్నా చేపట్టింది.



కడపకు చెందిన కొల్లి వెంకటరమణ, శ్రీదేవి దంపతుల కుమార్తె గాయత్రికి ధర్మవరం పట్టణం సత్యసాయినగర్‌లో నివసించే రిటైర్డ్‌ ఎల్‌ఐసీ ఆఫీసర్‌ గుర్రం విజయ్‌కుమార్ కొడుకు దీపక్‌కుమార్‌ తో 2018 డిసెంబర్‌ 27న పెళ్లి జరిగింది. వివాహ సమయంలో రూ.20లక్షలు కట్నం, రూ.10 లక్షలు విలువ చేసే బంగారు నగలను అందజేశారు. atp dowry herrassement 2అప్పట్లో దీపక్‌కుమార్‌ బెంగళూరులోని ఇన్ఫోసిస్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవాడు. పెళ్లి అయినప్పటి నుంచి అదనపు కట్నం కోసం భార్యను వేధించేవాడు. రూ. కోటి తీసుకురాకపోతే విడాకులు ఇస్తానంటూ బెదిరించేవాడు. భర్త, అత్త, మామలతో పాటు ఆడపడుచులు లిఖిత, రచనలు కూడా అదనపు కట్నం కోసం వేధించేవారని బాధితురాలు తెలిపింది. ఈ క్రమంలో గాయత్రి గర్భం దాల్చటంతో డెలివరీ కోసం ఆమెను పుట్టింటికి పంపించారు.



గాయత్రి డెలివరీకి వెళ్లిన కొద్దిరోజులకు దీపక్ ఇన్ఫోసిస్ లో ఉద్యోగం వదిలేసి వచ్చి గంజాయి వ్యాపారం చేయటం మొదలెట్టాడు. ఈలోగా గాయత్రి ఆడపిల్లకు జన్మనిచ్చింది. భర్త ఉద్యోగం చేయటం మానేసి గంజాయి వ్యాపారం చేస్తున్నాడని తెలిసిన గాయత్రి…ఆ వ్యాపారం మానుకోమని కోరింది. గాయత్రికి విషయం తెలిసి పోవటంతో …భార్యను మరింతగా వేధించటం మొదలెట్టాడు.



పండంటి బిడ్డ పుట్టినా చూడటానికి వెళ్లలేదు. భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని గ్రహించిన గాయత్రి కడప పోలీసుల కు ఫిర్యాదు చేసింది. వారు ఇద్దరినీ పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించి పంపించివేశారు. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా భర్త ప్రవర్తనలో మార్పు రాకపోగా…తనకు విడాకులు కావాలంటూ ఇటీవల నోటీసు పంపించాడు.

అప్పటి నుంచి ఆమె భర్త, అత్తమామలకు ఫోన్ చేస్తున్నా, ఫోన్ లిఫ్టు చేయకపోగా….వారి నుంచి సరైన సమాధానం రాలేదు. చేసేదేమిలేక గాయత్రి బిడ్డను తీసుకుని ధర్మవరం వచ్చింది. ధర్మవరం వచ్చిన గాయత్రిని… అత్త మామలు ఇంట్లోకి రానివ్వకుండా తలుపులు మూసేశారు. భర్తకూడా ఆసమయంలో ఇంట్లో లేడు. దీంతో ఆమె ఇంటి ముందే పాపతో ధర్నా చేపట్టింది. సమాచారం తెలుసుకున్న ధర్మవరం అర్బన్ పోలీసులు వారిని స్టేషన్ కు పిలిపించారు. atp dowry herrassement 1భర్త గంజాయి వ్యాపారం చేస్తున్న సంగతి తనకు తెలిసిపోయిందనీ…. కోటి రూపాయల అదనపు కట్నం కోరుతూ భర్త  నిర్లక్ష్యం చేస్తున్నాడని…. తనను వదిలించుకోటానికి విడాకులు పేపర్లు పంపించాడని ఆరోపించింది. భర్త విడాకులకు దరఖాస్తు చేసిన సంగతి తెలిసి వారిద్దరూ కలిసి ఉండేందుకు మరో సారి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని డీఎస్పీ రమాకాంత్ చెప్పారు.