రైతుల కన్నీళ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: పవన్ కళ్యాణ్

  • Published By: vamsi ,Published On : December 2, 2020 / 07:53 PM IST
రైతుల కన్నీళ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: పవన్ కళ్యాణ్

నివర్ తుపాన్ కారణంగా పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు కృష్ణా జిల్లాలో పర్యటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. నీటమునిగి పాడయిపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సంధర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలు, ఈదురుగాలులు రైతులను నట్టేట ముంచాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికి అందొచ్చిన పంట చేజారిపోవడం బాధకరం అని అన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ అండగా నిలిచేందుకే వచ్చానని పవన్ తెలిపారు.



”నేను ప్రకృతి వైపరీత్యాలపై రాజకీయం చేయాలని అనుకోవట్లేదు.. ఓట్ల సమయంలో వచ్చి వెళ్లే వ్యక్తిని కాదు.. ఇప్పుడు ఎన్నికల్లేవు.. ప్రజల బాధలను క్షేత్ర స్థాయిలో తెలుసుకోవడానికే వచ్చానని అన్నారు. కష్టపడి పండించిన పంట దెబ్బ తింటే రైతు పడే కష్టం ఏంటో ప్రభుత్వం గుర్తించాలని, సొంత భూమి కలిగిన రైతులతో పాటే కౌలు రైతులకు కూడా న్యాయం చేయాలని ఆయన కోరారు. రైతుల కన్నీళ్లు దేశానికి మంచిది కాదని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కర్షకుల కష్టాలు, కన్నీళ్లను కేంద్రం దృష్టికి తీసుకెళతానని పవన్ కళ్యాణ్ రైతులకు హామీ ఇచ్చారు.



రైతులకు భరోసా ఇచ్చేందుకే వచ్చానని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు ఆర్థిక సాయం వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. అధైర్య పడొద్దని రైతులకు ధైర్యం చెప్పిన పవన్ కళ్యాణ్.. రైతులకు ఆర్థిక సాయం వచ్చేలా కృషి చేస్తానని అన్నారు.



ప్రభుత్వం తక్షణమే రైతులకు నష్టపరిహారంగా ఆత్మహత్య చేసుకున్న రైతులకు 5 లక్షలు, పంట నష్టానికి 25నుంచి 35 వేలు వరకు, కౌలు రైతులకు 10 వేలు, తక్షణ సహాయం కింద ప్రతీ రైతుకు 10 వేల రూపాయలు అందించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.