KR circle underpass tragedy: పాపం భానురేఖ.. బెంగళూరులో అడుగుపెట్టిన రోజే అకాల మరణం.. ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమా..?

కేఆర్ సర్కిల్ వద్ద ప్రమాదానికి గురైన ప్రమాదానికి గురైన భానురేఖను సెయింట్ మార్తా ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి ఆమె ప్రాణాలతో ఉందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.

KR circle underpass tragedy: పాపం భానురేఖ.. బెంగళూరులో అడుగుపెట్టిన రోజే అకాల మరణం.. ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమా..?

Bengaluru KR circle underpass tragedy : ఎన్నో ఆశలతో బెంగళూరు నగరంలో అడుగుపెట్టిన తెలుగు అమ్మాయి బత్తుల భానురేఖా రెడ్డి (23) విగతజీవిగా మారింది. ఊహించని ఉత్పాదం ఆమెను అనంతలోకాలకు తీసుకుపోయింది. ఐటీ కొలువుతో మంచి భవిష్యత్తును కాక్షించి బెంగళూరుకు వచ్చిన భానురేఖ (Bhanu Rekha)ను అకాల వర్షం బలితీసుకుంది. కన్నవారికి తీవ్ర వేదనను మిగిల్చింది. ఆదివారం కురిసిన భారీ వర్షం భానురేఖ ప్రాణాలు తీసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరులో అడుగుపెట్టిన రోజే అనూహ్యంగా ఆమె చనిపోవడం అందరినీ కలచివేసింది. కేఆర్ సర్కిల్ వద్ద అండర్ పాస్ లో వరద నీటిలో చిక్కుకుని ఆమె మృత్యువాత పడ్డారు.

స్వగ్రామంలో విషాద ఛాయలు
భానురేఖ హఠాన్మరణంతో ఆమె స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు (telaprolu village) గ్రామానికి చెందిన ఆమె.. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని ఇన్ఫోసిస్ క్యాంపస్ లో ఉద్యోగం చేస్తున్నారు. ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు నగరాన్ని చూసేందుకు క్యాబ్ లో బయలుదేరిన ఆమె ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయారు. భానురేఖ మరణంతో తేలప్రోలు గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉన్నత చదువులు చదివి బెంగళూరులో ఉద్యోగం చేస్తూ అకాల మరణం చెందడం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిన్నతనం నుంచి ఆమెతో ఉన్న పరిచయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. భానురేఖ పార్థీవదేహం కోసం గ్రామస్థులు, బంధువులు ఎదురుచూస్తున్నారు.

పోస్టుమార్టం పూర్తి
భానురేఖ మృతదేహానికి బెంగళూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం పోస్టుమార్టం పూర్తయింది. విమానంలో భానురేఖ మృతదేహాన్ని తరలించేందుకు ఇన్ఫోసిస్ కంపెనీ ప్రతినిధులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విమాన సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో ప్రత్యేక అంబులెన్స్ లో భానురేఖ మృతదేహాన్ని స్వగ్రామం తేలప్రోలుకు తరలిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రికి మృతదేహం స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. భాను రేఖ మృతదేహం డికంపోజ్ కాకుండా వైద్యులు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. మంగళవారం ఉదయం భానురేఖ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.

Siddaramaiah, Bahanu Rekha
స్పందించిన కర్ణాటక సీఎం

భానురేఖ మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య (Siddaramaiah) స్పందించారు. ఆస్పత్రిలో భానురేఖ మృతదేహానికి నివాళులు అర్పించి, ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. భానురేఖ కుటుంబానికి 5 లక్షల రూపాయల సహాయం ప్రకటించారు. ప్రమాద ఘటనపై అధికారులతో ఆయన మాట్లాడారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

Also Read: బెంగళూరు ట్రాఫిక్‭ నియంత్రణ కోసం ఏకంగా తన కాన్వాయ్ మీదే సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం సిద్ధరామయ్య

ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమా..?
కాగా, ప్రమాదానికి గురైన భానురేఖను సెయింట్ మార్తా ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి ఆమె ప్రాణాలతో ఉందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. కొనఊపిరితో ఉన్న ఆమెకు చికిత్స అందించేందుకు ఆస్పత్రి వర్గాలు నిరాకరించడంతో భానురేఖ ప్రాణాలు వదిలారని ఆరోపించారు. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు ముఖ్యమంత్రి సిద్దరామయ్య దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై దర్యాప్తు జరిపిస్తామని, ఆరోపణలు రుజువైతే చర్యలు తప్పవని సీఎం వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆస్పత్రి వర్గాలు ఈ ఆరోపణలను తోసిపుచ్చాయి. ఆస్పత్రికి తీసుకురావానికి ముందే భానురేఖ చనిపోయిందని పేర్కొన్నాయి.

Also Read: రెండు రోజులుగా క‌నిపించ‌కుండా పోయిన న‌టి.. పోలీసుల ఎంట్రీ.. ఏం జ‌రిగిందంటే..?

10 రోజుల క్రితమే సొంతూరికి..
భానురేఖ ఇటీవల ఎలక్ట్రానిక్ సిటీలోని ప్రగతినగర్‌లో కొత్త ఇంటికి వచ్చింది. 10 రోజుల క్రితం సొంతూరు వెళ్లి వచ్చిన ఆమె.. బెంగళూరు సిటీ చూపిస్తానని కుటుంబ సభ్యులను బెంగళూరు తీసుకువచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో క్యాబ్ లో నగర సందర్శన బయలుదేరారు. ఇస్కాన్ ఆలయం, కబ్బన్ పార్కు, విధానసౌధను సందర్శించి ఫొటోలు దిగారు. వర్షంలో కారులోనే హోసూరు రోడ్డుకు వెళుతుండగా విషాదం చోటుచేసుకుంది.