వ్యాక్సిన్ కోసం రూ. 35వేల కోట్లు ఖర్చు వేస్ట్: పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీ

వ్యాక్సిన్ కోసం రూ. 35వేల కోట్లు ఖర్చు వేస్ట్: పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీ

లోక్‌సభలో జరిగిన ఆరోగ్య చర్చలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సంజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. కోవిడ్ టీకా కోసం 35వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం పనికిరాని చర్య అని, ఈ టీకా ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు మాత్రమే ప్రభావవంతంగా ఉంటుందని సంజీవ్ వ్యాఖ్యానించారు.

మహమ్మారి కరోనా నుంచి అధిగమించడానికి కోవిడ్ వ్యాక్సిన్ కవరేజీని పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాలను కోరుతుండగా,  పార్లమెంటులో మాట్లాడుతూ ఎంపీ డాక్టర్ సంజీవ్ టీకాల డ్రైవ్‌లో ప్రభుత్వం రూ .35,000 కోట్లు వృథా ఖర్చు చేస్తోందని అనడం గమనార్హం.

కోవిడ్ టీకా డ్రైవ్‌లో రూ .35 వేల కోట్లు వృథా చేయవద్దని, బదులుగా ఆ డబ్బును దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనలో ఉపయోగించుకోవాలని ఎంపీ సంజీవ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి ఒక్క వ్యక్తికి టీకాలు వేయడం సాధ్యం కాదు అని, టీకా డ్రైవ్ కార్యక్రమం వల్ల “డబ్బు వృధా” అవుతుందని వృత్తిరీత్యా డాక్టరైన కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ లోక్ సభలో అన్నారు.

అయితే, ప్రభుత్వం దేశంలో కోవిడ్ -19ను ఎదుర్కోవడంలో సఫలం అయ్యిందని, అభివృద్ధి చెందిన దేశాల కంటే మరణాలు చాలా తక్కువగా మన దేశంలో నమోదు అయినట్లు సంజీవ్ చెప్పుకొచ్చారు.

మూడేళ్ల పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులు చేసిన ఆయుర్వేద వైద్యులకు 60 రకాల శస్త్రచికిత్సలను అనుమతించాలన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రమాదకరమని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన జి.రంజిత్ రెడ్డి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వైద్య కళాశాలలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

‘ఆయుష్మాన్ భారత్’ కింద కేవలం 40 శాతం మంది మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన అన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. పార్లమెంటులో కొనసాగుతున్న బడ్జెట్ సమావేశాల్లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిధుల కోసం డిమాండ్లపై చర్చ సందర్భంగా ఈ చర్చ జరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ -19 టీకా కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ రూ .35,000 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.

కోవిడ్ -19 వంటి మహమ్మారి 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, అందువల్ల అంత ప్రాముఖ్యత ఇవ్వరాదని డాక్టర్ సంజీవ్ కుమార్ చెప్పగా ఈ మాటలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. డాక్టర్ సంజీవ్ కుమార్ కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు గత ఏప్రిల్‌లో కోవిడ్ -19 బారిన పడి కోలుకున్నారు.