గురు,శుక్రవారాల్లో వర్షాలు…..శనివారం మరో అల్పపీడనం

  • Published By: murthy ,Published On : August 20, 2020 / 07:53 AM IST
గురు,శుక్రవారాల్లో వర్షాలు…..శనివారం మరో అల్పపీడనం

ఈశాన్య బంగా‌ళా‌ఖాతం, దాని పరి‌స‌ర‌ప్రాం‌తాల్లో ఏర్పడిన ఉప‌రి‌తల ఆవ‌ర్తన ప్రభా‌వంతో బుధ‌వారం ఉదయం 5.30 గంటలకు ఉత్తర బంగా‌ళా‌ఖాతం, దాని పరి‌సర ప్రాంతాల్లో అల్ప‌పీ‌డనం ఏర్ప‌డింది. ఇది ఉదయం 8.30 గంట‌లకు తీవ్ర అల్ప‌పీ‌డ‌నంగా  మారి వాయవ్య బంగా‌ళా‌ఖా‌తంలో కేంద్రీ‌కృ‌త‌మై‌నట్టు హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలిపింది.



దానికి అను‌బం‌ధంగా 7.6 కిలో‌మీ‌టర్ల ఎత్తు వరకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం కొన‌సా‌గు‌తోందని, అది పశ్చిమ దిశగా ప్రయా‌ణించి గురు‌వారం ఆగస్టు 20, సాయం‌త్రా‌నికి వాయు‌గుం‌డంగా మారే అవ‌కాశం ఉం‌దని వెల్ల‌డించింది.

వీటి ప్రభా‌వంతో గురు, శుక్ర‌వా‌రాల్లో తెలంగాణ రాష్ట్ర‌ వ్యా‌ప్తంగా పలు‌చోట్ల తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురు‌స్తా‌యని తెలిపింది. ఆగస్ట్ 21న తెలంగాణ‌లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది.



ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్- గ్రామీణ, మ‌హ‌బూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అలాగే అటు ఆంధ్రప్రదేశ్ లోనూ గురు, శుక్రవారాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, విశాఖ నుంచి ప్రకాశం జిల్లా వరకు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.



ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వలన ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా ఆగస్టు 23 తేదీన మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.