AP TDP మరోపోరు : నారా లోకేష్ మెగాటూర్?, రైతు సమస్యల పరిష్కారమే ఏజెండా

AP TDP మరోపోరు : నారా లోకేష్ మెగాటూర్?, రైతు సమస్యల పరిష్కారమే ఏజెండా

Nara Lokesh Megatour : ఏడాదిన్నర అయ్యింది ఆ పార్టీ ఓడిపోయి. కానీ ఓటమి భయం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ఆ పార్టీ యువనేత శ్రమిస్తున్నా వర్కవుట్ అవ్వడం లేదు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి పవర్ లోకి తేవాలంటే ఏదైనా పవర్ ఫుల్ ఇష్యూపై పోరాటం చేయాలని ఆ నేత ఆలోచిస్తున్నారట. రైతు అజెండాగానే ఆ కొత్త పోరాటం ఉండబోతోందా ?  వైసీపీ అధికారంలోకి వచ్చాక 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెబుతున్న టీడీపీ.. మరోపోరుకు సిద్ధపడుతోంది. జనవరిలో నారా లోకేష్‌ మెగా టూర్‌ నిర్వహించతలపెట్టారని, దీనికి సంబంధించిన గ్రౌండ్‌ వర్క్‌ జరుగుతోందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటివరకు పలుమార్లు ప్రజల్లోకి వెళ్లినా…ఈసారి చేపట్టబోయే కార్యక్రమంలో భాగంగా…సమస్య పరిష్కారమయ్యేంత వరకు ప్రజాక్షేత్రంలోనే ఉండేలా లోకేష్‌ ప్లాన్‌ చేసుకుంటున్నారట.

రైతాంగ సమస్యలు : –
ఏపీలో రైతాంగ సమస్యల పరిష్కారానికి ఇప్పటికే పలుమార్లు గళం విప్పిన టీడీపీ యువ నేత లోకేష్.. తనపై వస్తున్న విమర్శలకు చెక్‌ పెడుతూ ముందుకు దూసుకుపోతున్నారు. అనేక విమర్శలను తిప్పికొడుతూ కొన్ని నెలలుగా పలు జిల్లాల్లో పర్యటించారు. ఈ మధ్యకాలంలో రైతాంగ సమస్యలు ఎక్కడ ఉన్నా…అక్కడకు వెళ్లిపోతున్నారు. కృష్ణా, గోదావరి నదుల ఉగ్రరూపంతో వరదలొచ్చినప్పుడు, నివర్‌ తుపాను విరుచుకుపడినప్పుడు ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. మోకాలి లోతు వరద నీటిలో దిగి…పాడైపోయిన పంటపొలాలను పరిశీలించారు. సీఎం జగన్‌కు సైతం లోకేష్‌ ఓ లేఖ రాశారు. రైతాంగ సమస్యలను ఈ నెలాఖరులోగా పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

లోకేష్ వ్యూహరచన : –
రైతు సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా సర్కార్‌ను మరింత ఇరకాటంలో పెట్టేందుకు లోకేష్‌ వ్యూహరచన చేశారు. ఇందులో భాగంగానే నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోకపోతే… అన్నదాతలకు న్యాయం జరిగేలా టీడీపీ ఉద్యమం చేపడుతుందని సీఎంకు రాసిన లేఖలో ప్రస్తావించారు లోకేష్‌. ప్రభుత్వానికి ఇచ్చిన నెలాఖరు డెడ్‌లైన్‌ దగ్గర పడుతున్న తరుణంలో.. లోకేష్‌ ఎలాంటి కార్యక్రమం చేపట్టబోతున్నారని తెలుగు తమ్ముళ్లలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వరదలు, తుపాన్లతో దెబ్బతిన్న ఏడు జిల్లాల్లో లోకేష్‌ ఇప్పటికే పర్యటించారు కాబట్టి.. ఆత్మహత్యలకు పాల్పడిన అన్నదాతల కుటుంబాలను పరామర్శించే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయట.

పాదయాత్రకు లోకేష్ ?  : –
రైతాంగ సమస్యల పరిష్కారానికి ఎలాంటి ఉద్యమం చేపట్టబోయేది ఇంతవరకు లోకేష్‌ బహిరంగ ప్రకటన చేయలేదు. కానీ ఆ కార్యక్రమానికి సంబంధించిన గ్రౌండ్‌ వర్క్‌ జరుగుతుందని కొందరు నేతలు చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు వ్యవసాయరంగంపైనే ఆధారపడి ఉన్నందున ..రైతు పోరాటాల ద్వారానే ఆదరాభిమానాలు చూరగొనవచ్చని లోకేష్‌ భావిస్తున్నారట. ఈ పోరాటం ఆషామాషీగా ఉండదని, అన్ని డిమాండ్లు సాధించేవరకు ఉద్యమం నుంచి విరమించే ప్రసక్తే లేదని, ఆత్మహత్యలు చేసుకున్న రైతులను పరామర్శించడానికి తోడు… కలెక్టరేట్ల వద్ద లోకేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, అవసరమైతే నిరాహారదీక్షలు కూడా చేసే అవకాశం ఉందంటున్నారు తెలుగు తమ్ముళ్లు. చివరగా.. రైతాంగ సమస్యలపై పోరాటం పూర్తయ్యాక.. పాదయాత్రకు కూడా లోకేష్ అడుగులు వేస్తారని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు.