No Mask Rs25,000 Fine : మాస్క్ లేకుంటే రూ.25 వేలు జరిమానా, ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు

రాష్ట్రంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో నైట్ కర్ఫ్యూ నిబంధనలను మరో 15 రోజులు అంటే ఆగస్టు 14వ తేదీ వరకు పొడిగించిన ప్రభుత్వం.. మాస్క్ ధారణ విషయంలో హెచ్చరికలు జారీ చేసింది.

10TV Telugu News

No Mask Rs25,000 Fine : రాష్ట్రంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో నైట్ కర్ఫ్యూ నిబంధనలను మరో 15 రోజులు అంటే ఆగస్టు 14వ తేదీ వరకు పొడిగించిన ప్రభుత్వం.. మాస్క్ ధారణ విషయంలో హెచ్చరికలు జారీ చేసింది.

మాస్క్ లేకుండా తిరిగేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది. కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లో మాస్క్ లేకుండా అనుమతిస్తే.. రూ.10 వేల నుంచి 25 వేల వరకూ భారీ జరిమానా విధించనుంది. జరిమానా మొత్తాన్ని స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ధారించనున్నారు. అదే విధంగా 2-3 రోజుల పాటు సంబంధిత సంస్థల్ని మూసివేసేలా అధికారులు చర్యలు తీసుకుంటారు.

కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి తమకు ఆ ఫొటోలు పంపితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దీనికోసం ప్రత్యేకంగా 8010968295 వాట్సప్ నెంబర్‌ను కేటాయించామని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ భాస్కర్ వెల్లడించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు వారాల పాటు రాత్రి వేళ కర్ఫ్యూను పొడిగించినట్లు తెలిపారు.

ఆగస్టు 14 వరకూ కర్ఫ్యూ ఆంక్షలు ప్రతి రోజూ రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయన్నారు. అందరూ కోవిడ్ ప్రోటోకాల్‌ను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని కమిషనర్‌ హెచ్చరించారు. మాస్క్ లు ధరించని వారికి రూ.100 జరిమానా విధించే అధికారాన్ని ఎస్ఐ ఆపై పోలీసు అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఇప్పటివరకూ ఈ అధికారం వైద్యాధికారులకు మాత్రమే ఉండేదన్నారు.

ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 78,992 నమూనాలు పరీక్షించగా 2,058 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. నిన్నటి కంటే పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం నాడు 2,068 నమోదవగా.. ఇవాళ 10 తక్కువగా 2,058 పాజిటివ్‌ తేలాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 364 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,66,175 మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా గడిచిన ఒక్క రోజులో 2,053 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా రికవరీల సంఖ్య 19,31,618 లకు చేరింది.

కరోనా మహమ్మారి కారణంగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజులో 23మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 13వేల 377 లకు చేరింది. తాజాగా నమోదైన మరణాల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు చనిపోయారు. కృష్ణా జిల్లాలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒక్కరు, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు 2.6 శాతం ఉంది. మరణాల శాతం 0.68% గా ఉండగా.. రికవరీ రేటు 98.2% శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,180 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో దాదాపు చాలామంది హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా.. కొందరు మాత్రం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు..
అనంతపురం – 47, చిత్తూరు – 284, తూర్పు గోదావరి – 364, గుంటూరు – 182, కడప – 140, కృష్ణా – 325, కర్నూలు – 11, నెల్లూరు – 173, ప్రకాశం 242, శ్రీకాకుళం – 45, విశాఖపట్నం 89, విజయనగరం – 29, పశ్చిమ గోదావరి – 127

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ.. ప్రస్తుతం డెల్టా వేరియంట్ కలవర పెడుతోంది. ఇప్పటికే ఏపీలో రెండు డెల్టా వేరియంట్ కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయ్యింది. కరోనా డెల్టా వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలను కోరింది. అత్యవసర పనిమీద బయటకు వస్తే తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచించారు.

10TV Telugu News