ఆ లేఖ అచ్చెన్న మెడకు చుట్టుకుందా? ఏపీ ఈఎస్ఐ స్కామ్‌లో ఎంత వెనకేశారంటే..

మొన్నటిదాకా ఈఎస్‌ఐలో జరిగిన అక్రమాలు కేవలం ఆరోపణలేనని అనుకున్నారంతా.. కానీ విజిలెన్స్‌ విచారణ ఏసీబీ ఎంట్రీతో అరెస్ట్‌లు

  • Published By: naveen ,Published On : June 13, 2020 / 09:02 AM IST
ఆ లేఖ అచ్చెన్న మెడకు చుట్టుకుందా? ఏపీ ఈఎస్ఐ స్కామ్‌లో ఎంత వెనకేశారంటే..

మొన్నటిదాకా ఈఎస్‌ఐలో జరిగిన అక్రమాలు కేవలం ఆరోపణలేనని అనుకున్నారంతా.. కానీ విజిలెన్స్‌ విచారణ ఏసీబీ ఎంట్రీతో అరెస్ట్‌లు

మొన్నటిదాకా ఈఎస్‌ఐలో జరిగిన అక్రమాలు కేవలం ఆరోపణలేనని అనుకున్నారంతా.. కానీ విజిలెన్స్‌ విచారణ ఏసీబీ ఎంట్రీతో అరెస్ట్‌లు మొదలయ్యాయి. 150కోట్ల రూపాయల దారి మళ్లింపులో ఆరుగురి ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. ఇంతకీ ఎవరా అధికారులు..? ఎంత మొత్తం వెనకేశారు..?

అచ్చెన్న లేఖతో టెలి హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి పనులు:
టెలి హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి పనులు ఇవ్వండి అంటూ అప్పటి కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు ఓ లేఖ రాశారు. దీంతో నాటి ఐఎంఎస్ డైరెక్టర్ రమేశ్ కుమార్ ఆ లేఖ ఆధారంగా వారికి పనులు ఇచ్చేశారు. ఈసీజీ, టోల్ ఫ్రీ సేవల కోసం నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించారు. మార్కెట్లో దాదాపు 200 కంటే ఎక్కువ ఖర్చు కాని ఈసీజీకి 480 రూపాయలు చొప్పున ఆ సంస్థకు చెల్లించారు. ఎన్ని ఫోన్లు, ఎక్కడి నుంచి వచ్చాయన్న దాంతో సంబంధం లేకుండా కాల్ సెంటర్‌ సంస్థకు 8 కోట్లు చెల్లించారు.

ఆ లేఖ అచ్చెన్న కొంపముంచిందా?
2016 నవంబరులో మంత్రి హయాంలో అచ్చెన్నాయుడు టెలి హెల్త్ సర్వీసెస్ సంస్థ తరపున లేఖ ఇచ్చారు. ఇందులో స్పష్టంగా ఆ సంస్థతో ఎంఓయు కుదుర్చుకోండి అని రాసి ఉంది. ఇదే ఇప్పుడు అచ్చెన్నాయుడు మెడకు చుట్టుకుంది. ఈ ఒక్క లేఖతో ఈఎస్‌ఐ అధికారులు తమదైన స్టయిల్‌లో కథ నడిపించారు. లూప్‌ హోల్స్‌ని పట్టుకుని కోట్ల రూపాయల స్కామ్‌కు ఎగబడ్డారు. విజిలెన్స్‌ దర్యాప్తులో 988.77 కోట్ల విలువైన మందులతో పాటు వైద్య పరికరాల కొనుగోలులో దాదాపుగా 150 కోట్లపైనా అవినీతి అక్రమాలు జరిగినట్లు తేల్చారు ఏసీబీ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు లేకుండా నామినేషన్‌ పద్దతిలో కట్టబెట్టారని చెబుతున్నారు. విజిలెన్స్‌ దర్యాప్తులో అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడినట్టు తేలిన తరువాతే ఏసీబీ విచారణ జరిపిందన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్‌ చేశామన్నారు ఏసీబీ డైరెక్టర్ రవికుమార్.

మార్కెట్ ధర కంటే 50 నుంచి 120శాతానికి పైగా చెల్లింపులు:
అచ్చెన్నాయుడుతో పాటు రిటైర్డ్ డైరెక్టర్ ఆఫ్‌ ఐఎమ్‌ఎస్‌ చింతల కృష్ణప్ప రమేష్‌ కుమార్‌.. రిటైర్డ్‌ స్పెషల్ గ్రేడ్ సివిల్ సర్జన్ డాక్టర్ విజయ కుమార్‌.. రిటైర్డ్‌ జాయింట్ డైరెక్టర్‌ జనార్ధన్‌.. సీనియర్ అసిస్టెంట్‌ ఇవన రమేష్‌ బాబు.. సూపరింటెండెంట్‌ చక్రవర్తిలను అరెస్ట్ చేశారు. వేర్వేరు బృందాలుగా విడిపోయిన అధికారులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. మందుల కొనుగోళ్లలో అధికారులంతా నియమ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి పెద్ద మొత్తాన్ని తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. ముఖ్యంగా సర్జికల్ ఐటెమ్స్‌లలో మార్కెట్ ధర కంటే 50 నుంచి 120శాతానికి పైగా చెల్లింపులు చేసినట్టు చూపించారంటే వీళ్ల దోపిడి ఏ స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. 

ముగ్గురు డైరెక్టర్ల హయాంలోనే రూ.900కోట్ల కొనుగోళ్లు:
2014-19 మధ్య కాలంలోనే అవినీతి భారీగా పెరిగిపోయింది. అది కూడా కేవలం ముగ్గురు డైరెక్టర్ల హయాంలోనే. రవికుమార్‌, సి.కే. రమేష్, విజయ్ కుమార్ ఆధ్వర్యంలోనే 900కోట్ల రూపాయల కొనుగోళ్లు జరిగాయి. ఇక్కడే అవినీతికి తెరలేచింది. ఫోర్జరీలు, బినామీలను సృష్టించి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. డిమ్స్‌ స్టాఫ్‌లో కొందరు ఫేక్ లెటర్లు క్రియేట్ చేసి నిధులను దారి మళ్లించారు. ఇలా ఎవరికి వారే తమకు తోచినట్టు చక్రం తిప్పి తమ ఖాతాల్లోకి భారీ మొత్తాలను మళ్లించారు. ముందుగా విజిలెన్స్ విచారణ ఆ తర్వాత ఏసీబీ ఎంట్రీతో అరెస్ట్‌లు మొదలయ్యాయి. దర్యాప్తు కొనసాగుతుందని మొత్తం స్కామ్‌లో మరికొందరి పాత్రపై తెరపైకి వస్తుందంటున్నారు అధికారులు.