ప్లాన్-2 సక్సెస్ : కోనసీమకు తప్పిన ముప్పు

  • Published By: veegamteam ,Published On : February 4, 2020 / 05:57 AM IST
ప్లాన్-2 సక్సెస్ : కోనసీమకు తప్పిన ముప్పు

కోనసీమకు ముప్పు తప్పింది. ఇక కోనసీమ వాసులు భయపడాల్సిన పని లేదు. ఇళ్లకు తిరిగి రావొచ్చు. యథావిథిగా పనులు చేసుకోవచ్చు. స్టవ్ లు వెలిగించుకుని వంటలు చేసుకోవచ్చు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పూడిలో గ్యాస్ లీక్ అదుపులోకి వచ్చింది. ఓఎన్జీసీ నిపుణులు గ్యాస్ లీక్ ని అదుపులోకి తెచ్చారు. ప్లాన్ 2 ఫలించింది. గ్యాస్ బ్లో అవుట్ నిలిచింది. ప్లాన్ 2 అమలు చేసిన కాసేపటికే గ్యాస్ లీక్ ఆగింది. ఓఎన్జీసీ రెస్క్యూ టీమ్ రెండు రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించి చివరికి గ్యాస్ లీకేజీని ఆపగలిగింది.

గ్యాస్ పైప్ లైన్ లీక్ లు కామన్:
తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ పైప్‌ లైన్ లీకేజీలు సాధారణమైపోయాయి. ఈ క్రమంలో కాట్రేనికోన మండలం ఉప్పూడి దగ్గర రెండు రోజుల క్రితం ఓఎన్జీసీ గ్యాస్‌ పైప్‌ లైన్‌ లీకైన సంగతి తెలిసిందే. పంట పొలాల నడుమ ఉన్న పైప్ లైన్ పగిలి.. భారీగా గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేయించారు. లీకేజ్ గంటలు గడుస్తున్న కొద్దీ అంతకంతకూ వ్యాప్తి చెందింది.

స్టవ్ లు వెలిగించకూడదని, సెల్ ఫోన్లు కూడా వాడకూడదని సూచనలు చేశారు. ఉప్పూడి గ్రామానికి విద్యుత్ సరఫరా సైతం నిలిపివేశారు. దగ్గరలో ఉన్న సెల్ టవర్ సేవలను ఆపేశారు. చెయ్యేరు జడ్పీ పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. గ్యాస్ పైప్ లైన్ నిర్వహణ బాధ్యతలను పీహెచ్ఎఫ్ అనే సంస్థ పర్యవేక్షిస్తోంది. వర్క్ జరుగుతుండగానే పైప్ లైన్ నుంచి లీకేజీ జరిగినట్టు తెలుస్తోంది. 

నిత్యం లీకేజీలు, విస్ఫోటాలతో గుండెల్లో దడ:
ఆదివారం(ఫిబ్రవరి 05,2020) సాయంత్రం నుంచి గ్యాస్ లీక్ అయ్యింది. ఎప్పుడేం జరుగుతుందోనని గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికారు. గ్రామంలో ప్రధాన రహదారిని ఆనుకొని పదేళ్ల క్రితం Ongc డ్రిల్లింగ్ చేసి తవ్విన బావిని సీల్ చేసి వదిలేశారు. దాని నిర్వహణను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఈ తరుణంలో గ్యాస్ లీక్ అయ్యింది. చమురు, సహజ వాయువుల వెలికితీతలో చోటు చేసుకుంటున్న గ్యాస్‌ లీకేజీలు, విస్ఫోటాలు కోనసీమ వాసుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. ఏ క్షణానికి ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయంతో వణికిపోతున్నారు జిల్లా వాసులు. తమ చుట్టూ ఉన్న చమురు బావుల్లో ఏ క్షణం ఎలాంటి ఘటన సంభవిస్తుందోనన్న ఆందోళనలు నిత్యం వెంటాడుతున్నాయి.