పార్టీ మారుతారా : మూడు రాజధానులు..జై కొట్టిన గంటా

  • Published By: madhu ,Published On : December 18, 2019 / 01:21 AM IST
పార్టీ మారుతారా : మూడు రాజధానులు..జై కొట్టిన గంటా

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి వార్తల్లో నిలిచారు. కొద్ది రోజులుగా పార్టీ మారతారంటూ జరుగుతున్న ప్రచారానికి ఊతమిచ్చేలా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు సహా.. పార్టీ నేతలంతా ముక్త కంఠంతో  ఖండించిన అంశాన్ని.. గంటా స్వాగతించారు. పైగా ప్రభుత్వానికి తమ వంతు సహకారమందిస్తామని ప్రకటించడం ఇప్పుడు హాట్‌ టాపిక్ మారింది. ఏపీకి మూడు రాజధానులు ఉండాలన్న జగన్ ప్రకటన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయంశమైంది.

జగన్‌పై వైసీపీ నేతలు ప్రశంసలు కురిపిస్తుంటే.. టీడీపీ మాత్రం తీవ్ర  ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒక్క రాజధానినే కట్టలేకపోతున్నామని.. అలాంటప్పుడు మూడు రాజధానులను ఎలా కడతారని చంద్రబాబు మండిపడ్డారు. అయితే..టీడీపీకి చెందిన  ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు మాత్రం జగన్ ప్రకటనకు జైకొట్టారు. విశాఖపట్టణాన్ని పరిపాలనా నగరం మార్చే అవకాశముందన్న సీఎం వ్యాఖ్యలను ఆయన స్వాగతించారు.

విశాఖపట్నంని పరిపాలనా రాజధానిగా మార్చే అవకాశం ఉందంటూ ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు. సహజ సిద్ధమైన సముద్ర తీర నగరం విశాఖ ను పరిపాలనా రాజధాని  చేయడం మంచి నిర్ణయం. రోడ్, రైల్, ఎయిర్, వాటర్ కనెక్టివిటీ తో రాజధాని గా అందరి ఆశలు, ఆంక్షలని నెరవేర్చే నగరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాస్మో మెట్రో నగరం పరిపాలనా కేంద్రం గా కూడా మారితే విశ్వనగరంగా  ప్రసిద్ధి చెందడం ఖాయం. అందుకు విశాఖ ప్రజలు తమ సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారుని ట్విటర్‌లో గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Read More : ఏపీలో త్రీ క్యాపిటల్స్.. బీజేపీ సపోర్టు

గంటా శ్రీనివాసరావు తీరును పలువురు టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. గంటా వ్యవహారశైలి ఇప్పటికే టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. గంటా తెలుగుదేశంపార్టీతో  అంటీముంటనట్లుగా ఉంటున్నారని..త్వరలోనే వైసీపీ కండువా కప్పుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రాజధాని విషయంలో సీఎం జగన్ చేసిన ప్రకటనను ఆయన సమర్థించడం మరోసారి చర్చనీయాంశమైంది.