సినిమాల్లోకి రీఎంట్రీ : పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై ప్రభావం పడనుందా?

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాంగ్ స్టెప్ వేశారా? సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి మిస్టేక్ చేశారా? మళ్లీ మేకప్ వేసుకోవడం పవన్ రాజకీయ జీవితంపై ప్రభావం చూపనుందా?

  • Edited By: veegamteam , January 30, 2020 / 02:40 PM IST
సినిమాల్లోకి రీఎంట్రీ : పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై ప్రభావం పడనుందా?

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాంగ్ స్టెప్ వేశారా? సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి మిస్టేక్ చేశారా? మళ్లీ మేకప్ వేసుకోవడం పవన్ రాజకీయ జీవితంపై ప్రభావం చూపనుందా?

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాంగ్ స్టెప్ వేశారా? సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి మిస్టేక్ చేశారా? మళ్లీ మేకప్ వేసుకోవడం పవన్ రాజకీయ జీవితంపై ప్రభావం చూపనుందా? పవన్ పొలిటికల్ లైఫ్ ఖతం అయినట్టేనా? సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనకు రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడీ ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. పవన్ మాట తప్పారని, మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారని అందుకే జనసేనకు రాజీనామా చేశానని లక్ష్మీనారాయణ చెబుతున్నారు. దీంతో పవన్ సినిమా రీఎంట్రీ ఇప్పుడు చర్చకు దారితీసింది.

ఈ జీవితం ప్రజాసేవకే అంకితం అన్నారు:
ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్.. ఈ జీవితం ప్రజా సేవకే అంకింతం అని పదే పదే చెప్పారు. ఇక సినిమాలు చేయనని స్టేట్ మెంట్లు ఇచ్చారు. సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పినట్టే అని ప్రకటించారు. కానీ.. సడెన్ గా పవన్ తన నిర్ణయం మార్చుకున్నారు. మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు ఓకే చెప్పారు. పింక్ రీమేక్ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా క్రిష్ డైరెక్షన్ లో మరో మూవీలోని నటించనున్నారు. ఇప్పటికే డేట్లు కూడా ఇచ్చేశారు. ఈ రెండు సినిమాలకు భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

పింక్ రీమేక్ లో పవన్:
శ్రీరామ్ వేణు దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ సినిమా రీమేక్ ‘లాయర్ సాబ్’ సినిమాలో పవన్ చేస్తున్నారు. పింక్ రీమేక్ కోసం కేవలం 25 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చారు పవన్. తెలుగులో పవన్ ఇమేజ్‌కు తగ్గట్టు కమర్షియల్‌గా కొన్ని మార్పులు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టెస్ట్ షూట్ నడుస్తోంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను సమ్మర్‌ లో లేదా ఆగస్టులో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారట.

క్రిష్ డైరెక్షన్ లో మూవీ:
ఇదిలా ఉంటే పింక్ రీమేక్‌ ‘లాయర్ సాబ్’తో పాటు క్రిష్ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీకి పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో నిర్వహించారు. హీరోగా పవన్ కళ్యాణ్‌కు ఇది 27వ సినిమా. ఫిబ్రవరి 4 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నిర్వహించనున్నారు. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలను షూట్ చేస్తారట. ఇక పింక్ రీమేక్‌లో పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత క్రిష్ దర్శకత్వంలో పూర్తి స్థాయిలో నటించనున్నారు.

పవన్ తప్పు చేశారా?
పవన్ సినిమాల్లోకి రీఎంట్రీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ తప్పు చేశారని కొందరు అంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక మళ్లీ సినిమాల్లో యాక్ట్ చేయడం ఏంటని మండిపడుతున్నారు. కాగా అభిమానులు మాత్రం ఖుషీగా ఉన్నారు. తెరపై పవన్ ను చూసేందుకు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.

పవన్ పొలిటికల్ లైఫ్ ఖతమైనట్టేనా..?
సినిమాల్లోకి పవన్ రీఎంట్రీ.. పవన్ పొలిటికల్ లైఫ్ పై తీవ్ర ప్రభావం చూపనుందనే విశ్లేషణ వినిపిస్తోంది. పవన్ రాజకీయ జీవితం డేంజర్ లో పడిందని అంటున్నారు. ఈ నిర్ణయంతో పవర్ రాజకీయ జీవితం ఖతమైనట్టే అని కొందరు అంటున్నారు. ప్రజాసేవకు ఈ జీవితం అంకితం అన్న వ్యక్తి ఇంతలోనే మాటమార్చడం కరెక్ట్ కాదంటున్నారు. పవన్ నిలకడ లేని వ్యక్తి అనడానికి ఇది నిదర్శనం అంటున్నారు. పవన్ కు ఓ విధానం అంటూ లేదని, ఇలాంటి వ్యక్తి ఇక రాజకీయాల్లో ఏం రాణిస్తాడని ప్రశ్నిస్తున్నారు. సినిమాలు చేసుకునే వ్యక్తికి రాజకీయాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

పవన్ మాట తప్పారా?
పవన్ మాట తప్పారు.. సినిమాల్లో నటించను.. పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిస్తానని చెప్పిన పవన్.. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకోవడం వల్లే తాను జనసేనకు రాజీనామా చేశానని లక్ష్మీనారాయణ అనడం హాట్ టాపిక్ గా మారింది. పవన్ నిలకడ లేని వ్యక్తి అని లక్ష్మీనారాయణ డిసైడ్ చేసేశారు. లక్ష్మీనారాయణ వ్యాఖ్యల నేపథ్యంలో.. పవన్ సినిమా రీఎంట్రీ చర్చకు దారితీసింది. పవన్ తీసుకున్న నిర్ణయం ఆయన రాజకీయ జీవితంపై ప్రభావం చూపనుందా? అనే డిస్కషన్ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.

Also Read : అసలు కారణం అదేనా : జనసేనకు CBI మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా