ఏపీలో ఇసుక దుమారం.. టీడీపీ, జనసేన విమర్శలు

Ap
ఇసుక రీచ్‌ల్లో తవ్వకాల బాధ్యతలను ఏపీ ప్రభుత్వం జేపీ ప్రైవేట్ వెంచర్స్ లిమిటెడ్‌కు అప్పజెప్పడంపై తెలుగుదేశం, జనసేన పార్టీలు ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ విషయంలో విమర్శలు గుప్పించారు. నాలుగైదేళ్లుగా జేపీ పవర్ వెంచర్స్ నష్టాల్లో ఉందని.. అలాంటి సంస్థకు ఇసుక రీచ్‌లను ఎలా అప్పజెబుతారని ప్రశ్నించారు.
ఏటా 3వేల500 కోట్ల నష్టాలను చవి చూస్తూ.. రేపో, మాపో దివాలా తీయబోయే జేపీ పవర్ వెంచర్స్‌కు ఇసుక రీచ్‌లను కట్టబెట్టడం దారుణమని అన్నారు టీడీపీ నాయకులు పట్టాభిరామ్. జేపీ పవర్ వెంచర్స్ సంస్థకు సిమెంటు, థర్మల్ విద్యుత్తు యూనిట్ల నిర్వహణలో కాస్తో కూస్తో అనుభవం ఉందని, అయితే ఇసుక రేవులు నిర్వహించిన అనుభవం లేదని అన్నారు. అలాంటి సంస్థకు ఇసుక రీచ్‌లను అప్పగించడానికి క్విడ్‌ప్రోకోనే ప్రధాన కారణమని ఆరోపించారు.
మరోవైపు జనసేన కూడా ప్రభుత్వ నిర్ణయంపై మండిపడింది. ఇసుక సరఫరాను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సరికాదని, ఇసుకను ప్రభుత్వ యంత్రాంగమే నిర్వహించలేకపోయిందని.. ఇక ప్రైవేటువాళ్లు ఎలా సరఫరా చేస్తారని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. జేపీ సంస్థను ఎలా ఎంపిక చేశారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా భవన నిర్మాణ కార్మికులు మరోసారి రోడ్డున పడే అవకాశాలున్నాయని నాదెండ్ల ఆందోళన వ్యక్తంచేశారు. సామాన్యుడికి ఎలా భరోసా కల్పిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.