విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌పై సోషల్‌మీడియాలో పోస్టు…సీఐడీ ఎదుట హాజరైన రంగనాయకమ్మ

  • Published By: srihari ,Published On : May 21, 2020 / 10:20 AM IST
విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌పై సోషల్‌మీడియాలో పోస్టు…సీఐడీ ఎదుట హాజరైన రంగనాయకమ్మ

విశాఖ ఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై సోషల్ మీడియాలో ప్రశ్నించిన వృద్ధురాలు రంగనాయకమ్మకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. సీఐడీ ముందు రంగనాయకమ్మ హాజరయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన రంగనాయకమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఇటీవల జరిగిన విశాఖపట్నం ఎల్ జీ పాలిమర్స్ ఘటనపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టును ఆమె ఫార్వర్డ్ చేశారు.

‘ఎల్ జీ పాలిమర్స్ ను ఎందుకు సీజ్ చేయలేదు, ప్రమాదంపై అనేక సందేహాలు ఉన్నాయి, హడావిడిగా స్టైరిన్ గ్యాస్ ను ఎందుకు తరలించారు’..ఇటువంటి అంశాలతో ఫేస్ బుక్ లో వచ్చిన మెసేజ్ ను ఆమె ఫార్వర్డ్ చేశారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టింగులు పెట్టారని రంగనాయకమ్మపై కేసు నమోదు చేశారు. 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ సీఐడీ అధికారులు రంగనాయకమ్మకు నోటీసులు పంపించారు. ఈరోజు విచారణకు హాజరు కావాలని సీఐడీ కోరగా ఆమె గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. తాను సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్టులు పెట్టలేదని, ఏం జరిగిందో తెలుసుకునేందుకే 
గ్యాస్ లీకేజీ ఘటనను షేర్ చేశానని చెప్పారు.