అరకు ప్రమాద ఘటనపై ప్రధాని, గవర్నర్, సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి

అరకు ప్రమాద ఘటనపై ప్రధాని, గవర్నర్, సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి

Araku valley bus accident : విశాఖపట్నం డముకు ఘాట్‌ రోడ్డులో రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బస్సు అరకు లోయలో పడిపోవడంతో నలుగురు పర్యాటకులు మృతి చెందగా.. 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలిసి ఎంతో బాధపడ్డానని ట్విటర్‌ ద్వారా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని తెలంగాణ గవర్నర్‌ తమిళి సై కోరారు. ప్రమాదం గురించి తెలియగానే సీఎం కేసీఆర్.. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో మాట్లాడారు. బస్సు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో సీఎస్ సోమేశ్ కుమార్ ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌లతో మాట్లాడి మెరుగైన సేవలు అందించాలని కోరారు. హైదరాబాద్‌లోని ప్రయాణికుల ఇళ్లకు అధికారులను పంపాలని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ను సీఎస్‌ ఆదేశించారు.

హైదరాబాద్‌లోని షేక్‌ పేటకు చెందిన సత్యనారాయణ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మొత్తం 25 మంది ఈ నెల 10వ తేదీన దినేష్‌ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులో బయలుదేరారు. విజయవాడలోని పర్యాటక ప్రాంతాల్ని సందర్శించి.. విశాఖ చేరుకున్నారు. నిన్న ఉదయం అరకు అందాల్ని ఆస్వాదించారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి సింహాచలం బయలుదేరారు. అప్పటివరకు సరదాగా సాగిన ఆ విహార యాత్రలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. రాత్రి 7 గంటల సమయంలో అనంతగిరి మండలం డముకు-టైడాకు మధ్యలో 5వ మలుపు వద్ద బస్సు అదుపు తప్పి.. ఒక్కసారిగా 80 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లిపోయింది. చిమ్మచీకటి కావడంతో.. ఏం జరుగుతుందో ఊహించేలోగా విషాదం అలుముకుంది.

లోయలోంచి హాహాకారాలు వినిపించడంతో.. వెనుక వస్తున్న పోలీసులకు ప్రయాణికులు సమాచారం అందించారు. వెంటనే బొర్రా గుహల్లో పని చేస్తున్న సిబ్బంది అక్కడి చేరుకుకొని పోలీసులు, ప్రయాణికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. పూర్తిగా చీకటిగా ఉండటంతో బస్సులోంచి క్షతగాత్రుల్ని వెలికితీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అప్పటికే.. నలుగురు మృతి చెందినట్టు పోలీసులు ధ్రువీకరించారు. గాయపడిన వారందరినీ హుటాహుటిన ఎస్‌.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు అధికారులు. ప్రమాదం గురించి తెలియగానే మంత్రి అవంతి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వెంటనే విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

డ్రైవర్‌ తప్పిందం వల్లనే యాక్సిడెంట్‌ జరిగిందని ప్రమాద బాధిత మహిళ చెబుతోంది. దినేశ్‌ ట్రావెల్స్‌ మంచి డ్రైవర్‌ను పంపలేదని.. ఆ డ్రైవర్‌కు సరిగా డ్రైవింగ్‌ రాదని చెబుతోందామె. హైదరాబాద్‌ నుంచి వెళ్తుంటేనే తమను తిప్పలు పెట్టాడని వాపోయింది. డ్రైవర్‌కు ఘాట్‌ రోడ్డు డ్రైవింగ్‌ రాదని చెప్పాడని.. అరకులో స్టే చేద్దామని చెప్పినా వినలేదని చెప్పింది. బస్సులో మొత్తం 26 మంది ఉన్నామని తెలిపారు. తమది హైదరాబాద్ మణికొండ అని చెబుతోంది. ముందు విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నాం..అక్కడి నుంచి అరకు వెళ్లామని తెలిపింది. డ్రైవర్‌కు ఘాట్‌ రోడ్డు డ్రైవింగ్‌ రాదు..అరకులో స్టే చేద్దామని చెప్పినా డ్రైవర్‌ వినలేదని చెప్పింది. బ్రేక్‌ ఫెయిల్‌ అయిందని చెప్పినా ఆపలేదు.. అందరం అరుస్తున్నాం.. బస్సు లోయలోకి వెళ్లిపోయిందని పేర్కొంది.

అరకు ప్రమాదం దురదృష్టకరమని ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. విషయం తెలియగానే రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టామని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 23 మంది పెద్దలు, కొంత మంది పిల్లలు ఉన్నట్లు డ్రైవర్ శ్రీశైలం చెప్పాడు. అతను కూడా ప్రమాదంలో గాయపడ్డాడు. బాధితులు ప్రమాదానికి గురికావడంతో… షేక్‌పేటలో నర్సింహారావు ఉండే కాలనీలో విషాదం చోటుచేసుకుంది. బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ పరామర్శించారు. అరకు బస్సు ప్రమాద ఘటనపై జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు.