Hospitals: హద్దు దాటితే జరిమానా.. ప్రైవేట్‌ ఆస్పత్రులపై ప్రభుత్వం కొరడా

Hospitals: హద్దు దాటితే జరిమానా.. ప్రైవేట్‌ ఆస్పత్రులపై ప్రభుత్వం కొరడా

Hospitals

Private Hospitals: తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్‌ రోగుల నుంచి అందినకాడికీ దోచుకుంటున్నాయి హాస్పిటళ్లు. ఒక్కో పేషెంట్‌కు లక్షల్లో బిల్లులు వేస్తూ దోచేస్తున్నాయి. దీంతో ప్రైవేట్‌ ఆస్పత్రుల కాసుల కక్కుర్తిపై తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రభుత్వాలు సీరియస్‌ అయ్యాయి. కోవిడ్‌ రోగుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న పలు ఆస్పత్రులపై కొరడా ఝుళిపిస్తోంది ఏపీ ప్రభుత్వం. కృష్ణా జిల్లాలో 52 ఆస్పత్రులకు భారీగా జరిమానా విధించింది. వీటి నుంచి ఏకంగా 3 కోట్ల 61 లక్షలు వసూలు చేసింది.

మరికొన్ని ఆస్పత్రుల్లో టాస్క్‌ఫోర్స్‌, విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. జి.కొండూరులో అనుమతులు లేకుండా కోవిడ్‌ ఆస్పత్రులనూ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అటు విశాఖ జిల్లాలోనూ వైద్య అధికారులు ప్రైవేట్‌ ఆస్పత్రులకు భారీగా ఫైన్‌ విధిస్తున్నారు. జిల్లాలోని 25 ఆస్పత్రులకు 52 లక్షలు జరిమానా విధించారు. కోవిడ్‌ నిబంధనలు పాటించకుండా.. ఆదేశాలను అమలు చేయకుండా ఉన్నందుకు జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించారు.

తెలంగాణలోనూ 64కి పైగా ఆసుపత్రులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది వైద్యారోగ్యశాఖ. 64 ప్రైవేటు ఆస్పత్రుల‌పై 88 ఫిర్యాదులు రాగా.. ఫిర్యాదులు ప‌రిశీలించి ఆయా ఆస్పత్రుల‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు ప‌బ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ఆయా ఆస్పత్రులు 24 గంట‌ల నుంచి 48 గంట‌ల్లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని డీహెచ్ సూచించారు. కొవిడ్-19 చికిత్స అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వం నిర్ధేశించిన నిబంధనలకు అనుగుణంగా చార్జీలు వసూలు చేయాలని ఆదేశించారు.

నిబంధనలు అతిక్రమిస్తే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని, కొవిడ్-19 చికిత్స అనుమతులు రద్దు చేయడంతో పాటు సాధారణ అనుమతులు సైతం నిలిపివేస్తామని హెచ్చరించారు. ప్రజలు ఫిర్యాదులను 9154170960 నంబరుకు వాట్సాప్‌ చేయాలని శ్రీనివాసరావు కోరారు.