టీటీడీ కీలక నిర్ణయం… ఇకపై ఏడాదికి ఒక్కసారే..

తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఒక్క రోజే అక్షరాల రూ.5కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.

టీటీడీ కీలక నిర్ణయం… ఇకపై ఏడాదికి ఒక్కసారే..

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఉత్సవమూర్తుల పరిరక్షణకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అభిషేకాలను తగ్గించాలని నిర్ణయించింది. ప్రతి సోమవారం నిర్వహించే విశేష పూజతో పాటు బుధవారం చేసే సహస్ర కలశాభిషేకం, నిత్యం నిర్వహించే ఆర్జిత వసంతోత్సవ సేవలను ఏడాదికి ఒక్కసారే నిర్వహించనున్నారు. తద్వారా మలయప్ప స్వామితో పాటు శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాల అరుగుదలను నిరోధించవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల జరిగిన ధర్మకర్తల మండలిలో తీర్మానించారు. తిరుమలలోని శ్రీవారి ఉత్సవమూర్తులకు వివిధ సందర్భాల్లో ఏడాదిలో 450 సార్లు అభిషేకం (తిరుమంజనం) నిర్వహిస్తుంటారు. ఇలా చేయడం వల్ల విగ్రహాలు అరిగిపోతున్నట్లు అర్చకులు గుర్తించారు. విగ్రహాల ముఖాలు మారిపోయి సరిగ్గా కనిపించని పరిస్థితి నెలకొందని అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఒక్క రోజే అక్షరాల రూ.5కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. కొవిడ్-19 ఆంక్షలతో పరిమిత సంఖ్యలో భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నా నిన్న(మార్చి 18,2021) స్వామి వారి హుండీ ఆదాయం రూ.5 కోట్ల 21 లక్షలు వచ్చింది. బుధవారం(మార్చి 17,2021) భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించగా రూ.2.71 కోట్ల ఆదాయం లభించింది. కొన్ని రోజులుగా భక్తులు శ్రీవారికి సమర్పించిన హుండీ కానుకలు, చిల్లర నాణేలు రూ.2.50 కోట్లతో కలిపి రూ.5.21 కోట్లగా లెక్క తేలింది. గతంలో 2012 ఏప్రిల్ 1న స్వామివారికి అత్యధికంగా రూ.5.73 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది. మళ్లీ ఆ స్థాయిలో స్వామివారికి లభించిన అత్యధిక హుండీ ఆదాయం ఇదే కావడం గమనార్హం.

గురువారం శ్రీవారిని 50వేల 087మంది భక్తులు దర్శించుకున్నారు. 25వేల 466మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు కానుకలతో పాటు నిల్వ ఉన్న నాణేలను గురువారం లెక్కించగా రూ.5.21 కోట్ల ఆదాయం లభించింది. మళ్లీ చాలా రోజుల తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం పెరిగింది.

కరోనా ప్రభావంతో శ్రీవారి హుండీ ఆదాయం బాగా తగ్గిపోయింది. కరోనా కట్టడి కావడంతో పాటు పరిస్థితుల్లో మార్పు రావడంతో తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది. హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది. టీటీడీ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. క్రమంగా భక్తుల సంఖ్యను పెంచుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనంతో పాటూ సర్వ దర్శనం టోకెన్లు కూడా జారీ చేస్తుండటంతో.. భక్తుల సంఖ్య పెరిగింది.