కేంద్ర మద్దతుపై ఆలోచించండి..జగన్ సాబ్ – ఓవైసీ

  • Edited By: madhu , December 22, 2019 / 07:44 AM IST
కేంద్ర మద్దతుపై ఆలోచించండి..జగన్ సాబ్ – ఓవైసీ

స్నేహితుడైన సీఎం జగన్ ‌సాబ్‌ను ఒకటి కోరుతున్నా..కేంద్రానికి మద్దతు ఇచ్చే విషయంలో పునరాలోచించండి..దేశాన్ని కాపాడాలి అంటూ AIMIM అధినేత, ఎంపీ ఓవైసీ సూచించారు. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా దారుస్సాలం  బహిరంగసభలో ఓవైసీ మాట్లాడారు. మనం భారతీయులం..మనమంతా భారతదేశ పౌరులమని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.

 

వైసీపీకి 22 మంది ఎంపీలు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు : –
ఓవైసీ చేసిన ఈ కామెంట్స్ తెలుగు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. తెలంగాణను సెక్యులర్ రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కీలకమైన సమయాల్లో వైసీపీ నైతిక మద్దతు ఇస్తోంది. లోక్ సభలో 22 మంది ఎంపీలతో వైసీపీ మూడో అతిపెద్ద పార్టీగా ఉంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తర్వాతే వైసీపీ స్థానం. ఇద్దరు రాజ్యసభ సభ్యులున్నారు.

 

సవరణ బిల్లుకు YCP మద్దతు : –
కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు వైసీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. ఇటీవలే ఆర్టికల్ 370 రద్దుకు వైసీపీ మద్దతు తెలిపింది. రాజ్యసభలో వైసీపీ బలం మరింత పెరుగుతుందనే టాక్స్ వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇంకా కీలకమైన బిల్లులు ఆమోద ముద్ర వేయించుకోవాలని బీజేపీ భావిస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలో వైసీపీ సపోర్టు ఉండాలని..ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు టాక్. 

 

వైసీపీకి MIM మద్దతు : –
ఇక MIM విషయానికి వస్తే…ఇటీవలే ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీ వైసీపీకి మద్దతు తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు మిత్రపక్షంగా ఎంఐఎం మెలుగుతోంది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో సీఎంగా జగన్ కావడం ఖాయమని ముందే ఓవైసీ చెప్పిన సంగతి తెలిసిందే. తాము గతంలో దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డితో గెలిచామని..ప్రస్తుతం వైఎస్ జగన్‌తో కూడా కలిసి నడుస్తామని వెల్లడించారు.

బీజేపీ నుంచి బయటకొస్తున్న మిత్రపక్షాలు : –
ప్రస్తుతం దేశంలో పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీని సెగ పౌర జాబితా (NRC)కి తాకింది. బీజేపీ మిత్రపక్షాలన్నీ ఒక్కొక్కటిగా దూరం జరుగుతున్నాయి. ఎన్ఆర్‌సీకి సహకరించేది లేదని జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు.

కీలక మిత్రపక్షమైన బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ కూడా ఇదే వైఖరితో ఉన్నారు. మరో భాగస్వామ్యపక్షం అకాలీదళ్ కూడా విముఖత చెప్పింది. రాం విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని LJP కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అసోం గణపరిషత్ కూడా నిరసన వ్యక్తం చేసింది. ఇటీవలే బీజేపీ నుంచి శివసేన బయటకు వచ్చింది. ప్రస్తుతం ఓవైసీ చేసిన కామెంట్స్‌పై సీఎం జగన్ ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ నెలకొంది. 
Read More : ప్రతి ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి.. అది మోడీ, షాలు చూడాలి : అసదుద్దీన్