ఏపీలో ఢిల్లీ కరోనా కనెక్షన్ : ఆ ఆరుగురు ఎవరెవరిని కలిశారు?

  • Published By: sreehari ,Published On : March 31, 2020 / 10:35 AM IST
ఏపీలో ఢిల్లీ కరోనా కనెక్షన్ : ఆ ఆరుగురు ఎవరెవరిని కలిశారు?

ఏపీని ఢిల్లీ కనెక్షన్ కలవరపెడుతోంది. ఏపీలో బయటపడిన ఆరు కరోనా పాజిటివ్ కేసులకు ఢిల్లీతో సంబంధముంది. ఇప్పుడు ఆ ఆరుగురు ఎవరెవరిని కలిశారు..? వారి నుంచి ఇంకెవరెవరికి వైరస్ పాకింది…? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అధికారులను భయపెడుతున్నాయి. ఢిల్లీలో మతపరమైన ప్రార్థనలకు హాజరైన వారిపై ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఏపీ నుంచి 9వందల మందికి పైగా ఢిల్లీ మతపరమైన ప్రార్ధనల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. 

ఢిల్లీకి వెళ్లి వచ్చిన ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన వ్యక్తికి, ఆయన భార్యకూ కరోనా సోకినట్లు ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. వీరికి వైద్యం చేసిన చీరాలకు చెందిన ఐదుగురు డాక్టర్లను హోం-క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు కోరారు. ప్రకాశం జిల్లా నుంచి ఢిల్లీ సదస్సుకు వెళ్లిన 280మందిలో 74 మందిని అధికారులు గుర్తించారు. వీరందరినీ క్వారంటైన్‌కు తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 16 మంది, నెల్లూరు నుంచి 68 మంది, కృష్ణా జిల్లా నుంచి 43 మంది ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన విజయవాడకు చెందిన యువకుడి తల్లిదండ్రులు వివిధ అనారోగ్య కారణాలతో ఒక రోజు వ్యవధిలోనే మరణించడం కూడా కలకలం రేపుతోంది.

కర్నూలు జిల్లా నుంచి 189 మంది ఢిల్లీ సదస్సుకు వెళ్లి వచ్చారు. వీరిలో 123 మందిని వేర్వేరు చోట్ల ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాలకు తరలించారు. కడప జిల్లా నుంచి 59 మంది ఢిల్లీ సదస్సుకు హాజరయ్యారు. వీరిలో 47 మందిని ఐసొలేషన్‌ వార్డులకు తరలించారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 27 మంది ఢిల్లీ వెళ్లినట్టు తెలిసింది. దీంతో రాజమండ్రికి చెందిన 17మందిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరికి కరోనా నిర్థారణ అయ్యింది. వీరిలో ఒకరు వృద్ధుడు. మరో వ్యక్తి సామర్లకోట, పిఠాపురంలో కూడా తిరిగినట్లు తెలుస్తోంది. తాజాగా మరో వృద్ధుడు కూడా చనిపోవడం కలకలం రేపుతోంది. ఢిల్లీలో మతపరమైన సమావేశానికి వెళ్లి వచ్చిన ఇతను అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. ఒక్కసారిగా శ్వాసపరమైన ఇబ్బందులు తలెత్తడంతో వైద్యులు చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. అయితే వైద్యులు మాత్రం గుండెపోటని చెబుతున్నారు. 

అదేవిధంగా విశాఖ నుంచి 42 మంది ఢిల్లీకి వెళ్లినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వీరిలో 15మందిని క్వారంటైన్‌కు తరలించారు. మిగిలిన 27మంది ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు. నిజాముద్దీన్‌ లింక్ ఎక్స్‌ప్రెస్‌లో వీరంతా ఢిల్లీ వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. అయితే ఢిల్లీకి వెళ్లివచ్చిన వారెవరికీ ఇంకా కరోనా నిర్థారణ కాకపోవడం కాస్త ఊరట కలిగిస్తోంది. అయితే మిగిలిన ప్రాంతాలలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. 

కరోనా పేషెంట్లతోపాటు వారి కుటుంబ సభ్యులను గుర్తించి క్వారంటైన్‌కు పంపించే ప్రక్రియ ఏపీ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఎక్కడికక్కడ వాలంటీర్లు ఈ సమాచారాన్ని సేకరిస్తున్నారు. కరోనా వచ్చిన వారితో రైలులో ప్రయాణించిన వారి గురించి కూడా ఆరా తీస్తున్నారు. అనుమానితులను క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఎంతమంది ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్లారన్నదానిపై అధికారులకు కూడా పూర్తి సమాచారం లేదు.