అదే నా తప్పయితే క్షమించండి: చంద్రబాబు

అదే నా తప్పయితే క్షమించండి: చంద్రబాబు

సంక్రాంతి అంటే రైతులపండుగని, నేడు రాష్ట్రంలో రైతుల పరిస్థితి మాత్రం కళావిహీనం అయ్యిందని, అందుకే.. రైతు వ్యతిరేక జీవోలను భోగిమంటలలో వేసి తగులబెట్టినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వంలో ఏడు సార్లు వరదలు వస్తే ఒక్కసారి కూడా రైతులకు నష్ట పరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛను రూ. 3వేలు చేస్తానని మాట ఇచ్చి తప్పాడంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని, కృష్ణాజిల్లా పరిటాలలో నిర్వహించిన భోగి వేడుకల్లో పాల్గొన్న ఆయన చెప్పుకొచ్చారు. రైతులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 5 జీవోలను భోగిమంటల్లో వేసిన తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ.. పాదయాత్రలో ప్రజలకు ముద్దులు పెట్టిన జగన్‌ ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడని అన్నారు. ప్రజావేదికను కూల్చి శాడిస్టుగా మారిపోయారని మండిపడ్డారు. అసత్యాలతో రైతులను దగా చేయడమే కాక.. రైతుల కోసం పోరాడుతుంటే మైనింగ్‌ మాఫియా, బెట్టింగ్‌, బూతు మంత్రులు చేత తిట్టిస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలో ప్రతిఒక్కరిపై ఇప్పటికే రూ.70వేల అప్పు పెట్టారని, కుటుంబంలో నలుగురు ఉంటే ఆ కుటుంబంపై రూ.2.80లక్షల భారం పడిందని అన్నారు. ఈ భారం జీవితాంతం మోస్తూ ఊడిగం చేసే పరిస్థితికి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ నాటకాలు నమ్మి పూనకం వచ్చినట్టు ఓట్లేశారని, తానేం తప్పు చేశానో తెలియలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ప్రజలంతా అభివృద్ధి చెందాలని కృషి చేయడం తప్పయితే క్షమించాలని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రెండు కళ్లయిన అమరావతి, పోలవరాన్ని పొడిచేశారని మండిపడ్డారు. రూ.1.30లక్షల కోట్ల అప్పు, రూ.70వేల కోట్ల పన్నులు మోపారని చంద్రబాబు ధ్వజమెత్తారు. సీఎం జగన్‌ పేదల రక్తం తాగుతున్నారని అన్నారు. పెంపుడు జంతువులపైనా పన్నులు విధిస్తున్నారని, రేపో మాపో గాలిపైనా పన్ను వేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.