విశాఖ ఎంపీ స్థానంలో ఉపఎన్నికకు సిద్ధమేనా, మంత్రి ధర్మానకు అయ్యన్న సవాల్

  • Published By: naveen ,Published On : October 3, 2020 / 03:46 PM IST
విశాఖ ఎంపీ స్థానంలో ఉపఎన్నికకు సిద్ధమేనా, మంత్రి ధర్మానకు అయ్యన్న సవాల్

tdp leader ayyanna patrudu challenges minister dharmana krishna das: ఏపీలో మూడు రాజధానుల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఇప్పుడు సవాళ్ల పర్వం మొదలైంది. వైసీపీ, టీడీపీ నేతలు చాలెంజ్‌లు విసురుకుంటున్నారు. ఉప ఎన్నికలకు వెళ్దామంటున్నారు.

మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా విశాఖను కార్యనిర్వాహక రాజధాని(ఎగ్జిక్యూటివ్ కేపిటల్)గా వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ నేతలు అంతే ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. కాగా, మూడు రాజధానుల అజెండాతో ఉత్తరాంధ్రలో తనపై పోటీ చేసి గెలవాలని డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్‌ విసిరారు.

దీనిపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తీవ్రంగా స్పందించారు. ఎక్కడో ఎందుకు విశాఖ పార్లమెంటు స్ధానంలోనే ఉప ఎన్నికకు సిద్ధం కావాలని వైసీపీకి ప్రతి సవాల్‌ విసిరారు. రాజధాని అంశంపై విశాఖ ఎంపీ సీటులో ఉప ఎన్నిక పెట్టి తేల్చుకుందామని, ఇందుకు మంత్రి ధర్మాన సిద్ధమా అని అయ్యన్న ప్రశ్నించారు. దీంతో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.

గతంలో అమరావతి రాజధానా, విశాఖ రాజధానా అనే అంశంపై అసెంబ్లీని రద్దు చేయాలని చంద్రబాబు కోరితే జగన్ పారిపోయారని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఇప్పుడు విశాఖ లోక్‌సభ స్ధానంలో ఉప ఎన్నికకు వెళ్తే ప్రజల ఉద్దేశమేంటో తెలిసిపోతుందని అన్నారు. విశాఖ ప్రజలు రాజధాని కోరుకోవడం లేదన్నారు. ఇప్పటికే రౌడీయిజం, భూకబ్జాలు, దౌర్జన్యాలు, దందాలతో అక్కడి ప్రజలు బెంబేలెత్తిపోయారని ఆరోపించారు. పత్రికలు రాసేందుకు కూడా సిగ్గుపడేలా మంత్రి ధర్మాన చంద్రబాబుపై అసహ్యంగా మాట్లాడారని, వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలకు బూతులు తిట్టడమే పనా అని అయ్యన్న ప్రశ్నించారు.

ఉత్తరాంధ్ర నుంచి నాపై పోటీకి సిద్ధమా..?’ ధర్మాన కృష్ణదాస్‌ సవాల్‌
రాజధాని రైతులను మోసం చేసింది మాజీ సీఎం చంద్రబాబే అని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని దేశవానిపేట గ్రామ సచివాలయ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొంతమంది పెయిడ్‌ ఆర్టిస్టులతో ఉద్యమాలు నడిపిస్తున్నారని ఆరోపించారు.

రాజధాని పేరిట తన మనుషులతో చంద్రబాబు భూములు కొనిపించారని కృష్ణదాస్‌ ఆరోపించారు. విశాఖలో రాజధాని వద్దంటున్న టీడీపీ నాయకులు నాపై పోటీ చేయగలరా? అని సవాల్‌ విసిరారు. చంద్రబాబు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌ నాయుడు.. ఇలా ఎవరైనా ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలనుకుంటే తాను ఇప్పుడే రాజీనామా చేసి పోటీకి సిద్ధమవుతానని సవాల్‌ చేశారు.