Tirumala Tirupati Devasthanams: టీటీడీ కీలక నిర్ణయం.. ఆ రోజు అందరికీ సర్వదర్శనం మాత్రమే..
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చేనెల 27నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమయంలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని తొలిసారిగా బ్రహ్మోత్సవాల సమయంలో రద్దుచేశారు. అందరికీ సర్వదర్శనం మాత్రమే ఉంటుంది.

Tirumala Tirupati Devasthanams
Tirumala Tirupati Devasthanams: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చేనెల 27నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కొవిడ్ అనంతరం రెండేళ్ల తరువాత స్వామివారి మాడవీధుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈసారి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 27న బ్రహ్మోత్సవాలకు తోడు, పెరటాసీ మాసం ప్రారంభం కానుంది. దీంతో తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.
TTD Kalyanamastu : టీటీడీ కళ్యాణమస్తు తాత్కాలికంగా వాయిదా
ప్రతీ యేటా బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తుంటారు. దీంతో పాటు వృద్ధులు, వికలాంగులు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, శ్రీవాణి ట్రస్టు సేవల భక్తులకు ప్రవేశ దర్శన సౌకర్యాలను నిలిపివేస్తుంటారు. ఈసారి తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకూ శ్రీవారి దర్శనభాగ్యం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని తొలిసారిగా బ్రహ్మోత్సవాల సమయంలో టీటీడీ రద్దు చేస్తుంది. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతి ఒక్కరికి సర్వదర్శనం మాత్రమే ఉంటుంది.
ఇదిలాఉంటే తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శనానికి 18 కంపార్టు మెంట్లలో భక్తులు వేచి ఉండగా వీరికి 12 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. శనివారం శ్రీవారిని 79,525 మంది భక్తులు దర్శించుకోగా, 39,545 మంది తలనీలాల సమర్పించుకున్నారు. 8 నుంచి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.